భారత్ ఎఫెక్ట్: పాకిస్తాన్‌కు యూఏఈ భారీ షాక్.. ఆ డీల్ రద్దు!

by Ramesh Naini |

పాకిస్తాన్‌కు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) గట్టి షాక్ ఇచ్చింది. ఆగస్టు 2025 నుంచి ఇరు దేశాల మధ్య ఈ ఒప్పందంపై చర్చలు జరుగుతుండగా, చివరి నిమిషంలో యూఏఈ వెనక్కి తగ్గడం దాయాది దేశానికి ఊహించని దెబ్బగా మారింది.

భారత్ ఎఫెక్ట్: పాకిస్తాన్‌కు యూఏఈ భారీ షాక్.. ఆ డీల్ రద్దు!
X

దిశ, డైనమిక్ బ్యూరో : పాకిస్తాన్‌కు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) గట్టి షాక్ ఇచ్చింది. ఇస్లామాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయ నిర్వహణ బాధ్యతలను చేపట్టాలన్న ప్రతిపాదనను యూఏఈ ఆకస్మికంగా విరమించుకుంది. ఆగస్టు 2025 నుంచి ఇరు దేశాల మధ్య ఈ ఒప్పందంపై చర్చలు జరుగుతుండగా, చివరి నిమిషంలో యూఏఈ వెనక్కి తగ్గడం దాయాది దేశానికి ఊహించని దెబ్బగా మారింది.

మోడీతో భేటీ ఎఫెక్ట్?

ఇటీవల యూఏఈ అధ్యక్షుడు షేక్ నహ్యాన్ భారత్‌లో పర్యటించారు. ఢిల్లీలో ఆకస్మికంగా మూడు గంటల పాటు గడిపారు. ఈ క్రమంలోనే ప్రధాని మోడీతో రక్షణ ఒప్పందాలపై కీలక చర్చలు జరిపారు. అయితే చర్చలు జరిపిన కొద్ది రోజులకే పాక్‌తో ఎయిర్‌పోర్ట్ డీల్ రద్దు కావడం గమనార్హం. ఎయిర్‌పోర్ట్ నిర్వహణ కోసం తగిన స్థానిక భాగస్వామి (Local Partner) దొరకలేదని యూఏఈ అధికారికంగా చెబుతున్నప్పటికీ, దీని వెనుక బలమైన రాజకీయ కారణాలు ఉన్నట్లు 'ది ఎక్స్‌ప్రెస్ ట్రిబ్యూన్' పత్రిక పేర్కొంది. ఒకవైపు పాకిస్తాన్, సౌదీ అరేబియా, టర్కీలతో కలిసి 'ఇస్లామిక్ నాటో' ఏర్పాటు దిశగా అడుగులు వేస్తుండగా.. యూఏఈ మాత్రం భారత్‌తో రక్షణ బంధాన్ని (Strategic Defence Partnership) బలోపేతం చేసుకుంటోంది. సౌదీ-యూఏఈ మధ్య పెరుగుతున్న అంతరం కూడా పాక్‌పై ప్రభావం చూపినట్లు తెలుస్తోంది.

పాకిస్తాన్‌లో రాజకీయ అస్థిరత, ప్రభుత్వ రంగ సంస్థల నిర్వహణలో వైఫల్యాలు, భద్రతా కారణాల దృష్ట్యా యూఏఈ అక్కడి పెట్టుబడులపై నమ్మకం కోల్పోయినట్లు తెలుస్తోంది. మొత్తానికి, ఆఫ్ఘనిస్తాన్ వంటి క్లిష్టమైన ప్రాంతాల్లోనూ విమానాశ్రయాలను నిర్వహించిన అనుభవం ఉన్న యూఏఈ.. పాకిస్తాన్ ప్రాజెక్టు నుంచి తప్పుకోవడం ఆ దేశ ఆర్థిక, దౌత్యపరమైన వైఫల్యానికి నిదర్శనంగా నిలుస్తోంది.

Next Story