గురుగ్రామ్‌లో అమానవీయ ఘటన: కారుతో ఢీకొట్టి.. మృతదేహాన్ని మళ్లీ అక్కడే వదిలేసి!

by Ramesh Naini |

గురుగ్రామ్‌లో ఓ దారుణ ఘటన చోటుచేసుకుంది. అపార్ట్‌మెంట్ పార్కింగ్ స్థలంలో నిద్రిస్తున్న ఓ మహిళను థార్ వాహనంతో ఢీకొట్టిన ఓ వ్యక్తి.. ఆ తర్వాత ఆస్పత్రికి తీసుకెళ్లి, ఆమె మృతి చెందడంతో మృతదేహాన్ని తిరిగి ప్రమాద స్థలంలోనే వదిలేసి వెళ్లినట్లు పోలీసులు వెల్లడించారు.

గురుగ్రామ్‌లో అమానవీయ ఘటన: కారుతో ఢీకొట్టి.. మృతదేహాన్ని మళ్లీ అక్కడే వదిలేసి!
X

దిశ, డైనమిక్ బ్యూరో: గురుగ్రామ్‌లో ఓ దారుణ ఘటన చోటుచేసుకుంది. అపార్ట్‌మెంట్ పార్కింగ్ స్థలంలో నిద్రిస్తున్న ఓ మహిళను థార్ వాహనంతో ఢీకొట్టిన ఓ వ్యక్తి.. ఆ తర్వాత ఆస్పత్రికి తీసుకెళ్లి, ఆమె మృతి చెందడంతో మృతదేహాన్ని తిరిగి ప్రమాద స్థలంలోనే వదిలేసి వెళ్లినట్లు పోలీసులు వెల్లడించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం మహోబా జిల్లాకు చెందిన గుడ్డి (57) గురుగ్రామ్ సెక్టార్ 67లోని అన్సాల్ అరేలియా సొసైటీలో పనిమనిషిగా చేస్తోంది. మంగళవారం సాయంత్రం ఆమె సొసైటీ పార్కింగ్ ఏరియాలో నిద్రిస్తుండగా, ఓ మహిళ తన రెడ్ కలర్ మహీంద్రా థార్ వాహనాన్ని నిర్లక్ష్యంగా రివర్స్ చేస్తూ ఆమెపై నుంచి పోనిచ్చింది. ప్రమాదం జరిగిన వెంటనే తీవ్ర గాయాలపాలైన బాధితురాలిని నిందితురాలు మరో వాహనంలో ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లగా.. అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు.

దీంతో భయాందోళనకు గురైన సదరు మహిళ.. ఆ మృతదేహాన్ని తిరిగి సొసైటీ పార్కింగ్ ఏరియాకు తీసుకొచ్చి, ప్రమాదం జరిగిన చోటే వదిలేసి తన ఫ్లాట్‌కు వెళ్లిపోయినట్లు బాధితురాలి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి కారణమైన మహిళను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు, ఈ ఘటనలో నిర్లక్ష్యం లేదా మరేదైనా నేరం ఉందా అనే కోణంలో దర్యాప్తు కొనసాగుతోందని అధికారులు స్పష్టం చేశారు.

Next Story