- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఎరువుల కొరతకు చెక్.. కొత్త యాప్‌ను ప్రారంభించిన మంత్రి కోమటిరెడ్డి
ఈ వానాకాలం సీజన్‌లో రైతులు పంటలు సాగు చేసుకునేందుకు ఎలాంటి ఎరువుల కొరత లేకుండా అవసరమైన ఎరువులను అందుబాటులో ఉంచేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తెలిపారు.

దిశ, నల్లగొండ బ్యూరో : ఈ వానాకాలం సీజన్‌లో రైతులు పంటలు సాగు చేసుకునేందుకు ఎలాంటి ఎరువుల కొరత లేకుండా అవసరమైన ఎరువులను అందుబాటులో ఉంచేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తెలిపారు. శనివారం నల్లగొండలోని తన క్యాంపు కార్యాలయం ఇందిరా భవన్‌లో జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్‌తో కలిసి ఆయన "ఫర్టిలైజర్ బుకింగ్ యాప్"ను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఫర్టిలైజర్ బుకింగ్ యాప్ ద్వారా ఎరువులకు సంబంధించిన సమగ్ర సమాచారాన్ని రైతులు తెలుసుకోవచ్చని చెప్పారు. ముఖ్యంగా ఎరువుల అందుబాటు, ప్రస్తుత నిల్వలు, సరఫరా పరిస్థితి వంటి వివరాలు ఈ యాప్‌లో సులభంగా లభిస్తాయని పేర్కొన్నారు.
యూరియా అవసరమైన రైతులు ఈ యాప్ ద్వారా ముందుగానే బుక్ చేసుకోవచ్చని తెలిపారు. పట్టాదారు పాస్‌పుస్తకం, పంట వివరాలను నమోదు చేస్తే రైతు పేరుపైనే యూరియా సరఫరా చేయబడుతుందని వివరించారు. ఎకరానికి రెండు బస్తాల చొప్పున యూరియా అందజేస్తామని, ఒక ఎకరం ఉన్న రైతులకు ఒకేసారి, ఒకటి నుంచి ఐదు ఎకరాలు లేదా అంతకంటే ఎక్కువ భూమి ఉన్న రైతులకు విడతల వారీగా యూరియా పంపిణీ చేస్తామని తెలిపారు. ప్రతిరోజూ ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు యూరియాను యాప్ ద్వారా బుక్ చేసుకునే అవకాశం ఉంటుందని చెప్పారు. జిల్లాలోని అన్ని మండలాల్లో సహకార సంఘాలు, డీసీఎంఎస్‌లు, అలాగే 650కిపైగా ఎరువుల విక్రయ కేంద్రాల్లో తగినంత యూరియా నిల్వలు ఉన్నాయని, ప్రతి రైతుకు అవసరమైన మేర యూరియా అందజేస్తామని తెలిపారు. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మంత్రి స్పష్టం చేశారు.
అనంతరం విద్యుత్ అధికారులతో నిర్వహించిన సమీక్షలో జిల్లాలో ఎలాంటి విద్యుత్ సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పట్టణాలతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో కూడా విద్యుత్ సరఫరాలో అంతరాయం లేకుండా చూడాలని సూచించారు. విరిగిపోయిన విద్యుత్ స్తంభాలను వెంటనే మరమ్మతు చేయాలని, అవసరమైన చోట కొత్త ట్రాన్స్‌ఫార్మర్లు ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. అలాగే లో-వోల్టేజ్ సమస్యలు తలెత్తకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. తదనంతరం నల్లగొండ మున్సిపల్ కార్పొరేషన్‌కు సంబంధించిన అంశాల పై మున్సిపల్ అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఈ నెల 21న నిర్వహించనున్న అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఉపయోగించనున్న టీ-షర్టులను మంత్రి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ బి.చంద్రశేఖర్, విద్యుత్ శాఖ అధికారులు, జిల్లా వ్యవసాయ అధికారి వి. వినోద్‌కుమార్, స్థానిక సంస్థల ఇన్‌చార్జి అదనపు కలెక్టర్ వై. అశోక్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.






