హోర్ముజ్‌కు అమెరికానే ‘గార్డియన్’.. ట్రంప్ సంచలన ప్రకటన

by Ramesh Naini |

అమెరికా, ఇరాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు తీవ్రస్థాయికి చేరాయి. ఇరు దేశాల మధ్య మాటల యుద్ధం, దాడులతో మధ్యప్రాచ్యంలో యుద్ధ మేఘాలు అలుముకున్నాయి.

హోర్ముజ్‌కు అమెరికానే ‘గార్డియన్’.. ట్రంప్ సంచలన ప్రకటన
X

దిశ, డైనమిక్ బ్యూరో: అమెరికా, ఇరాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు తీవ్రస్థాయికి చేరాయి. ఇరు దేశాల మధ్య మాటల యుద్ధం, దాడులతో మధ్యప్రాచ్యంలో (Middle East) యుద్ధ మేఘాలు అలుముకున్నాయి. అంతర్జాతీయ మీడియా సమాచారం ప్రకారం.. అమెరికా, ఇరాన్ మధ్య కుదిరిన అవగాహన ఒప్పందం తీవ్ర సంక్షోభంలో పడింది. అమెరికా పదే పదే ఒప్పందాన్ని ఉల్లంఘిస్తోందని, ఇలాగే కొనసాగితే తీవ్ర పరిణామాలు తప్పవని ఇరాన్ తీవ్రస్థాయిలో హెచ్చరించింది.

హోర్ముజ్ జలసంధిపై ఇరాన్ వార్నింగ్

హోర్ముజ్ జలసంధి (Strait of Hormuz) వ్యవహారాల్లో అమెరికా జోక్యాన్ని ఏమాత్రం సహించేది లేదని ఇరాన్ సాయుధ దళాలు స్పష్టం చేశాయి. అమెరికా సైన్యానికి ఏ దేశమైనా సహకరిస్తే, దాన్ని తమ సార్వభౌమాధికారంపై జరిగిన యుద్ధంగానే పరిగణిస్తామని ఇరాన్ సైనిక ప్రతినిధి ఇబ్రహీం జొల్ఫఘరి హెచ్చరించారు. ఈ కవ్వింపు చర్యలు ప్రాంతీయ యుద్ధానికి దారితీస్తాయని స్పష్టం చేశారు.

ఇరాన్‌పై ట్రంప్ ఫైర్..

ఇరాన్ తీరుపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఘాటుగా స్పందించారు. ఒప్పందాలను ఇరాన్ ఎప్పుడూ ఉల్లంఘిస్తూనే ఉంటుందని, వారిపై కఠిన దాడులు తప్పవని ట్రంప్ హెచ్చరించారు.

జలసంధికి అమెరికా ‘గార్డియన్’

హోర్ముజ్ జలసంధిలో ఇరాన్ నౌకలను మాత్రమే అడ్డుకుంటామని, మిగతా దేశాల నౌకల రాకపోకలకు ఎలాంటి ఆటంకం ఉండదని ట్రంప్ తన ‘ట్రూత్ సోషల్’ ఖాతాలో తెలిపారు. ఇకపై ఈ జలసంధికి అమెరికా ‘గార్డియన్’గా (రక్షకుడిగా) వ్యవహరిస్తుందని ప్రకటించారు. భద్రత కల్పిస్తున్నందుకు గాను, వాణిజ్య నౌకల ద్వారా రవాణా అయ్యే సరుకు విలువపై 20 శాతం రుసుము వసూలు చేస్తామని ట్రంప్ సంచలన ప్రకటన చేశారు.

విస్తరిస్తున్న దాడులు..

వారాంతంలో ఇరాన్‌పై అమెరికా దాడులు కేవలం తీరప్రాంతాలకే పరిమితం కాకుండా మరింత లోపలికి విస్తరించాయి. ఈ పరిణామాలతో ఒమన్‌తో జరుగుతున్న దౌత్య చర్చలకు సైతం విఘాతం కలిగింది. హోర్ముజ్ జలసంధిలో వాణిజ్య నౌకల రాకపోకలు తగ్గిపోవడం, ఉద్రిక్తతలు పెరగడంతో అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్, క్రూడ్ ఆయిల్ ధరలు అమాంతం పెరుగుతున్నాయి. ఈ ప్రభావం చుట్టుపక్కల దేశాలపైనా పడుతోంది. యెమెన్‌లోని హౌతీ తిరుగుబాటుదారులు.. తమ రాజధాని విమానాశ్రయంపై సౌదీ అరేబియా దాడులు చేసిందని ఆరోపించారు. దీంతో ఆ దేశాల మధ్య ఏళ్లుగా ఉన్న శాంతి ఒప్పందం కూడా ముగింపు దశకు చేరుకున్నట్లయింది.

Next Story