"పేద దేశాల ప్రజలు వస్తే.. మనమూ పేదలమవుతాం" : డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యలపై తీవ్ర దుమారం

by Naga Rani Yarlagadda |

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ట్రూత్ సోషల్ వేదికగా మరోసారి థర్డ్ వరల్డ్ అంటూ చేసిన వ్యాఖ్యలపై తీవ్ర దుమారం రేగుతోంది.

పేద దేశాల ప్రజలు వస్తే.. మనమూ పేదలమవుతాం : డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యలపై తీవ్ర దుమారం
X

దిశ, వెబ్‌డెస్క్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ట్రూత్ సోషల్ వేదికగా మరోసారి థర్డ్ వరల్డ్ అంటూ చేసిన వ్యాఖ్యలపై తీవ్ర దుమారం రేగుతోంది. పేద దేశాల నుంచి మనదగ్గరికి ప్రజలు వస్తే మనమూ పేదలమవుతామని చేసిన పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది. ఈ వివాదాస్పద వ్యాఖ్యలపై నెటిజన్లు మండిపడుతున్నారు. "దురదృష్టవశాత్తూ, మీరు థర్డ్ వరల్డ్ దేశాల నుండి ప్రజలను దిగుమతి చేసుకుంటే, మీరు కూడా త్వరలోనే థర్డ్ వరల్డ్ దేశంగా మారిపోతారు. ఆ తర్వాత మీరు చేయగలిగింది ఏమీ ఉండదు. మేక్ అమెరికా గ్రేట్ అగైన్!" అని ట్రంప్ తన పోస్ట్‌లో పేర్కొన్నారు. థర్డ్ వరల్డ్ అని ఏ దేశాలను ఉద్దేశించి మాట్లాడుతున్నారంటూ ట్రంప్ పై నెటిజన్లు ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు.

ఇతర దేశాల నుంచి అమెరికాకు పెరుగుతున్న వలసలపై మొదటి నుంచి కఠిన వైఖరి అవలంబిస్తున్న ట్రంప్.. అమెరికా ఫస్ట్ అనే ఆర్థిక విధానంలో భాగంగానే మరోసారి ఈ వ్యాఖ్యలు చేశారు. అగ్రరాజ్యానికి పెద్దఎత్తున వలసలు, నైపుణ్యం లేని కార్మికులు అమెరికాకు రావడం వల్ల అమెరికన్ల ఉద్యోగాలకు పోటీ పెరగడమే కాకుండా.. వారి వేతనాలు కూడా తక్కువగా ఉంటున్నాయని ట్రంప్ వాదిస్తున్న విషయం తెలిసిందే.

హెచ్-1బీ (H-1B) వీసాలపై కఠిన నిబంధనలు

తన రెండో విడత పదవీ కాలంలో ట్రంప్ ప్రభుత్వం అటు చట్టపరమైన, ఇటు అక్రమ వలసల మార్గాలను అడ్డుకోవడానికి పలు కీలక చర్యలు చేపట్టింది. అందులో భాగంగానే హెచ్-1బీ వీసా ప్రోగ్రామ్‌లో భారీ మార్పులను ప్రతిపాదించింది. వీసా దరఖాస్తు రుసుమును ఏకంగా $100,000 (లక్ష డాలర్లు) కు పెంచడంతో పాటు, ప్రస్తుతం ఉన్న లాటరీ విధానాన్ని రద్దు చేసి వేతనం, నైపుణ్యం ఆధారిత ఎంపిక విధానాన్ని తీసుకురావాలని ట్రంప్ యంత్రాంగం భావించింది. అయితే.. ఈ ఫీజు పెంపును ఇటీవల ఒక ఫెడరల్ జడ్జి అడ్డుకోగా, దీనిపై డిపార్ట్‌మెంట్ ఆఫ్ జస్టిస్ (DoJ) కోర్టులో అప్పీల్ చేసింది.

Next Story