కనగల్‌లో సీఎం సభకు ముమ్మర ఏర్పాట్లు.. మంత్రి

by Batti.Sumithra |

నల్లగొండ జిల్లా కనగల్ మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డు సమీపంలో నిర్మించనున్న హ్యామ్ (HAM) రోడ్ల శంకుస్థాపన ఏర్పాట్లను శనివారం మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పరిశీలించారు.

కనగల్‌లో సీఎం సభకు ముమ్మర ఏర్పాట్లు.. మంత్రి
X

దిశ, నల్లగొండ బ్యూరో : నల్లగొండ జిల్లా కనగల్ మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డు సమీపంలో, రాష్ట్ర వ్యాప్తంగా నిర్మించనున్న హ్యామ్ (HAM) రోడ్ల నిర్మాణ పనులకు త్వరలో రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి చేతుల మీదుగా శంకుస్థాపన జరగనున్న నేపథ్యంలో శనివారం మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి శంకుస్థాపన పైలాన్ నిర్మాణ పనులను పరిశీలించారు. ఈ పనులను వేగవంతం చేయాలని ఆర్ అండ్ బి అధికారులను ఆదేశించారు. శనివారం కనగల్ వ్యవసాయ మార్కెట్ యార్డు సమీపంలో హ్యామ్ రోడ్ల శంకుస్థాపన కోసం నిర్మిస్తున్న పైలాన్ పనులను మంత్రి తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రూ.13,500 కోట్ల విలువైన హ్యామ్ రోడ్ల ప్రాజెక్టుకు సంబంధించిన పైలాన్ ఎప్పటికీ గుర్తుండిపోయేలా నిర్మించాలని సూచించారు. ముఖ్యంగా పైలాన్ చుట్టూ దిగువ భాగంలో త్రివర్ణ పతాక రంగులతో అలంకరించాలని, పెద్ద అక్షరాలతో రోడ్లు, భవనాల శాఖ పేరు స్పష్టంగా కనిపించేలా రాయించాలని అధికారులను ఆదేశించారు.

అలాగే పైలాన్ చుట్టూ రైలింగ్ ఏర్పాటు చేసి, ఆ ప్రాంతాన్ని సుందరంగా తీర్చిదిద్దాలని, సాయంత్రం వేళల్లో గ్రామస్తులు, ప్రజలు అక్కడ ప్రశాంతంగా గడిపేలా పచ్చిక బయలు (లాన్) ఏర్పాటు చేయాలని సూచించారు. అనంతరం మంత్రి ఎన్జీ కళాశాల మైదానంలో రాష్ట్ర ముఖ్యమంత్రి బహిరంగ సభ నిర్వహణకు ఎంపిక చేసిన స్థలాన్ని పరిశీలించారు. సభకు హాజరయ్యే ప్రజల సంఖ్య, ఏర్పాటు చేయాల్సిన కుర్చీలు, టెంట్లు, ఎల్‌ఈడీ స్క్రీన్లు, పార్కింగ్ తదితర ఏర్పాట్ల పై జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్, జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్‌లతో చర్చించారు. పట్టణంలో ఎలాంటి ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా తగిన చర్యలు తీసుకోవాలని, సభకు వచ్చే ప్రజలకు అవసరమైన అన్ని వసతులు కల్పించాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ బి.చంద్రశేఖర్, జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్, స్థానిక సంస్థల ఇన్‌చార్జి అదనపు కలెక్టర్ వై. అశోక్ రెడ్డి, ఆర్ అండ్ బి ఎస్‌ఈ శ్రీధర్ రెడ్డి, డీఈ గణేష్, ఇరిగేషన్ సీఈ శ్రీనివాస్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ జూకూరి రమేష్, మాజీ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి, మాజీ జెడ్పీటీసీ గుమ్మల మోహన్ రెడ్డి తదితరులు మంత్రి వెంట ఉన్నారు.

Next Story