- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నిద్రిస్తున్న యువకుడిని హత్య చేసిన గుర్తుతెలియని దుండగులు
సూర్యాపేట జిల్లా కేంద్రంలో మరో దారుణ హత్య చోటుచేసుకోవడంతో స్థానికంగా తీవ్ర కలకలం రేగింది.

దిశ, సూర్యాపేట: సూర్యాపేట జిల్లా కేంద్రంలో మరో దారుణ హత్య చోటుచేసుకోవడంతో స్థానికంగా తీవ్ర కలకలం రేగింది. మున్సిపాలిటీ పరిధిలోని 18వ వార్డు సుందరయ్య నగర్‌లో నివాసం ఉంటున్న భుక్య విజయ్ (28) అనే యువకుడిని గుర్తుతెలియని దుండగులు నిద్రిస్తున్న సమయంలో అత్యంత దారుణంగా హత్య చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ సంఘటనతో ఆ ప్రాంతంలో భయాందోళనలు నెలకొన్నాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, మంగళవారం భుక్య విజయ్ తన ఇంటి వద్ద నిద్రిస్తున్న సమయంలో గుర్తుతెలియని వ్యక్తులు అతనిపై దాడి చేసి హత్య చేసినట్లు ప్రాథమికంగా భావిస్తున్నారు. విజయ్ రక్తపు మడుగులో పడి ఉండటాన్ని గమనించిన కుటుంబ సభ్యులు, స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.
దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు..
సమాచారం అందుకున్న సూర్యాపేట పట్టణ పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. అనంతరం క్లూస్ టీమ్, ఫోరెన్సిక్ నిపుణులను రప్పించి ఘటనా స్థలం నుంచి కీలక ఆధారాలను సేకరించారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం సూర్యాపేట ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి తరలించారు. హత్యకు గల కారణాలు ఇంకా తెలియరాలేదని పోలీసులు తెలిపారు. వ్యక్తిగత కక్షలు, పాత విభేదాలు, ఆర్థిక లావాదేవీలు లేదా ఇతర కారణాలేమైనా ఉన్నాయా అనే కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తున్నారు. మృతుడు భుక్య విజయ్ అక్క ఇచ్చిన ఫిర్యాదు మేరకు సూర్యాపేట పట్టణ సీఐ వెంకటయ్య కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు. నిందితులను గుర్తించి పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపట్టినట్లు పోలీసులు వెల్లడించారు. ఇటీవల సూర్యాపేట జిల్లాలో వరుసగా హత్యలు చోటుచేసుకుంటుండటంతో ప్రజల్లో భద్రతపై ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ ఘటనపై పోలీసులు అన్ని కోణాల్లో విచారణ చేపట్టి నిందితులను త్వరలోనే అరెస్టు చేస్తామని తెలిపారు.






