- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
హుస్నాబాద్ లో వాహనదారుల అయోమయం
రాష్ట్ర రాజకీయాల్లో హుస్నాబాద్‌కు ప్రత్యేక స్థానముంది. ఎన్నికల సమరశంఖానికి, అగ్రనేతల సెంటిమెంట్ సభలకు వేదికగా నిలిచి ఎందరో నాయకుల ‘దశ’ మార్చిన ఘనత ఈ గడ్డది.

దిశ, హుస్నాబాద్: రాష్ట్ర రాజకీయాల్లో హుస్నాబాద్‌కు ప్రత్యేక స్థానముంది. ఎన్నికల సమరశంఖానికి, అగ్రనేతల సెంటిమెంట్ సభలకు వేదికగా నిలిచి ఎందరో నాయకుల ‘దశ’ మార్చిన ఘనత ఈ గడ్డది. కానీ, క్షేత్రస్థాయిలో మాత్రం ఈ పట్టణానికి సరైన ‘దిశ’ చూపే నాథుడే కరువయ్యాడు. నిత్యం వేలాది వాహనాలతో రద్దీగా ఉండే ఈ వ్యాపార కేంద్రం మున్సిపాలిటీగా మారినా, సరిహద్దుల్లో ‘హుస్నాబాద్’ అని సూచించే కనీస గుర్తింపు బోర్డులు లేకపోవడం అధికారుల నిర్లక్ష్యానికి సజీవ సాక్ష్యంగా నిలుస్తోంది. నియోజకవర్గ ప్రజాప్రతినిధి రాష్ట్ర క్యాబినెట్‌లో కీలక మంత్రిగా ఉన్నప్పటికీ, పట్టణ ముఖద్వారాల వద్ద కనీసం ఒక ‘స్వాగత తోరణం’ కూడా ఎక్కడా కనపడకపోవడం గమనార్హం.
నాలుగు జిల్లాల జంక్షన్.. అన్నీ తిప్పలే!
వరంగల్, సిద్దిపేట, కరీంనగర్, జనగామ జిల్లాలను కలిపే ప్రధాన కూడలి అయిన అక్కన్నపేట చౌరస్తాతో పాటు పట్టణంలోని ఇతర ముఖ్య కూడళ్లలోనూ కనీసం ఒక్క సైన్‌బోర్డు కూడా లేదు. దీంతో రాత్రి వేళల్లో ఈ మార్గంలో వచ్చే కొత్త వాహనదారులు ఏ దారి ఎటు వెళ్తుందో తెలియక తీవ్ర అయోమయానికి గురవుతున్నారు. దారితెన్నూ కానరాక వాహనాలను పక్కన నిలిపి, స్థానికులను అడిగితే తప్ప ముందుకు సాగలేని పరిస్థితి నెలకొంది.
కార్యాలయాలు, కాలనీల దారులూ ‘అజ్ఞాతమే’
వివిధ పనుల నిమిత్తం వచ్చే సామాన్య ప్రజలకు ప్రభుత్వ కార్యాలయాలు, పోలీస్ స్టేషన్, ప్రభుత్వ ఆసుపత్రి ఎక్కడున్నాయో వెతుక్కోవడం పెద్ద ప్రహసనంగా మారింది. చివరకు విద్యాసంస్థల దారులకూ దిశాసూచికలు లేవు. పట్టణంలోని ఏ ఒక్క కాలనీ వీధిలోనూ పేరు తెలిపే బోర్డులు లేకపోవడంతో, కొత్తగా వచ్చే వారు చిరునామా తెలియక సందుల వెంబడి తిరుగుతూ మున్సిపల్ తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఇకనైనా నిద్రలేవాలి..!
రాష్ట్రస్థాయిలో హుస్నాబాద్ కు ఉన్న గుర్తింపును కాపాడేలా స్థానిక మంత్రి చొరవ చూపాలని ప్రజలు కోరుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి, ప్రధాన కూడళ్లయిన చౌరస్తాలలో ఆధునిక రేడియం దిశాసూచికల సైన్‌బోర్డులను, కాలనీల వద్ద నేమ్ బోర్డులను ఏర్పాటు చేసి ప్రజల, ప్రయాణికుల కష్టాలను తీర్చాల్సిన అవసరం ఎంతైనా ఉంది.





