సెక్సాటార్షన్‌పై పోలీసు యాక్షన్..

by Kodari Anjali |

వ్యాపారులు స్పై కెమెరా డిటెక్టర్‌ను ఏర్పాటు చేసుకోవాలని పోలీసు కమిషనర్ సజ్జనార్ సూచించారు.

సెక్సాటార్షన్‌పై పోలీసు యాక్షన్..
X

దిశ, సిటీక్రైం: వ్యక్తి గత స్వేచ్ఛకు భంగం కలిగించి, మహిళ భద్రతకు ముప్పుగా మారుతున్న హిడెన్, స్పై కెమెరాల రికార్డింగ్‌లపై హైదరాబాద్ పోలీసు కమిషనర్ సజ్జనార్ ప్రత్యేక ఫోకస్ పెట్టారు. ఈ నేపథ్యంలో సిటీ పోలీసు కమిషనరేట్ పరిధిలోని అన్ని వాణిజ్య కేంద్రాలు, షాపింగ్ మాల్స్, కాలేజీలు, స్కూల్స్, హాస్పిటల్స్, ఇంటర్నెట్ కేంద్రాలు, హోటల్స్, లాడ్జీలు, ఇంకా ఇతర వ్యాపార సంస్థలు కచ్చితంగా స్పై కెమెరా డిటెక్టర్‌లను ఏర్పాటు చేసుకోవాలని పోలీసులు ఆదేశిస్తున్నారు. వీటి ఏర్పాటు కోసం నోటీసులను కూడా జారీ చేస్తున్నారు. మహిళ వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలిగించడంతో పాటు వారి చిత్రాలను రహస్యంగా రికార్డింగ్ చేసి వాటిని సోషల్ మీడియాలో పెడుతున్నామని బ్లాక్ మెయిలింగ్‌కు ఇబ్బంది పెట్టే వ్యవహారాలకు చెక్ పెట్టేందుకు సీపీ సజ్జనార్ ఈ స్పై కెమెరా డిటెక్టర్ అస్త్రాన్ని అందుబాటులోకి తీసుకువచ్చారు. ఇన్ ఫార్మేషన్ టెక్నాలజీ, బీఎన్ఎస్ చట్టాల ప్రకారం.. పబ్లిక్ ఎస్టాబ్లిష్‌మెంట్‌లలో స్పై కెమెరా డిటెక్టర్‌లను ఏర్పాటు చేసుకోవాలన్నారు.

ప్రతి రోజు కచ్చితంగా స్పైడిటెక్టర్ ద్వారా..

స్విచ్ బోర్డులు, లైట్లు, గోడలకు చిన్న, చిన్న రంధ్రాలు చేసి వాటిలో కెమెరాలు పెట్టి రికార్డు చేస్తుంటారు. ఆ తర్వాత వాటితో బ్లాక్ చేసి డబ్బులు గుంజుతున్న అనేక ఉదంతాలు వెలుగులోకి వస్తున్న విషయం తెలిసిందే. ఈ చర్యల వల్ల మహిళలు, యువతులు, విద్యార్థినిలు పడే మానసిక క్షోభ వర్ణణాతీతంగా ఉంటుంది. ఇలా అనేక సంఘటనలను పరిశీలించిన అనంతరం సీపీ సజ్జనార్ ఇలాంటి చర్యలకు చెక్ పెట్టేందుకు స్పైడిటెక్టర్ కెమెరాలను ఏర్పాటు చేయాలని చట్టపరంగా నిబంధనను అమల్లోకి తీసుకువచ్చారు. వ్యాపారులు, పబ్లిక్ ఎస్టాబ్లిష్ మెంట్ యజమానులు ప్రతి రోజు కచ్చితంగా స్పైడిటెక్టర్ ద్వారా వారి సముదాయాల్లో తనిఖీ చేసి హిడెన్, స్పై కెమెరా ఫ్రీ అంటూ పోలీసులకు సమాచారం అందించాలని తెలిపారు. పోలీసులు తనిఖీ చేసినప్పుడు ఏమైనా సీక్రెట్, స్పై, హిడెన్ కెమెరాలు బయటపడితే కఠిన సెక్షన్ల కింద కేసులను నమోదు చేయడంతో పాటు ఆ వ్యాపార సముదాయాన్ని జప్తు చేస్తామని పోలీసులు స్పష్టం చేస్తున్నారు.

నోటీసులు ఇచ్చాం: సురేందర్ గౌడ్, ఇన్స్ పెక్టర్ బోరబండి పీఎస్

సీపీ సజ్జనార్ ఆదేశాల మేరకు స్పై కెమెరా డిటెక్టర్ ఏర్పాటు చేసుకోవాలని మా పరిధిలో ఉన్న 20 వ్యాపార సముదాయాలకు నోటీసులు ఇచ్చాం. వారందరూ స్పై కెమెరా డిటెక్టర్‌లను ఏర్పాటు చేసుకున్నారు. తనిఖీలలో స్పై, హిడెన్ కెమెరాలు ఉన్నట్లు బయటపడితే ఆ వ్యాపార కేంద్రాన్ని సీజ్ చేయడంతో పాటు యజమానులపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటాం.

Next Story