- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కల్తీ తేలాలంటే 14 రోజులు..!
మెదక్ జిల్లా నర్సాపూర్ మండలం రెడ్డిపల్లి గ్రామంలో కల్తీ పాల తయారీ జరుగుతోందనే అనుమానంతో బుధవారం స్థానిక పోలీసులు, ఫుడ్ సేఫ్టీ అధికారులు దాడులు నిర్వహించారు.

దిశ, నర్సాపూర్ : మెదక్ జిల్లా నర్సాపూర్ మండలం రెడ్డిపల్లి గ్రామంలో కల్తీ పాల తయారీ జరుగుతోందనే అనుమానంతో బుధవారం స్థానిక పోలీసులు, ఫుడ్ సేఫ్టీ అధికారులు దాడులు నిర్వహించారు. స్థానికుల సమాచారం మేరకు రెడ్డిపల్లి గ్రామానికి చెందిన ఓ పాల వ్యాపారి వద్ద ఉదయం 6.30 గంటలకు పోలీసులు తనిఖీలు చేపట్టారు. అనంతరం మధ్యాహ్నం ఫుడ్ సేఫ్టీ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని పాల నమూనాలను సేకరించారు. తనిఖీల్లో పాల పౌడర్, పాలలో కలిపే అనుమానాస్పద లిక్విడ్, ఇతర సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఫుడ్ సేఫ్టీ అధికారి ప్రదీప్ కుమార్ మాట్లాడుతూ.. కల్తీ జరిగిందనే అనుమానంతో పాల నమూనాలను సేకరించి పరీక్షల నిమిత్తం ల్యాబ్‌కు పంపినట్లు తెలిపారు. రెండు లీటర్ల పాలతో పాటు అనుమానాస్పద రసాయన ద్రవం, మిల్క్ మీటర్‌ను సీజ్ చేసినట్లు వెల్లడించారు.
14 పని దినాల్లో నివేదిక..
ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ చట్టం ప్రకారం ల్యాబ్‌కు పంపిన నమూనాల నివేదికలు సుమారు 14 పని దినాల్లో వస్తాయని తెలిపారు. నివేదికల్లో పాలు సబ్‌స్టాండర్డ్ (నాణ్యత ప్రమాణాలకు తగ్గవి), అన్‌సేఫ్ (ఆరోగ్యానికి హానికరమైనవి)గా తేలితే చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని చెప్పారు. ప్రెస్ నోట్ ఇవ్వడం తమ పరిధిలో లేదని, అధికారిక సమాచారం కమిషనర్ ఆఫ్ ఫుడ్ సేఫ్టీ కార్యాలయం ద్వారా విడుదల అవుతుందని ఫుడ్ సేఫ్టీ అధికారి పేర్కొన్నారు.
అనుమానాస్పద కెమికల్ బాటిల్ స్వాధీనం..
దాడుల్లో ఎలాంటి వివరాలు లేని ఓ రసాయన ద్రవం బాటిల్ కూడా లభ్యమైంది. ఈ ద్రవాన్ని పాలలో కలిపితే పాలు విరిగిపోకుండా ఉంటాయని సంబంధిత వ్యాపారి చెప్పినట్లు అధికారులు తెలిపారు. ఆ రసాయన ద్రవాన్ని తాకిన తర్వాత ఒక పోలీసు అధికారి, పాల వ్యాపారి చేతులకు బొబ్బలు వచ్చినట్లు అక్కడ ఉన్న అధికారులు పేర్కొన్నారు. ఆ ద్రవం స్వరూపం ఏమిటి, అది ఆరోగ్యానికి ఎంత ప్రమాదకరమనే విషయం ల్యాబ్ పరీక్షల అనంతరం మాత్రమే స్పష్టమవుతుందని అధికారులు తెలిపారు.






