ఏళ్ల నిరీక్షణకు తెర.. మండల పరిషత్ సొంత కార్యాలయం సిద్ధం

by Jakkula.Mamatha |

మండల ప్రజల ఎన్నో ఏళ్ల కల సాకారం కానుంది.

ఏళ్ల నిరీక్షణకు తెర.. మండల పరిషత్ సొంత కార్యాలయం సిద్ధం
X

దిశ,కడ్తాల్: మండల ప్రజల ఎన్నో ఏళ్ల కల సాకారం కానుంది. కడ్తాల్ మండల పరిషత్ అభివృద్ధి అధికారి(ఎంపీడీవో) కార్యాలయం నూతన భవనం నిర్మాణం పూర్తై ప్రారంభానికి సిద్ధమైంది. రూ.1 కోట్ల వ్యయంతో ఆధునిక సౌకర్యాలతో నిర్మించిన ఈ భవనాన్ని ఈ నెల 22న నాగర్‌కర్నూల్ పార్లమెంట్ సభ్యుడు డాక్టర్ మల్లు రవి, ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి ప్రారంభించనున్నారు. ఇందుకోసం అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు. కడ్తాల్ మండలం 2016 లో ఏర్పడినప్పటి నుంచి ఎంపీడీవో కార్యాలయం అద్దె భవనంలోనే కొనసాగుతోంది.

మండల ప్రజలకు మెరుగైన పరిపాలన సేవలు అందించాలనే లక్ష్యంతో 2023లో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం(ఎన్‌ఆర్‌ఈజీఎస్) నిధుల కింద రూ.50 లక్షలు మంజూరయ్యాయి.అయితే ఆ నిధులు భవన నిర్మాణానికి సరిపోకపోవడంతో పనులు కొంతకాలం నిలిచిపోయాయి. తర్వాత ప్రజా ప్రతినిధులు,స్థానిక నాయకుల ప్రత్యేక చొరవతో అదనంగా మరో రూ.50 లక్షలు సమకూరడంతో మొత్తం రూ.1 కోట్ల వ్యయంతో నిర్మాణ పనులు పూర్తి చేశారు. ప్రస్తుత భవనానికి తుది మెరుగులు దిద్దుతున్న అధికారులు ప్రారంభోత్సవాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు వేగవంతం చేస్తున్నారు.

ప్రజలకు మరింత చేరువలో సేవలు: కడ్తాల్ ఎంపీడీవో సుజాత

నూతన కార్యాలయం అందుబాటులోకి రావడంతో మండల ప్రజలకు ప్రభుత్వ సేవలు ఒకేచోట సులభంగా లభించనున్నాయి. అలాగే అధికారులకు, సిబ్బందికి మెరుగైన వసతులు కల్పించబడటంతో పరిపాలనా వ్యవస్థ మరింత సమర్థవంతంగా పనిచేసే అవకాశం ఉందని ఎంపీడీవో సుజాత పేర్కొంటున్నారు.

అభివృద్ధికి మరో మైలురాయి: కడ్తాల్ సర్పంచ్ రాయికంటి బిక్షపతి

మండల కేంద్రంలో ఆధునిక హంగులతో నిర్మించిన ఈ కార్యాలయం కడ్తాల్ అభివృద్ధికి మరో మైలురాయిగా నిలవనుందని స్థానిక సర్పంచ్ రాయి కంటి బిక్షపతి హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని నిర్మించిన ఈ భవనం భవిష్యత్తులో మండల పరిపాలనకు కేంద్రబిందువుగా మారనుందని ప్రజలు,నాయకులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

Next Story