ప్రేమలు.. బ్రేకప్‌లు.. ఆ వయసులో జరిగే అద్భుతాలివే..!

by Javid Pasha |

వయసు రీత్యా వచ్చే మార్పువల్ల ప్రభావితమై ప్రేమించడం, కాదనలేక ఏదో ఒక సంబంధాన్ని చేసుకోవడం వంటి అనుభవాలు తర్వాతి జీవితంలో కొందరి ఆలోచనలను మార్చేస్తున్నాయి.

ప్రేమలు.. బ్రేకప్‌లు.. ఆ వయసులో జరిగే అద్భుతాలివే..!
X

దిశ, ఫీచర్స్ : సాధారణంగా చాలామంది టీనేజ్ తర్వాత ప్రేమలో పడటం, లవ్ మ్యారేజ్ చేసుకోవడం వంటివి చేస్తుంటారు. అయితే ఇలాంటి సంబంధాలన్నీ ఒకేలా ఉండవు. ఆయా వ్యక్తుల వ్యక్తిత్వం, ఆసక్తి, ఆర్థిక పరిస్థితులు, సామాజిక ఒత్తిళ్లను బట్టి మధ్యలో కొన్ని ప్రేమలు బ్రేకప్‌లకు దారితీస్తే, పెళ్లి తర్వాత కూడా కొందరు విడిపోతుంటారు. అయితే.. 35 ఏండ్లు దాటిన తర్వాత ప్రేమలో పడిన వారిలో, పెళ్లి చేసుకున్న వారిలో మాత్రం బ్రేకప్‌లు, విడాకులు దాదాపు ఉండవని ఆధునిక మహిళలు బలంగా నమ్ముతున్నట్లు నిపుణులు చెబుతున్నారు. ‘సైకాలజీ టుడే’లో పబ్లిషైన ఒక అధ్యయనం కూడా దాదాపు ఇదే పేర్కొన్నది. ఆ వివరాలేమిటో చూద్దాం.

అనుభవాలు.. అవస్థలు

ఏదో అట్రాక్షన్ కోసం డేటింగ్ చేయడం, వయసు రీత్యా వచ్చే మార్పువల్ల ప్రభావితమై ప్రేమించడం లేదా పేరెంట్స్ చూసిన ఏదో ఒక సంబంధాన్ని చేసుకోవడం వంటి అనుభవాలను కొందరు ఎదుర్కొంటుండగా.. మహిళలు వీటిని ఎక్కువగా ఎదుర్కొంటారని మానసిక నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా ఇవి టీనేజీలో ఎక్కువగా జరుగుతుంటాయి. మానసిక పరిపక్వత వచ్చాక, తాము తీసుకున్న నిర్ణయాలన్నీ కరెక్ట్ కావని కొందరు ఫీలవుతుంటారు. సరైన వ్యక్తిని ప్రేమించలేదనో, సరైన భాగస్వామిగా ఎంచుకోలేదనో మథన పడుతుంటారు. పైగా ఒకప్పుడు ఎదుటి వ్యక్తిలో నచ్చిన అంశాలన్నీ 35 ఏండ్ల త్వర్వాత కనిపించకుండా పోవచ్చు. అసలు వ్యక్తిత్వం అప్పుడు బయటపడటం వల్ల తాము సరైన వ్యక్తిని సెలెక్ట్ చేసుకోలేకపోయామనే విషయాన్ని గుర్తిస్తుంటారు చాలామంది.

ఆలోచనల్లో తేడా..

ఉద్యోగం లేకపోయినా, ఆర్థిక పరిస్థితి సరిగ్గా లేకపోయినా, లేదా వ్యక్తిత్వం బాగా లేకపోయినా చూడ్డానికి బాగుంటే చాలు.. తర్వాత అతన్ని మార్చుకోవచ్చునని చాలామంది అమ్మాయిలు టీనేజీలో భావిస్తుంటారు. సదరు వ్యక్తితో ప్రేమలో పడినప్పుడు లేదా పెళ్లి చేసుకున్నప్పుడు భవిష్యత్తులో అతడు మారిపోతాడని, గొప్పవాడవుతాడని కలలు గంటుంటారు. అదే.. 35 ఏండ్లు దాటిన వారు ఇలా ఆలోచించరు. ఎందుకంటే అప్పుడు ఒక వ్యక్తి ఏ వ్యక్తిత్వంతో ఉన్నాడో భవిష్యత్తులో కూడా దాదాపు అలాగే ఉండే అవకాశం ఎక్కువ. పైగా ఆ వయసులో తీసుకునే నిర్ణయాలు 90% తమకు, తమ భాగస్వామికి మేలు చేసేవే ఉంటాయి. కాబట్టి ఈ వయసులో పుట్టే ప్రేమలు, జరిగే వివాహాల్లో గొడవలు, విడాకులు తక్కువ ఉండే అకాశం ఉందని అధ్యయనాలు చెబుతున్నాయి.

స్థిరత్వమే ముఖ్యం

టీనేజీ తర్వాత దశలో.. ముఖ్యంగా 30-35 ఏండ్ల వయసులో పుట్టే ప్రేమలు, జరిగే పెళ్లిళ్లు స్థిరంగా ఉండటానికి కారణం ఆ సమయంలో మన మెదడు ఎగ్జాయిట్మెంట్ కంటే స్టెబిలిటీని ఎక్కువగా కోరుకుంటుంది. పైగా ఈ ఏజ్‌లో కేవలం ఎమోషనల్ డ్రెయిన్ చేసే సంబంధాలను మహిళలు వెంటనే గుర్తిస్తారు. తమకంటూ శ్రమ శిక్షణతో కూడిన బౌండరీస్ సెట్ చేసుకుంటారు. ఫలితంగా వీరు ఎంచుకునే భాగస్వామి కూడా అదే మెచ్యూరిటీ ఉన్నవాళ్లే అయి ఉంటారు. కాబట్టి ఇలాంటి జంటలో ఎవరి కోసం ఎవరూ ప్రత్యేకంగా మార్చుకోవాల్సిన అంశాలు, గొడవలకు కారణమయ్యే విషయాలు పెద్దగా ఉండవు. చిన్న చిన్న తగాదాలు ఉన్నా సర్దుకుపోతుంటారు. ఇద్దరూ ఇప్పటికే సెటిల్డ్ మైండ్‌తో ఉండటంవల్ల సంబంధం మరింత గట్టిగా నిలబడుతుంది. అందుకే కాస్త ఆలస్యమైనా 30 నుంచి 35 ఏండ్ల తర్వాత దొరికే ప్రేమ, సంబంధం జీవితాంతం నిలబడతాయని నిపుణులు అంటున్నారు. పైగా ఇక్కడ కపుల్స్‌లో పరస్పర గౌరవం, స్పష్టత, సెల్ఫ్ ఎస్టీమ్ వంటివి ఎక్కువగా ఉంటాయి.

Next Story