శంషాబాద్-ఆరాంఘర్ రోడ్డుపై ప్రమాదం.. పసికందు ప్రాణాలు కాపాడిన పోలీసులు

by Ramesh Naini |

శంషాబాద్-ఆరాంఘర్ రోడ్డుపై రోడ్డు ప్రమాదంలో అపస్మారక స్థితికి చేరిన రెండున్నరేళ్ల బాలుడి ప్రాణాలను రాజేంద్రనగర్ డీసీపీ శ్రీనివాస్ నేతృత్వంలోని పోలీసు బృందం సమయస్ఫూర్తితో కాపాడింది.

శంషాబాద్-ఆరాంఘర్ రోడ్డుపై ప్రమాదం.. పసికందు ప్రాణాలు కాపాడిన పోలీసులు
X

దిశ, డైనమిక్ బ్యూరో: శంషాబాద్-ఆరాంఘర్ రోడ్డుపై రోడ్డు ప్రమాదంలో అపస్మారక స్థితికి చేరిన రెండున్నరేళ్ల బాలుడి ప్రాణాలను రాజేంద్రనగర్ డీసీపీ శ్రీనివాస్ నేతృత్వంలోని పోలీసు బృందం సమయస్ఫూర్తితో కాపాడింది. ఈ నెల 18వ తేదీ అర్ధరాత్రి 2 గంటల సమయంలో బెంగళూరు నుంచి హైదరాబాద్ వస్తున్న టోలిచౌకి చెందిన ఒక కుటుంబం ప్రయాణిస్తున్న కారు డ్రైవర్ నిద్రమత్తు కారణంగా అదుపు తప్పి ప్రమాదానికి గురైంది. ఊపిరాడక స్పృహ కోల్పోయిన చిన్నారికి ఏయిర్‌పోర్ట్ పీఎస్ నుంచి ఎస్కార్ట్ వాహనంలో వస్తున్న డీసీపీ శ్రీనివాస్ బృందం తక్షణం స్పందించింది. నైట్ డ్యూటీలో ఉన్న డీసీపీ ఆధ్వర్యంలో కానిస్టేబుళ్లు మహేశ్, ప్రదీప్, వెంకటేశ్, పవన్‌లు సకాలంలో సీపీఆర్ చేసి బాలుడిని తిరిగి శ్వాస తీసుకునేలా చేశారు. సీపీ సజ్జనార్ ఈ ఘటనపై ఎక్స్ (ట్విట్టర్) వేదికగా వీడియో షేర్ చేస్తూ, డీసీపీ శ్రీనివాస్ మరియు ఆయన బృందాన్ని మనస్ఫూర్తిగా అభినందించారు. విధి నిర్వహణతో పాటు మానవత్వాన్ని చాటిన ఈ చర్య పోలీసు శాఖకు గర్వకారణమని అన్నారు. సుదీర్ఘ ప్రయాణాల్లో నిద్రమత్తు వచ్చినప్పుడు వాహనాన్ని పక్కన పార్క్ చేసి విశ్రాంతి తీసుకోవాలని, ఒక్క క్షణం నిర్లక్ష్యం ప్రాణాంతకం కావచ్చని సీపీ సజ్జనార్ ప్రజలకు సూచించారు.

Next Story