విద్యార్థులను క్లాసులకు రానివ్వడం లేదు : వీసీకి ఫిర్యాదు చేసిన పేరెంట్స్

by Muthe.Rajitha |

కరీంనగర్‌లోని ప్రతిమ మెడికల్ కాలేజీ, చెల్మెడ మెడికల్ కాలేజీల యాజమాన్యాలు విద్యార్థులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాయని తల్లిదండ్రులు యూనివర్సిటీకి ఫిర్యాదు చేశారు.

విద్యార్థులను క్లాసులకు రానివ్వడం లేదు : వీసీకి ఫిర్యాదు చేసిన పేరెంట్స్
X

దిశ, తెలంగాణ బ్యూరో : మెడికల్ విద్యార్థుల నుంచి అదనపు ఫీజులు డిమాండ్ చేస్తూ, వారిని క్లాసులు, ఇంటర్న్‌షిప్‌లకు రానివ్వకుండా వేధిస్తున్న ప్రైవేట్ మెడికల్ కాలేజీలపై చర్యలు తీసుకోవాలని కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం (కేఎన్ఆర్ యూహెచ్ఎస్)లో మెడికో పేరెంట్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు మల్లోజుల సత్యనారాయణ చారి ఆధ్వర్యంలో గురువారం తల్లిదండ్రులు యూనివర్సిటీ అధికారులను కలిసి ఫిర్యాదు చేశారు. కరీంనగర్‌లోని ప్రతిమ మెడికల్ కాలేజీ, చెల్మెడ మెడికల్ కాలేజీల యాజమాన్యాలు విద్యార్థులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాయని బాధితులు పేర్కొన్నారు. సాదారణంగా కోర్సు వ్యవధికి సరిపడా నాలుగున్నర సంవత్సరాల ఫీజును పూర్తిగా చెల్లించినప్పటికీ.. అదనంగా మరో అర సంవత్సరం (హాఫ్ ఇయర్) ఫీజు కడితేనే ఇంటర్న్‌షిప్‌నకు అనుమతిస్తామంటూ కాలేజీల యాజమాన్యాలు మెలిక పెడుతున్నాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఫీజు కట్టని విద్యార్థులను క్లాసులకు కూడా రానివ్వడం లేదని ఫిర్యాదులో వివరించారు. వీసీ డా.రమేష్ రెడ్డిని తల్లిదండ్రుల కమిటీ కలిసి పరిస్థితిని వివరించింది. దీనిపై వీసీ సానుకూలంగా స్పందించారు.

అదనపు ఫీజుల వ్యవహారంలో సదరు కాలేజీలకు ఇప్పటికే మూడుసార్లు నోటీసులు జారీ చేశామని... ఈ అంశాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి సదరు ప్రైవేట్ కాలేజీలపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారని తల్లితండ్రులు తెలిపారు. రాష్ట్రంలోని పలు ప్రైవేట్ మెడికల్ కాలేజీలు ఫీజుల పేరుతో విద్యార్థులను, వారి తల్లిదండ్రులను మానసిక వేధింపులకు గురిచేస్తున్నాయని సత్యనారాయణ చారి మండిపడ్డారు. ప్రభుత్వం, యూనివర్సిటీ అధికారులు తక్షణమే జోక్యం చేసుకుని ప్రైవేట్ యాజమాన్యాల దోపిడీకి అడ్డుకట్ట వేయాలని, తద్వారా తల్లిదండ్రులపై పడుతున్న వందల కోట్ల అదనపు భారాన్ని తొలగించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో విద్యార్థుల తల్లిదండ్రులు చంద్రశేఖర్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, రాజేందర్, రావుల మధు, యాదగిరి, మురళి రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Next Story