రూ.40 చాయ్ బిల్లుకు కక్కుర్తిపడి అడ్డంగా బుక్కైన నకిలీ ఐపీఎస్

by Prasad Jukanti |

లక్నోలో రూ.40 టీ బిల్లు కట్టకుండా, పోలీసులనే సెల్యూట్ అడిగిన నకిలీ ఐపీఎస్‍ను పోలీసులు అరెస్ట్ చేశారు.

రూ.40 చాయ్ బిల్లుకు కక్కుర్తిపడి అడ్డంగా బుక్కైన నకిలీ ఐపీఎస్
X

దిశ, డైనమిక్ బ్యూరో: రూ.40 చాయ్ బిల్లుకు కక్కుర్తి పడి అడ్డంగా దొరికిపోయాడు ఓ నకిలీ ఐపీఎస్ ఆఫీసర్. తాను బిల్లు చెల్లించకపోవడమే కాకుండా తనకు రెస్పెక్ట్ కావాలంటూ ఏకంగా పోలీసులపైనే చిందులు చివరకు కటకటాల పాలయ్యాడు. సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అవుతున్న ఈ ఘటన యూపీలో చోటు చేసుకుంది. నోయిడాకు చెందిన ఓ వ్యక్తి లక్నోలోని ఓ టీ స్టాల్ వద్ద టీ తాగాడు. ఇందుకు రూ.40 బిల్లు అయింది. అయితే సదరు వ్యక్తి టీ బిల్లు చెల్లించకుండానే అక్కడి నుంచి వెళ్లిపోయేందుకు ప్రయత్నించగా డబ్బులు చెల్లించి వెళ్లాలని షాప్ యజమాని కోరాడు. అయితే తాను డబ్బు చెల్లించేది లేదంటూ మొండికేయడంతో షాప్ యజమాని సమీపంలో పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

రెస్పెక్ట్ కావాలంటూ పట్టు:

తమకు అందిన ఫిర్యాదుతో అక్కడికి వచ్చిన పోలీసులు డబ్బులు ఎందుకు కట్టడం లేదని ప్రశ్నించారు. దాంతో తాను నోయిడాలో పోస్టింగ్‍లో ఉన్న ఐపీఎస్ అధికారినని మీరు నాకు ఎందుకు సెల్యూట్ చేయలేదు? ఐపీఎస్ అయిన తనకు గౌరవించరా అంటూ కానిస్టేబుళ్లపైకి ఎదురు తిరిగాడు. దీంతో సివిల్ డ్రస్‌లో ఉన్న ఎవరికీ మేము సెల్యూట్ చేయం. నువ్వు నిజంగానే పోలీస్ ఆఫీసర్‌ అయితే యూనిఫామ్ వేసుకుని రావాలని, నీ ఐడీ కార్డు చూపించాలన్నారు. అప్పుడు మేము నీకు సెల్యూట్ చేస్తాం అంతవరకు కుదరదంటూ కానిస్టేబుల్ ముఖం మీదే చెప్పాడు.

కానిస్టేబుల్ కు ప్రశంసలు:

ఈ క్రమంలో ఐడీ కార్డుతో పాటు తాను ఐపీఎస్ అని నిరూపించేందుకు ఎలాంటి ఆధారాలు చూపకపోవడంతో అతడి అసలు రంగు బయటపడింది. ఈ వైరల్ వీడియోపై లక్నో పోలీసులు 'X' (ట్విట్టర్) ద్వారా స్పందించారు. నిందితుడిపై మహానగర్ పోలీస్ స్టేషన్‌లో సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేసి, అరెస్ట్ చేసినట్లు ప్రకటించారు. ప్రస్తుతం తదుపరి చట్టపరమైన చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు. ఈ వీడియోపై నెటిజన్లు రియాక్ట్ అవుతున్నారు. నకిలీ ఐపీఎస్ బెదిరింపులకు భయపడకుండా, నిబంధనల ప్రకారం హుందాగా సమాధానమిచ్చిన ఆ కానిస్టేబుల్‌పై నెటిజన్లు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.

Next Story