- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
గుర్తింపు కార్డుగా ఆధార్ వినియోగం.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సుప్రీం నోటీసులు
ప్రతి దానికి ఆధార్ నే ప్రధాన ఐడెంటిటీ కార్డుగా వాడటంపై వివరణ ఇవ్వాలని సుప్రీంకోర్టు కేంద్ర, రాష్ట్ర, కేంద్రపాలిత ప్రాంతాలకు నోటీసులు జారీ చేసింది.

దిశ, వెబ్‌డెస్క్: దేశంలో ప్రతీపౌరుడు నేటివిటీ, బర్త్, వ్యక్తిగత గుర్తింపు కార్డుగా ఆధార్ కార్డును వాడుతున్న విషయం తెలిసిందే. ఆధార్ ప్రతి ఒక్కరి జీవితంలో ముఖ్యమైన కార్డుగా మారింది. అయితే UIDAI నుంచి పొందిన ఆధార్ కార్డుల్ని కొందరు పౌరసత్వం, స్థానికత, నివాస ధృవీకరణ పత్రాలుగా దుర్వినియోగం చేస్తున్నారని ఇటీవల సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్ పై ధర్మాసనం మంగళవారం విచారణ చేపట్టింది. దీనిపై స్పందించాలని పేర్కొంటూ కేంద్ర ప్రభుత్వం సహా.. అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు నోటీసులు జారీ చేసింది. ఆధార్ ను కేవలం ఒక వ్యక్తి గుర్తింపును ధృవీకరించే పత్రంగా మాత్రమే పరిగణించేలా స్పష్టమైన ఆదేశాలివ్వాలని పిటిషన్ కోరింది.
అడ్వకేట్ అశ్వినికుమార్ ఉపాధ్యాయ్ దాఖలు చేసిన ఈ పిటిషన్ ను చీఫ్ జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ వి. మోహనాలతో కూడిన ధర్మాసనం విచారించింది. కేంద్రం, రాష్ట్రాలు, కేంద్ర ఎన్నికల సంఘం దీనిపై సమాధానాలను సమర్పించాలని ఆదేశిస్తూ.. ప్రస్తుతం కోర్టులో పెండింగ్ లో ఉన్న ఇతర కేసులతో దీనిని కూడా జతచేసింది. న్యాయవాది అశ్వినిదూబే ఈ పిటిషన్లో కీలక అంశాలను లేవనెత్తారు. ఆధార్ చట్టం 2016లోని సెక్షన్ 9 ప్రకారం ఆధార్ కార్డు అనేది పౌరసత్వానికి, స్థానికతకు ఎట్టిపరిస్థితుల్లోనూ సాక్ష్యం కాదన్నారు. ఆధార్ కేవలం గుర్తింపు కార్డు మాత్రమేనని UIDAI ఆగస్టు 22,2023 నాడు జారీ చేసిన నోటిఫికేషన్లో పేర్కొందన్నారు. ఈ నిబంధనలు ఉన్నప్పటికీ, పాఠశాల ప్రవేశాలు, ఆస్తుల కొనుగోళ్లు, పుట్టిన తేదీ ధృవీకరణ పత్రాలు, రేషన్ కార్డులు, డ్రైవింగ్ లైసెన్స్‌ల కోసం ఆధార్‌ను వాడుతున్నారన్నారు. చివరకు కొత్త ఓటరు నమోదు ఫారమ్-6 లో కూడా దీనిని పుట్టిన తేదీ, నివాస ధృవీకరణగా అంగీకరిస్తున్నారని పిటిషన్ లో పేర్కొన్నారు. చొరబాటుదారులు ఈ లొసుగులను వాడుకుని దేశంలోకి అక్రమంగా చొరబడి, ఆధార్ ను ఈజీగా పొంది ఇక్కడ స్థానికులుగా చలామణి అవుతూ దేశానికి ముప్పు తలపెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
వెంటనే కమిటీ ఏర్పాటు చేయాలి
ఓటరు నమోదు ప్రక్రియలో ప్రస్తుతం ఉన్న వెరిఫికేషన్ విధానం లోపభూయిష్టంగా ఉందని, సరైన ఆధారాలు లేనివారు సైతం ఓటరు జాబితాలోకి చేరే ప్రమాదం ఉందని దూబే పిటిషన్లో తెలిపారు. వెంటనే ఎన్నికల ప్రక్రియల్లో వెరిఫికేషన్ విధానాన్ని పునర్వ్యవస్థీకరించాలని, దీనిని పర్యవేక్షించేందుకు సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి, సైబర్ సెక్యూరిటీ, ఫోరెన్సిక్ నిపుణులతో కూడిన ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేయాలని పిటిషనర్ కోర్టును అభ్యర్థించారు.






