- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఇళ్ల మధ్య గోదాంలు.. ప్రజల ప్రాణాలతో చెలగాటమా?
నివాస ప్రాంతాల్లో అనుమతులు లేకుండా ఏర్పాటు చేస్తున్న గోదాంలు ప్రజల ప్రాణాలకు ముప్పుగా మారుతున్నాయనే ఆందోళనకు హస్తినాపురంలోని తాజా అగ్నిప్రమాదం మరో ఉదాహరణగా నిలిచింది.

దిశ, హస్తినాపురం : నివాస ప్రాంతాల్లో అనుమతులు లేకుండా ఏర్పాటు చేస్తున్న గోదాంలు ప్రజల ప్రాణాలకు ముప్పుగా మారుతున్నాయనే ఆందోళనకు హస్తినాపురంలోని తాజా అగ్నిప్రమాదం మరో ఉదాహరణగా నిలిచింది. హస్తినాపురం డివిజన్ పరిధిలోని శ్రీరమణ కాలనీలో ఇళ్ల మధ్య ఉన్న ప్లాస్టిక్ గోదాంలో మంగళవారం అర్ధరాత్రి భారీ అగ్నిప్రమాదం సంభవించింది. మంటలు వేగంగా వ్యాపించి గోదాం పూర్తిగా దగ్ధమవగా, పక్కనే ఉన్న ఓ నూతన ఇంటిలోని ఫర్నిచర్, గృహోపకరణాలు కూడా అగ్నికి ఆహుతయ్యాయి.
స్థానికుల అప్రమత్తతతో పాటు అగ్నిమాపక సిబ్బంది సకాలంలో స్పందించడంతో మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడం ఊరటనిచ్చింది. సమాచారం అందుకున్న వెంటనే ఎల్‌బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి స్థానిక నాయకులతో కలిసి ఘటనాస్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. బాధిత కుటుంబాలను పరామర్శించి వారికి ధైర్యం చెప్పారు. అనంతరం అగ్నిమాపక, రెవెన్యూ తదితర శాఖల అధికారులతో మాట్లాడి సహాయక చర్యలను వేగవంతం చేయాలని ఆదేశించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, నివాస ప్రాంతాల్లో ప్లాస్టిక్ వంటి సులభంగా మంటలు వ్యాపించే వస్తువుల గోదాంలు ఏర్పాటు చేయడం అత్యంత ప్రమాదకరమని అన్నారు. ప్రజల ప్రాణాల కంటే వ్యాపార ప్రయోజనాలు ముఖ్యమవ్వకూడదని పేర్కొన్నారు. ఇలాంటి గోదాంలపై అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని, ప్రజలు కూడా తమ కాలనీల్లో అక్రమ గోదాంలు ఏర్పడకుండా అప్రమత్తంగా ఉండి అధికారులకు సహకరించాలని సూచించారు. అగ్నిప్రమాదంలో నష్టపోయిన కుటుంబాలకు ప్రభుత్వం నుంచి తగిన నష్టపరిహారం అందేలా జిల్లా కలెక్టర్, రెవెన్యూ అధికారులతో చర్చించి అవసరమైన చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో డివిజన్ బీఆర్ఎస్ అధ్యక్షుడు ఆందోజు సత్యంచారి, శ్రీనివాస్ నాయక్, గోపి, మధు, భీమ్ నాయక్, నాగిరెడ్డి, సాయి యాదవ్, బిక్షపతి, విష్ణు, కింగ్ మధు తదితరులు పాల్గొన్నారు.






