వీధి కుక్క కోసం రెండు దేశాల గొడవ.. ‘కారామెల్ డాగ్’ మాదంటే మాదంటున్న పెద్ద దేశాలు

by Ramesh Naini |   (  Updated:2026-06-04 16:42:48  IST  )

సాధారణంగా దేశాల మధ్య సరిహద్దు వివాదాలు లేదా వాణిజ్య యుద్ధాలు జరగడం చూస్తుంటాం. కానీ, ఒక వీధి కుక్క జాతి కోసం రెండు పెద్ద దేశాలు సోషల్ మీడియా వేదికగా కొట్టుకుంటున్న విచిత్రమైన ఘటన ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.

వీధి కుక్క కోసం రెండు దేశాల గొడవ.. ‘కారామెల్ డాగ్’ మాదంటే మాదంటున్న పెద్ద దేశాలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: సాధారణంగా దేశాల మధ్య సరిహద్దు వివాదాలు లేదా వాణిజ్య యుద్ధాలు జరగడం చూస్తుంటాం. కానీ, ఒక వీధి కుక్క జాతి కోసం రెండు పెద్ద దేశాలు సోషల్ మీడియా వేదికగా కొట్టుకుంటున్న విచిత్రమైన ఘటన ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ముదురు గోధుమ రంగులో ఉండే ‘కారామెల్ డాగ్’ (Caramelo) అనే శునక జాతి కోసం బ్రెజిల్, మెక్సికో దేశాల మధ్య సాంస్కృతిక యుద్ధం నడుస్తోంది.

300 జాతుల సమ్మేళనం.. మా సంస్కృతికి ప్రతీక

బ్రెజిల్‌లోని ప్రతి వీధిలోనూ కనిపించే ఈ కారామెలో శునకాన్ని అక్కడి ప్రజలు తమ దేశ చరిత్ర, ఆత్మగౌరవానికి ప్రతీకగా భావిస్తారు. శతాబ్దాల క్రితం పోర్చుగీసు, ఇటలీ, జర్మనీ, స్పెయిన్, జపాన్ దేశాల వలసదారులు తెచ్చిన దాదాపు 300 విభిన్న శునక జాతుల సమ్మేళనమే ఈ కారామెలో డాగ్ అని వారి నమ్మకం. ఇది బ్రెజిలియన్ల జీవితంలో ఎంతలా భాగమైపోయిందంటే.. మీమ్స్, టీ-షర్ట్స్ నుంచి నెట్‌ఫ్లిక్స్ సినిమాల వరకు దీనిదే హవా. బ్రెజిల్ అధికారిక కరెన్సీ నోట్లపై ఈ కుక్క చిత్రాన్ని ముద్రించాలని గతంలో ఆన్‌లైన్‌లో పెట్టిన పిటిషన్‌కు ఏకంగా 50 వేల మందికి పైగా మద్దతు పలకడం విశేషం.

వివాదానికి కారణమైన మెక్సికో నిర్ణయం..

ఈ కారామెలో జాతికి తమ చరిత్రతో బలమైన సంబంధాలు ఉన్నాయని, ఇది తమ సంస్కృతిలో అంతర్భాగమని చెబుతూ మెక్సికో పర్యావరణ సంస్థ దీనిని తమ జాతీయ చిహ్నంగా అధికారికంగా గుర్తించింది. మెక్సికో తీసుకున్న ఈ నిర్ణయంపై బ్రెజిల్ పౌరులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ‘కారామెలో కుక్క బ్రెజిల్‌కు మాత్రమే సొంతం. మా దేశ సంస్కృతిని, మా వీధి కుక్కను దొంగిలించే హక్కు మీకు ఎవరు ఇచ్చారు?’ అంటూ సోషల్ మీడియా వేదికగా మెక్సికోపై డిజిటల్ యుద్ధానికి దిగారు.

జంతు ప్రేమికుల ఆవేదన వేరు..

ఈ సాంస్కృతిక వివాదం పక్కనపెడితే, జంతు సంక్షేమ కార్యకర్తలు మరో వాదనను తెరపైకి తెస్తున్నారు. ఇరు దేశాల వాతావరణ పరిస్థితులు, చరిత్ర ఒకేలా ఉన్నాయని, కాబట్టి ఈ శునకం మొత్తం లాటిన్ అమెరికాకే సొంతమని వారు అంటున్నారు. కాగా, బ్రెజిల్‌లో ఉన్న సుమారు 2 కోట్ల వీధి కుక్కల్లో 90 శాతం కారామెలో జాతికి చెందినవే ఉన్నాయి. ఈ కుక్కల జన్యువుల్లో వైవిధ్యం ఉండటం వల్ల ఇవి చాలా ఆరోగ్యంగా, ధృడంగా ఉంటాయి. ఈ జాతి బ్రెజిల్‌దా లేక మెక్సికోదా అన్న పట్టింపులు పక్కనపెట్టి.. వాటిని కేవలం వీధి కుక్కలుగా వదిలేయకుండా దత్తత తీసుకుని ఆశ్రయం, ఆప్యాయత పంచాలని రెండు దేశాల జంతు ప్రేమికులు కోరుతున్నారు.

Next Story