ట్రంప్ సంచలన ప్రకటన: దక్షిణాఫ్రికాపై కఠిన వైఖరి, G20 ఆహ్వానం రద్దు

by Malleboina Mahesh |

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దక్షిణాఫ్రికాపై సంచలన ఆరోపణలు చేస్తూ, ఆ దేశంపై కఠిన చర్యలు తీసుకునేందుకు ఆదేశాలు జారీ చేసినట్లు ప్రకటించారు.

ట్రంప్ సంచలన ప్రకటన: దక్షిణాఫ్రికాపై కఠిన వైఖరి, G20 ఆహ్వానం రద్దు
X

దిశ, వెబ్ డెస్క్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) దక్షిణాఫ్రికాపై సంచలన ఆరోపణలు చేస్తూ, ఆ దేశంపై కఠిన చర్యలు తీసుకునేందుకు ఆదేశాలు జారీ చేసినట్లు ప్రకటించారు. దక్షిణాఫ్రికా (South Africa)లో ఆఫ్రికానర్లు, డచ్, ఫ్రెంచ్, జర్మన్ సెటిలర్ల వారసులు ఎదుర్కొంటున్న "భయంకరమైన మానవ హక్కుల ఉల్లంఘనలను" అక్కడి ప్రభుత్వం పరిష్కరించడం లేదనే కారణంతోనే తాము ఆ దేశంలో జరిగిన G20 సదస్సుకు హాజరు కాలేదని ఆయన ట్వీట్ ద్వారా స్పష్టం చేశారు. "మరింత స్పష్టంగా చెప్పాలంటే, వారు శ్వేతజాతీయులను చంపుతున్నారని, వారి వ్యవసాయ భూములను ఆక్రమించడానికి ఇష్టానుసారంగా అనుమతిస్తున్నారని ట్రంప్ తీవ్ర ఆరోపణలు చేశారు.

ట్రంప్ చేసిన ప్రకటన ప్రకారం, G20 ముగింపులో దక్షిణాఫ్రికా ప్రభుత్వం G20 అధ్యక్ష బాధ్యతలను (G20 presidency responsibilities) అమెరికన్ రాయబార కార్యాలయం నుంచి వచ్చిన సీనియర్ ప్రతినిధికి అప్పగించడానికి నిరాకరించింది. ఈ పరిణామాల నేపథ్యంలో, తన ఆదేశాల మేరకు 2026 G20 సదస్సుకు దక్షిణాఫ్రికాకు ఆహ్వానం అందదు అని ట్రంప్ తెలిపారు. 2026 G20 సదస్సు (2026 G20 Summit) అమెరికాలోని ఫ్లోరిడాలోని మియామిలో జరగనుంది. దక్షిణాఫ్రికా ప్రపంచంలో ఏ అంతర్జాతీయ కూటమిలోనూ సభ్యత్వానికి తగిన దేశం కాదని తమ చర్య ద్వారా ప్రపంచానికి నిరూపించిందని ట్రంప్ ఘాటుగా విమర్శించారు.

ఈ చర్యల పర్యవసానంగా, అమెరికా ప్రభుత్వం (US government) దక్షిణాఫ్రికాకు ఇచ్చే అన్ని చెల్లింపులు, సబ్సిడీలను తక్షణమే నిలిపివేస్తున్నట్లు అధ్యక్షుడు ప్రకటించారు. ఈ కీలక నిర్ణయానికి అందరూ దృష్టి సారించాలని ట్రంప్ విజ్ఞప్తి చేశారు. దక్షిణాఫ్రికాపై ట్రంప్ తీసుకున్న ఈ కఠిన వైఖరి అంతర్జాతీయంగా తీవ్ర చర్చనీయాంశమైంది.

Next Story