- రూ. 60 వేల కోట్లతో అమెజాన్ పెట్టుబడి

by velandi.Saikiran |   (  Updated:2026-07-14 23:00:24  IST  )

సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశాల మేర‌కు భార‌త ఫ్యూచ‌ర్ సిటీలో 202 ఎక‌రాలు, చంద‌న్‌వెల్లిలో 98 ఎక‌రాలు అమెజాన్ సంస్థకు కేటాయించారు.

- రూ. 60 వేల కోట్లతో అమెజాన్ పెట్టుబడి
X

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న భార‌త్ ఫ్యూచ‌ర్ సిటీలో కొత్త అమెజాన్ డేటా సెంట‌ర్‌ ఏర్పాటు కానుంది. ఈ మేరకు బుధవారం సీఎం రేవంత్‌రెడ్డి శంకుస్థాప‌న చేయ‌నున్నారు. రోజురోజుకూ ఏఐ ప్రాబల్యం పెరుగుతున్న ప్రస్తుత త‌రుణంలో తెలంగాణలోనే డేటా సెంట‌ర్ల ఏర్పాటుకు బహుళజాతి కంపెనీలు అత్యంత ప్రాధాన్యతను ఇస్తున్నాయి. 2025 జనవరిలో దావోస్‌లో జరిగిన ప్రపంచ ఆర్థిక వేదిక(వ‌ర‌ల్డ్ ఎక‌నామిక్ ఫోరం)లో సీఎం రేవంత్‌రెడ్డి అమెజాన్ ప్రతినిధులతో కీలక చర్చలు జరిపారు. సమావేశంలో రాష్ట్రంలో డేటా సెంటర్ల విస్తరణ కోసం రూ.60 వేల కోట్ల పెట్టుబడికి అమెజాన్ సంస్థ ప్రతినిధుల‌ను సూచ‌నప్రాయంగా ఒప్పించారు. ఇది రాష్ట్ర చరిత్రలోనే అతిపెద్ద టెక్నాలజీ పెట్టుబడుల్లో ఒకటిగా నిలిచింది. ఆ త‌ర్వాత 2025 డిసెంబ‌ర్‌లో జ‌రిగిన తెలంగాణ రైజింగ్ గ్లోబ‌ల్ స‌మ్మిట్‌లో భాగంగా అమెజాన్‌తో ఈ రూ.60 వేల కోట్ల పెట్టుబ‌డికి సంబంధించిన ఫ్రేమ్ వ‌ర్క్ అగ్రిమెంట్ చేసుకున్నారు.

202 ఎకరాల స్థలం కేటాయింపు..

సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశాల మేర‌కు భార‌త ఫ్యూచ‌ర్ సిటీలో 202 ఎక‌రాలు, చంద‌న్‌వెల్లిలో 98 ఎక‌రాలు అమెజాన్ సంస్థకు కేటాయించారు. ఈ డేటా సెంట‌ర్ ఏర్పాటుతో అమెజాన్ సంస్థ దేశంలోనే అతి పెద్ద హైప‌ర్ స్కేల్ డేటా సెంట‌ర్‌లలో ఒక‌టిగా హైద‌రాబాద్ నిల‌వ‌నుంది. అదేవిధంగా రూ.125 కోట్ల విలువ చేసే ప్రోత్సాహకాలు, రాయితీలు అమెజాన్ సంస్థకు అంద‌జేశారు. పెరి అర్బన్ రీజియ‌న్ ఎకాన‌మీ (ప్యూర్‌) ప్రాంత అభివృద్ధికి ఈ డేటా సెంట‌ర్ అత్యంత కీల‌కం కానుంది. తొలి విడ‌త‌లో భాగంగా.. 24 నెల‌ల్లో నిర్మాణ సంబంధిత ప‌నులు పూర్తవుతాయి. రాబోయే 10 ఏండ్లలో మిగ‌తా ప‌నులు పూర్తి చేస్తారు. మొత్తంగా రానున్న పదేండ్లలో రూ.60 వేల కోట్ల ప‌నులు డేటా సెంట‌ర్ ఏర్పాటుకు దోహ‌దప‌డే అవ‌కాశం ఉన్నది.

రాష్ట్ర ఐటీ రంగంలో మరో మైలురాయి..

హైదరాబాద్‌ను దేశంలోనే అతిపెద్ద డిజిటల్, క్లౌడ్ కంప్యూటింగ్ కేంద్రంగా తీర్చిదిద్దే దిశగా అమెజాన్ వెబ్ సర్వీసెస్ భారీ అడుగులు వేస్తున్నది. సీఎం రేవంత్ శంకుస్థాపన చేసే అమెజాన్ డేటా సెంటర్ ప్రాజెక్టు తెలంగాణ ఐటీ రంగంలో మరో మైలురాయిగా నిలవనుంది. అమెజాన్‌కు చెందిన క్లౌడ్ కంప్యూటింగ్ విభాగం ఇప్పటికే హైదరాబాద్‌లో తన సేవలను విస్తరిస్తూ అడుగులు వేస్తున్నది. ముంబై తర్వాత దేశంలో రెండో క్లౌడ్ రీజియన్‌ను ఇక్కడే ఏర్పాటు చేయ‌నుంది. ఈ పెట్టుబడితో హైదరాబాద్‌లో అత్యాధునిక హైపర్‌స్కేల్ డేటా సెంటర్ ఏర్పాటు కానుంది. వీటి ద్వారా క్లౌడ్ కంప్యూటింగ్, కృత్రిమ మేధ, డిజిటల్ బ్యాంకింగ్, ఈ-కామర్స్, ఆరోగ్య సేవలు, ప్రభుత్వ డిజిటల్ సేవలు, స్టార్టప్‌లు, పరిశ్రమలకు అవసరమైన డిజిటల్ మౌలిక వసతులు మరింత బలోపేతం కానున్నాయి. దేశంలోనే ఎక్కడా లేనివిధంగా తెలంగాణ‌లో భూమి, నీరు, విద్యుత్, ర‌హ‌దారుల, విధానప‌రమైన స‌హ‌కారం, వేగ‌వంత‌మైన ప‌రిపాల‌న వంటి అనుకూలతలు ఉండ‌టంతో కార్పొరేట్ కంపెనీలు ప్రస్తుతం నగరం వైపు మొగ్గు చూపుతున్నాయని అధికారులు చెబుతున్నారు.

Next Story