- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
జీవితాల్లో మార్పు తెచ్చేది చదువొక్కటే.. సీఎం రేవంత్ రెడ్డి ఇంట్రెస్టింగ్ కామెంట్స్
ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేసే టీచర్లకు పూర్తి స్థాయి అర్హతలు, అనుభవం ఉన్నాయని.. అదే ప్రైవేట్ స్కూళ్లలో ఉపాధ్యాయులకు సగం అర్హతలు కూడా ఉండవని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.

దిశ, వెబ్‌డెస్క్: కుటుంబాలలో ఆనందం నింపేది, మనుషుల జీవితాలను మార్చేది కేవలం చదువొక్కటేనని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. వనపర్తి జిల్లా కొత్తకోటలో నూతనంగా నిర్మించిన బాలికల హైస్కూల్‌ను మంత్రులతో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) విద్యా వ్యవస్థ పునర్నిర్మాణంపై పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
అందుకే విద్యాశాఖను నా దగ్గర..
విద్య ప్రాధాన్యతను గుర్తించే తాను విద్యాశాఖను తన వద్దే ఉంచుకున్నానని సీఎం తెలిపారు. గత పదేళ్ల ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల ప్రభుత్వ బడుల్లో కనీస సదుపాయాలు కరువయ్యాయని మండిపడ్డారు. గత ప్రభుత్వంలో ఒకే కుటుంబం కీలక శాఖలన్నింటినీ తమ గుప్పిట్లో పెట్టుకుందని ఆరోపించారు. తెలంగాణ ఏర్పాటు వెనుక విద్యార్థుల ఉద్యమాలు, ఆత్మబలిదానాలు ఉన్నాయని.. రాజకీయ నాయకుల వల్ల కాకుండా విద్యార్థుల వల్లే తెలంగాణకు చట్టబద్ధత వచ్చిందని గుర్తుచేశారు. వారి త్యాగాలకు ప్రతిరూపంగా రాష్ట్రంలో విద్యా వ్యవస్థను పటిష్టం చేయడమే తన ఆకాంక్ష అన్నారు.
ప్రైవేట్ బడులకు ధీటుగా ప్రభుత్వ బడులు
ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేసే టీచర్లకు పూర్తి స్థాయి అర్హతలు, అనుభవం ఉన్నాయని.. అదే ప్రైవేట్ స్కూళ్లలో ఉపాధ్యాయులకు సగం అర్హతలు కూడా ఉండవని సీఎం పేర్కొన్నారు. గత ప్రభుత్వాల నిర్లక్ష్య వైఖరి వల్లే విద్యార్థులు ప్రైవేట్ బడుల వైపు వెళ్లాల్సి వచ్చిందని దుయ్యబట్టారు. రాబోయే రోజుల్లో ప్రభుత్వ బడులను కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా తీర్చిదిద్దుతామని, మార్పు అనేది రాత్రికి రాత్రి రాకపోయినా ఒక మంచి అడుగైతే ముందుకు పడాల్సిందేనని ఆశాభావం వ్యక్తం చేశారు. తాము అధికారంలోకి రాగానే ముందుగా పెండింగ్‌లో ఉన్న టీచర్ల సమస్యలన్నింటినీ పరిష్కరించామని రేవంత్ రెడ్డి తెలిపారు.
విద్యార్థుల భవిష్యత్తు కోసం రాష్ట్రంలోని లక్షకు పైగా ఉపాధ్యాయులు నిరంతరం శ్రమిస్తున్నారని.. ప్రభుత్వం కూడా విద్యపై ఏడాదికి రూ.30 కోట్లు ఖర్చు చేస్తోందని వివరించారు. గత పాలకుల నిర్లక్ష్యం వల్ల గతంలో దేశంలో తెలంగాణ పాఠశాలలు 35వ స్థానంలో ఉండేవని, తమ ప్రభుత్వం తీసుకున్న చర్యల వల్ల ఇప్పుడు ఆ స్థానాన్ని 18వ ర్యాంకుకు తీసుకురాగలిగామని సీఎం వెల్లడించారు. ప్రస్తుతం దేశంలో వైట్ కాలర్ ఉద్యోగాలు తగ్గిపోతున్నాయని.. అందుకే తమ ప్రభుత్వం సాంకేతిక నైపుణ్యాలతో కూడిన బ్లూ కాలర్ ఉద్యోగాలపై ప్రత్యేకంగా దృష్టి సారించిందని సీఎం పేర్కొన్నారు. ఇందులో భాగంగానే రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఐటీఐ (ITI) కేంద్రాలను త్వరలోనే అత్యాధునికంగా తీర్చిదిద్దనున్నట్లుగా సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు.






