- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘పసుమాముల’లో రూ.60కోట్ల భూమిపై కాంగ్రెస్ నేత కన్ను !
‘పసుమాముల’లో రూ.60కోట్ల భూమిపై కాంగ్రెస్ నేత కన్ను వేసినట్లు ఆరోపణలు వస్తున్నాయి.

దిశ, రంగారెడ్డి బ్యూరో/ అబ్దుల్లాపూర్‌మెట్ : అత్త సొమ్ము అల్లుడి దానం అంటే ఇదేనేమో!. ప్రభుత్వ స్థలంపై కన్నేసిన ఓ కాంగ్రెస్ నేత 60 గజాల స్థలానికి రూ.10లక్షలు రేటు ఫిక్స్ చేసి అమ్మకానికి పెట్టాడు. కొనుగోలు దారులను నమ్మించేందుకు ఏకంగా ‘మల్ రెడ్డి రంగారెడ్డి నగర్' పేరుతో బోర్డును కూడా ఏర్పాటు చేశాడు. ఎంతోకాలంగా ఈ తతంగం సాగుతున్నప్పటికీ రెవిన్యూ శాఖ అధికారులు చోద్యం చూస్తుండడం విస్మయం గొలుపుతోంది. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ మండలంలోని ‘పసుమాముల’ గ్రామంలో ఈ తంతులో రూ.60కోట్ల విలువైన 12 ఎకరాల ప్రభుత్వ స్థలం ఓ నేతకు ఫలహారం అవుతుండడం చర్చనీయాంశంగా మారింది.
పేదల ప్లాట్లలో ‘రియల్’ వ్యాపారం..
పసుమాముల గ్రామంలోని సర్వే నెంబర్ 137లో సుమారు 141.29ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. ఇందులో కొంత భూమిని రిటైర్డ్ ఆర్మీ జవాన్లకు, ప్రభుత్వ గురుకుల పాఠశాలకు కేటాయించారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వ హయాంలో సుమారు 500 మందికి ఇండ్ల పట్టాలు ఇచ్చారు. ఆతర్వాత వచ్చిన ప్రభుత్వం సంబంధిత జీవోను రద్దు చేయడంతో ఇండ్ల పట్టాలు రద్దయ్యాయి. ఈ నేపథ్యంలోనే రెవిన్యూ అధికారులు ‘ప్రభుత్వ భూమి’ అంటూ అక్కడ బోర్డును ఏర్పాటు చేశారు. అయితే రద్దు అయిన ప్లాట్ల పట్టాలను చేజిక్కించుకున్న స్థానిక అధికార పార్టీ నేత ఒకరు రియల్ దందాను మొదలు పెట్టారు. అధికారులు పాతిన బోర్డును మాయం చేసి అందరినీ నమ్మించేందుకు ‘మల్‌రెడ్డి రంగారెడ్డి నగర్' పేరుతో కమాన్ ఏర్పాటు చేశారు. సదరు స్థలంలో గతంలో బోరును వేయగా రెవిన్యూ అధికారులు అడ్డుకున్నారు. అయితే ఇప్పటికే చాలా మందికి రూ.10లక్షల చొప్పున 60 గజాల భూ విస్తీర్ణం గల పట్టాలను అంటగట్టినట్లు స్థానికంగా ప్రచారం జరుగుతోంది. ఇదే స్థలంలో ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేయిస్తానని చెప్పడంతో చాలామంది ఎగబడి ప్లాట్లను కొనుకుంటున్నట్లు తెలుస్తోంది. ఆ నేత అక్రమ దందా వ్యవహారంపై స్థానికంగా జోరుగా చర్చ నడుస్తున్నప్పటికీ అధికారులు అటువైపు కన్నెత్తి చూడక పోవడం విస్మయం గొలుపుతోంది. సదరు నేత ఎసరు పెట్టిన ప్రభుత్వ భూమి విలువ ఎంత లేదన్నా.. రూ.60కోట్ల వరకు ఉంటుందని తెలుస్తోంది.
గుణపాఠం నేర్వని అధికారులు..
అబ్దుల్లాపూర్ మెట్ మండలంలోని బాట సింగారం గ్రామ పంచాయతీలో గతంలోనూ ఇదే తరహా దందా వెలుగుజూసింది. కొత్తగూడెం గ్రామంలోని సర్వే నెంబర్ 10/95లో సుమారు రెండెకరాల భూమి ఉండగా..భూమి లేని పేదలకు ప్రభుత్వం పట్టాలను అందజేసింది. ఆతర్వాత ఆ స్థలాన్ని వివిధ కారణాల నేపథ్యంలో ప్రభుత్వం పీవోటి కింద వెనక్కి తీసుకుంది. ఈ స్థలంపై కన్నేసిన కాంగ్రెస్ నేత ఒకరు ‘మల్ రెడ్డి రంగారెడ్డి నగర్' పేరుతో కమాన్ ఏర్పాటు చేసి 100 గజాల ప్లాట్ ను రూ.3లక్షల నుంచి రూ.4లక్షల చొప్పున గుట్టు చప్పుడు కాకుండా అమ్మాడు. అందులో గుడి నిర్మాణాన్ని చేపట్టగా..ఇది వివాదాస్పదం కావడంతో గత యేడాది మే నెలలో రెవిన్యూ అధికారులు అక్రమ నిర్మాణాలను తొలగించారు. ఇదే తరహాలో ప్రస్తుతం పసుమాముల గ్రామంలో అక్రమ రియల్ దందా నడుస్తున్నప్పటికీ రెవిన్యూ అధికారులు గుణపాఠం నేర్చుకోకపోవడం పట్ల విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
చట్టపరమైన చర్యలు తీసుకుంటాం..
- రాంబాబు, రెవెన్యూ ఇన్‌స్పెక్టర్
పసుమాములలోని సర్వే నెంబర్ 137లో ఉన్న 141 ఎకరాల ప్రభుత్వ భూమి రెవిన్యూ శాఖ ఆధీనంలో ఉంది. ఇందులో ఎవరైనా ప్లాట్ల పేరిట విక్రయాలు జరిపితే చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. ఎవరూ ఈ స్థలంలో ప్లాట్లను కొనుగోలు చేయవద్దు. ఇది చట్ట విరుద్దం.





