- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
హోర్ముజ్ జలసంధి మూసివేతతో ప్రపంచానికి ముప్పు: ఐక్యరాజ్యసమితి హెచ్చరిక!
పశ్చిమ ఆసియాలో ఉద్రిక్తతలు పెరుగుతున్న క్రమంలో హోర్ముజ్ జలసంధి సుదీర్ఘకాలంపాటు మూతపడితే ప్రపంచ వ్యాప్తంగా వాణిజ్యం, అభివృద్ధి దెబ్బతింటాయని ఐరాస హెచ్చరించింది.

దిశ, వెబ్‌డెస్క్: పశ్చిమ ఆసియాలో పెరుగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో హోర్ముజ్ జలసంధి (Strait of Hormuz) ఎక్కువకాలం పాటు మూతపడితే ప్రపంచ వాణిజ్యం, అభివృద్ధి తీవ్రంగా దెబ్బతింటాయని ఐక్యరాజ్యసమితి (United Nations) హెచ్చరించింది. దీనివల్ల ప్రపంచవ్యాప్తంగా ఆహార ధరలు పెరగడమే కాకుండా జీవన వ్యయం (Cost of Living) భారమవుతుందని ఐక్యరాజ్యసమితి వాణిజ్య, అభివృద్ధి సంస్థ (UNCTAD) మంగళవారం విడుదల చేసిన నివేదికలో పేర్కొంది.
ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్ దాడులు, ప్రతిగా ఇరాన్ ప్రతీకార చర్యల వల్ల హోర్ముజ్ జలసంధి ద్వారా జరగాల్సిన రవాణాకు తీవ్ర అంతరాయం కలిగింది. ఫిబ్రవరి 28న దాడులు మొదలైనప్పటి నుండి ఈ మార్గంలో ఓడల రాకపోకలు 97 శాతం పడిపోయాయి. ప్రపంచవ్యాప్తంగా సముద్ర మార్గం ద్వారా జరిగే చమురు రవాణాలో నాలుగో వంతు (25%) ఈ జలసంధి ద్వారానే జరుగుతుంది. 2024 గణాంకాల ప్రకారం.. రోజుకు సుమారు 20 మిలియన్ బ్యారెళ్ల చమురు ఈ మార్గం గుండా వెళ్తుంది.
చమురు సరఫరా దాదాపు పడిపోవడంతో దాని ఎఫెక్ట్ గ్యాస్ సిలిండర్లపై పడింది. గ్యాస్ ధరలు, ఎరువుల ధరలు, చమురు ధరలు పెరిగితే ఆహార ధరలు పెరుగుతాయని UNCTAD వివరించింది. ముఖ్యంగా పేద దేశాలపై ఈ ప్రభావం తీవ్రంగా ఉంటుంది. ఈ మార్గం ద్వారా రవాణా అయ్యే చమురులో 84 శాతం ఎల్ఎన్‌జీ (LNG) గ్యాస్‌లో 83 శాతం ఆసియా దేశాలకే వెళ్తుంది. జలసంధి మూసివేత వల్ల ఆసియాలో ఇంధన సంక్షోభం ఏర్పడే అవకాశం ఉందని ఐక్యరాజ్యసమితి హెచ్చరించింది.
ఆర్థిక సంక్షోభం పొంచి ఉందా?
అంతర్జాతీయ చట్టాలకు లోబడి సముద్ర మార్గాల్లో రవాణా భద్రతను కాపాడాలని, ఉద్రిక్తతలను తగ్గించాలని ఐరాస సెక్రటరీ జనరల్ ప్రతినిధి స్టీఫన్ డుజారిక్ కోరారు. ఇప్పటికే అప్పుల భారంతో ఉన్న అభివృద్ధి చెందుతున్న దేశాలకు, పెరిగిన ఇంధన, రవాణా ఖర్చులు కోలుకోలేని దెబ్బ తీస్తాయని నివేదిక స్పష్టం చేసింది.






