బీఆర్ఎస్‌లో ‘మావోయిస్టు’ భావజాల నేతలున్నారు: బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

by Gantepaka Srikanth |   (  Updated:2026-06-16 07:20:57  IST  )

‘సర్’ (Special Intensive Revision) ప్రక్రియపై కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు కావాలనే రాజకీయం చేస్తున్నాయని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

బీఆర్ఎస్‌లో ‘మావోయిస్టు’ భావజాల నేతలున్నారు: బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: ‘సర్’ (Special Intensive Revision) ప్రక్రియపై కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు కావాలనే రాజకీయం చేస్తున్నాయని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్రమంగా ఉన్న ఓట్లను అధికారులు తొలగిస్తే అందులో తప్పేముందని ఆయన ప్రశ్నించారు. తెలంగాణ అభివృద్ధి, రాజకీయ పరిణామాలపై ఆయన శనివారం మీడియాతో మాట్లాడుతూ విపక్షాలపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఓట్ల తొలగింపు వ్యవహారాన్ని అడ్డుపెట్టుకుని ముస్లిం సామాజిక వర్గంలో కాంగ్రెస్ పార్టీ లేనిపోని భయాలు కల్పిస్తోందని బండి సంజయ్ మండిపడ్డారు. కేవలం ఓటు బ్యాంక్ రాజకీయాల కోసమే ముస్లింల మధ్య కాంగ్రెస్ చిచ్చు పెట్టేందుకు ప్రయత్నిస్తోందని, సర్ ప్రక్రియను తప్పుబట్టడం వెనుక రాజకీయ స్వార్థం దాగి ఉందని విమర్శించారు.

మెట్రోపై రేవంత్ ఆరోపణల్లో నిజం లేదు..

కేంద్రమంత్రి కిషన్ రెడ్డి మెట్రో సెకండ్ ఫేజ్ (రెండో విడత) పనులను అడ్డుకుంటున్నారంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేస్తున్న ఆరోపణలను బండి సంజయ్ పూర్తిగా కొట్టిపారేశారు. ఈ ఆరోపణల్లో ఎలాంటి నిజం లేదన్నారు. తెలంగాణ అభివృద్ధికి ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉందన్నారు. రాష్ట్రానికి కేంద్రం నుంచి భారీగా నిధులు అందుతున్నాయని, నిధుల కేటాయింపుల్లో ఎలాంటి వివక్ష లేదని ఆయన స్పష్టం చేశారు.

బీఆర్ఎస్ ‘మావోయిస్టు’ భావజాలం..

ఇదే సమయంలో బీఆర్ఎస్ పార్టీపై బండి సంజయ్ అత్యంత ఘాటు వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ పార్టీలో మావోయిస్టు భావజాలం ఉన్న నేతలు ఉన్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇలాంటి ఉగ్ర, తీవ్రవాద భావజాలం ఉన్న నాయకుల వల్ల సమాజానికి తీవ్ర ప్రమాదం పొంచి ఉందన్నారు. ప్రజలు ఆలోచించాలని, బీఆర్ఎస్ లాంటి పార్టీలను ఎట్టి పరిస్థితుల్లోనూ నమ్మవద్దని ఆయన పిలుపునిచ్చారు.

‘ఆ నిధులన్నీ ఎటు పోయాయి?’.. కాంగ్రెస్‌పై బండి సంజయ్ ‘రుద్రరూపం’

Next Story