- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘తలొగ్గడం తప్ప మీకు వేరే గత్యంతరం లేదు’.. ఇరాన్‌కు ట్రంప్ స్ట్రాంగ్ వార్నింగ్
ఇరాన్ - ఇజ్రాయెల్ దాడులపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald Trump) తొలిసారి స్పందించారు.

దిశ, వెబ్‌డెస్క్: ఇరాన్ - ఇజ్రాయెల్ దాడులపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald Trump) తొలిసారి స్పందించారు. ఈ సందర్భంగా ఇజ్రాయెల్ అధ్యక్షుడు నెతన్యాహుతో పాటు ఆయన సైన్యాన్ని అభినందించారు. ఇరాన్‌పై ఇజ్రాయెల్ చేసిన దాడులన్నీ విజయవంతం అయ్యాయని కొనియాడారు. అంతేగాకుండా.. ఇరాన్‌పై దాడిని చారిత్రక క్షణంగా ట్రంప్ అభివర్ణించారు. ఇక ఇరాన్ యుద్ధానికి ముగింపు పలకాల్సిన సమయం వచ్చేసింది.. కాదు కూడదంటూ ఇలాగే మొండిపట్టు పడితే మరింత నష్టపోయేది ఇరాన్ మాత్రమే అని సూచించారు. ఇప్పటికే ఇరాన్‌లోని కీలక అణుస్థావరాలను పూర్తిగా ధ్వంసం చేశాం.. అవసరమైతే దాడులు తీవ్రతరం చేయడానికి కూడా వెనుకాడబోమని హెచ్చరించారు.
తలొగ్గి యుద్ధం ఆపడం తప్ప.. ఇరాన్‌కు మరో ఆప్షన్ లేదని గుర్తుచేశారు. ప్రపంచం ఎదుర్కొంటున్న అణుముప్పును ఆపడమే తమ ముందున్న ప్రధాన లక్ష్యమని తెలిపారు. మధ్య ప్రాచ్య దేశాలను ఇరాన్ భయపెడుతోందని అన్నారు. పశ్చిమాసియాలో శాంతిని నెలకొల్పాల్సిన బాధ్యత ఇరాన్‌దే అని హితవు పలికారు. లేకపోతే.. అమెరికా, ఇజ్రాయెల్ కలిసి దాడులు మరింత రెట్టింపు చేస్తాయని.. ఆ పరిణామాలు ఇరాన్ తట్టుకోలేదు అని అన్నారు.
మరోవైపు ఇరాన్‌పై అమెరికా బాంబులతో విరుచుకుపడింది. ఇరాన్‌లోని కీలక అణుకేంద్రాలపై భారీ దాడులకు పాల్పడింది. ఈ విషయాన్ని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ స్వయంగా ప్రకటించారు. ‘‘భారీ బాంబులు ఫోర్డోపై వేశాం. ఇరాన్ గగనతలం బయట నుంచే ఈ దాడులు చేశాం. విమానాలు సురక్షితంగా తిరుగుముఖం పట్టాయి. అమెరికా యోధులకు అభినందనలు. ప్రపంచంలో మరే మిలిటరీకి ఇది సాధ్యం కాదు. ఇప్పుడు శాంతికి సమయం’’ అని పోస్టు చేశారు.






