పవన్ కల్యాణ్ ముసుగులో తెలంగాణలో బీజేపీ ప్లాన్: మహేశ్ కుమార్ గౌడ్

by Prasad Jukanti |   (  Updated:2026-06-20 09:49:39  IST  )

తెలంగాణ గడ్డపై జనసేన దృష్టిసారించిన నేపథ్యంలో టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ కీలక వ్యాఖ్యలు చేశారు.

పవన్ కల్యాణ్ ముసుగులో తెలంగాణలో బీజేపీ ప్లాన్: మహేశ్ కుమార్ గౌడ్
X

దిశ, తెలంగాణ బ్యూరో/డైనమిక్ బ్యూరో: పవన్‍ కల్యాణ్‍ను బూచిగా చూపెట్టి తెలంగాణలో బీజేపీ పాగా వేయాలని చూస్తోందని కానీ తెలంగాణలో బీజేపీకి స్థానం లేదని టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు. రాష్ట్రంలో మళ్ళీ వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని ధీమా వ్యక్తం చేశారు. ఇవాళ గాంధీ భవన్‍లో మీడియాతో మాట్లాడిన ఆయన.. అధికారంలో శాశ్వతంగా ఉండటం కోసం ఎంత దూరమైన వెళ్తున్నారని బీజేపీ చెప్పిందే రాజ్యాంగం అనేలా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ప్రాంతీయ పార్టీలను చీల్చుతున్నారని ఆరోపించారు. యూనివర్సిటీల్లోకి దూరి బీజేపీ రఘుపతి రాజారాం పేరును మరిచిపోయి గాడ్సే జపం చేస్తోందని టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ విమర్శించారు. గాడ్సే రాజ్యం స్థాపించాలని వ్యూహంతో సొంత ఎజెండాను తీసుకొచ్చి జనాలపై రుద్దుతున్నారని దుయ్యబట్టారు.

భ్రష్టు పట్టిస్తున్నారు:

ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఉన్న ఉద్యోగాలు ఊడగొడుతున్నారని, 90 శాతం సంపద బీజేపీ నేతల అనునయుల చేతిలో ఉందన్నారు. ఆర్ఎస్ఎస్ భావాలు గల వ్యక్తులు యూనివర్సిటీల్లో దూరి వ్యవస్థను భ్రష్టు పట్టిస్తున్నారని హాట్ కామెంట్స్ చేశారు. బార్డర్‍లో చైనా భారత భూభాగంలోకి చొచ్చుకొస్తా ఉంటే బీజేపీ ఆ విషయం మాట్లాడటం లేదన్నారు. రాహుల్ గాంధీ లోక్ సభలో ఈ విషయాన్ని ఫోటోలతో సహా చూపించారన్నారు. గాంధీ కుటుంబం త్యాగ మూర్తుల కుటుంబం అని నెహ్రూ,గాంధీ గురించి అసత్యాలు ప్రచారం చేస్తున్నారన్నారు. దేశం కోసం ఇందిర గాంధీ, రాజీవ్ గాంధీ ప్రాణాలు అర్పించారని గుర్తు చేశారు.

ఆయన్ను ఉరి తీసినా తప్పులేదు:

మీనాక్షి నటరాజన్ నామినేషన్ విషయంలో దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారని అసలు కేసు లేకుండా నామినేషన్ రిజెక్ట్ చేసిన రిటర్నింగ్ ఆఫీసర్‍ను ఉరి తీసినా తప్పులేదన్నారు. జార్ఖండ్‍లో అంబానీ తరపు వ్యక్తికి సరైన పత్రాలు లేకున్నా మరోసారి అవకాశం ఇచ్చారని ఆరోపించారు. దేవుడు పేరు చెప్పకుండా బీజేపీ నేతలు గెలిచే దమ్ముందా? అని ప్రశ్నించారు. ఉదయం లేస్తే దేవుడి పేరు జపం చేస్తారన్నారు. లౌకిక వాదం ఉన్న వారి ఓట్లు తొలగించే కుట్ర చేస్తున్నారని ఆరోపించారు.

Next Story