డీఎంకేతో 60 ఏళ్ల బంధానికి ముస్లిం లీగ్ గుడ్‌బై.. కారణం అదే!

by Ramesh Naini |

తమిళనాడు రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. వామపక్షాల బాటలోనే నడుస్తూ, (ద్రవిడ మున్నేట్ర కజగం) డీఎంకేతో దాదాపు 60 ఏళ్లుగా ఉన్న దీర్ఘకాలిక రాజకీయ బంధానికి ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ ముగింపు పలికింది.

డీఎంకేతో 60 ఏళ్ల బంధానికి ముస్లిం లీగ్ గుడ్‌బై.. కారణం అదే!
X

దిశ, డైనమిక్ బ్యూరో: తమిళనాడు రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. వామపక్షాల బాటలోనే నడుస్తూ, (ద్రవిడ మున్నేట్ర కజగం) డీఎంకేతో దాదాపు 60 ఏళ్లుగా ఉన్న దీర్ఘకాలిక రాజకీయ బంధానికి ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ (IUML) ముగింపు పలికింది. చెన్నైలో జరిగిన పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు పార్టీ జాతీయ అధ్యక్షుడు ఖాదర్ మొహిదీన్ శనివారం అధికారికంగా ప్రకటించారు.

విజయ్ ప్రభుత్వంలో చేరడమే కారణం

ఇటీవల జరిగిన 2026 అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే కూటమిలో భాగంగా పాపనాశం, వానియంబాడి స్థానాల నుంచి పోటీ చేసిన ముస్లిం లీగ్.. ఆ రెండు చోట్లా విజయం సాధించింది. అయితే, ఎన్నికల అనంతరం ముఖ్యమంత్రి సీ. జోసెఫ్ విజయ్ నేతృత్వంలోని టీవీకే (TVK) ప్రభుత్వానికి మద్దతు ప్రకటించింది. పాపనాశం ఎమ్మెల్యే ఏ.ఎం. షాజహాన్‌కు విజయ్ కేబినెట్‌లో మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రిగా అవకాశం దక్కింది. టీవీకే ప్రభుత్వంలో భాగస్వామిగా ఉంటూ.. డీఎంకే కూటమిలో కొనసాగడం సరికాదని భావించే లీగ్ ఈ నిర్ణయం తీసుకుంది.

1962 నుంచి మైత్రి

1962లో తొలిసారిగా డీఎంకేతో జతకట్టిన ముస్లిం లీగ్, తాజా పరిణామాలతో ఆ సుదీర్ఘ మైత్రికి అధికారికంగా తెరదించింది. రాబోయే ఉప ఎన్నికలు లేదా స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో భవిష్యత్ రాజకీయ పొత్తులపై తగిన నిర్ణయం తీసుకుంటామని పార్టీ నాయకత్వం స్పష్టం చేసింది. మొత్తంగా, ఇద్దరు ఎమ్మెల్యేలు ఉన్న ముస్లిం లీగ్‌కు టీవీకే మంత్రి పదవి ఆఫర్ చేయడమే ఆ పార్టీ డీఎంకే కూటమి నుంచి బయటకు రావడానికి ప్రధాన కారణంగా నిలిచింది.

Next Story