- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అమెరికాలో సంచలనం: 5 ఏళ్ల చిన్నారిని నిర్బంధించిన ఇమ్మిగ్రేషన్ అధికారులు
అమెరికా వలసదారులపట్ల కఠినంగా ప్రవర్తిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా మిన్నెసోటా రాష్ట్రంలోని మినియాపోలిస్ నగరంలో సంచలన ఘటన చోటుచేసుకుంది.

దిశ, వెబ్‌డెస్క్: అమెరికా వలసదారులపట్ల కఠినంగా ప్రవర్తిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా మిన్నెసోటా రాష్ట్రంలోని మినియాపోలిస్ నగరంలో సంచలన ఘటన చోటుచేసుకుంది. ప్రీ స్కూల్ నుంచి ఇంటికి వచ్చిన ఐదేళ్ల బాలుడు లియామ్ కొనెహో రామోస్‌ను ఫెడరల్ ఇమిగ్రేషన్ అధికారులు అతని తండ్రితో కలిసి అదుపులోకి తీసుకుని టెక్సాస్‌లోని నిర్బంధ కేంద్రానికి తరలించారు. ఈ ఘటనపై అక్కడి ప్రజలు, ఆ చిన్నారి స్కూల్ సిబ్బంది, ఫ్యామిలీ లాయర్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గత కొన్ని వారాల్లో ఇదే ప్రాంతానికి చెందిన నాలుగో విద్యార్థిని ఇమిగ్రేషన్ అధికారులు అదుపులోకి తీసుకున్న ఘటన ఇది.
మంగళవారం మధ్యాహ్నం కుటుంబం ఇంటి డ్రైవ్‌వేలో కారు నడుస్తుండగానే అధికారులు బాలుడిని తీసుకెళ్లారని కొలంబియా హైట్స్ పబ్లిక్ స్కూల్స్ సూపరింటెండెంట్ జెనా స్టెన్‌విక్ తెలిపారు. ఇంట్లో ఎవరు ఉన్నారో తెలుసుకునేందుకు బాలుడిని తలుపు తట్టమని చెప్పారని, ఐదేళ్ల చిన్నారిని ఎరగా ఉపయోగించారు అంటూ ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ కుటుంబం 2024లో అమెరికాకు వచ్చిందని, వీరికి ఆశ్రయ (అసైలం) కేసు పెండింగ్‌లో ఉందని, దేశం విడిచిపోవాలనే ఆదేశాలు కూడా లేవని అధికారులు తెలిపారు. “ఐదేళ్ల పిల్లాడిని ఎందుకు అరెస్ట్ చేయాలి? అతడు హింసాత్మక నేరస్తుడని చెప్పగలరా?” అంటూ సూపరింటెండెంట్ ప్రశ్నించారు.
అయితే హోంల్యాండ్ సెక్యూరిటీ శాఖ ప్రతినిధి ట్రిషియా మెక్‌లాఫ్లిన్ వివరణ ఇస్తూ, “ఇమ్మిగ్రేషన్ అధికారులు (ICE) బాలుడిని లక్ష్యంగా చేసుకోలేదు. అతని తండ్రి అడ్రియన్ అలెగ్జాండర్ కొనెహో ఆరియాస్ అక్రమంగా అమెరికాలో ఉన్నాడు. అతడు పరారయ్యే ప్రయత్నంలో పిల్లాడిని వదిలిపెట్టి పారిపోయాడు” అని తెలిపారు. పిల్లాడి భద్రత కోసమే ఒక అధికారి అతడితో ఉండగా మిగతా అధికారులు తండ్రిని అదుపులోకి తీసుకున్నారని చెప్పారు. తల్లిదండ్రులకు పిల్లలను తమతో తీసుకెళ్లాలా లేక తమకు ఇష్టమైన వ్యక్తికి అప్పగించాలా అనే ఎంపిక ఇస్తామని తెలిపారు.
కుటుంబ న్యాయవాది మార్క్ ప్రోకోష్ తెలిపిన ప్రకారం.. బాలుడు, అతని తండ్రిని టెక్సాస్‌లోని డిల్లీ నిర్బంధ కేంద్రానికి తరలించారు. వారితో ఇప్పటివరకు ప్రత్యక్షంగా మాట్లాడే అవకాశం లేదని తెలిపారు. చట్టపరమైన మార్గాల్లో లేదా ప్రజా ఒత్తిడి ద్వారా వారిని విడుదల చేయించేందుకు ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు.
ఈ ఘటనపై అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ స్పందిస్తూ, “చిన్నారిని అరెస్ట్ చేయలేదు, కేవలం నిర్బంధించారు. అక్రమ వలసదారుడిని అరెస్ట్ చేయకుండా వదిలేయాలా? పిల్లాడిని చలిలో వదిలేయాలా? అధికారులు ఆ చిన్నారి తండ్రిని మాత్రమే టార్గెట్ చేశారు” అంటూ వ్యాఖ్యానించారు. యూఎస్ మాజీ వైస్ ప్రెసిడెంట్ కమలాహారిస్ ఈ ఘటనను తీవ్రంగా ఖండించారు. ఇమ్మిగ్రేషన్ అధికారులు చిన్నారిని నిర్బంధించడం తనను తీవ్రంగా కలచివేసిందంటూ ఎక్స్ లో పోస్ట్ చేశారు.
ఇదిలా ఉండగా.. గత రెండు వారాల్లో కొలంబియా హైట్స్ పబ్లిక్ స్కూల్స్‌లో విద్యార్థుల హాజరు గణనీయంగా తగ్గిపోయిందని అధికారులు తెలిపారు. ఒకరోజు దాదాపు మూడో వంతు విద్యార్థులు స్కూల్‌కు రాలేదని వెల్లడించారు. “ICE అధికారులు మా పాఠశాలల చుట్టూ తిరుగుతూ, బస్సులను అనుసరిస్తూ పిల్లలను తీసుకెళ్తున్నారు. ఇది తీవ్రమైన మానసిక వేదన కలిగిస్తోంది” అని సూపరింటెండెంట్ ఆవేదన వ్యక్తం చేశారు.






