- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
SIR: ఎన్యూమరేషన్ ఫామ్స్ తిరిగివ్వని 50 శాతం ఓటర్లు
రాష్ట్రవ్యాప్తంగా ఎన్యూమరేషన్ ఫారాలను 49.2శాతం మంది ఓటర్లు మాత్రమే బీఎల్ఓలకు అందజేశారు.

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో ఎస్ఐఆర్ కొనసాగుతోంది. అయితే మొత్తం 3,38,26,448 మంది ఓటర్లకు గాను 3,38,21,554 మందికి(99.99శాతం)ఎన్నికల అధికారులు ఎన్యూమరేషన్ ఫారాలను అందజేశారు. కానీ తిరిగి బీఎల్ఓలకు అందజేసే కార్యక్రమం నత్తనడకన సాగుతోంది. ఇప్పటివరకు 1,66,70,610మంది ఓటర్లు మాత్రమే (49.28శాతం) తమ ఫారాలను అందజేశారు. దీంతో మరో 50శాతం మంది ఓటర్లు పది రోజుల్లో ఇవ్వడం సాధ్యమేనా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఎస్ఐఆర్ గడువు పెంచాలని అన్ని రాజకీయ పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి.
49.2 శాతం మాత్రమే..
రాష్ట్రవ్యాప్తంగా ఎన్యూమరేషన్ ఫారాలను 49.2శాతం మంది ఓటర్లు మాత్రమే బీఎల్ఓలకు అందజేశారు. కొమురం భీం ఆసిఫాబాద్, నిజామాబాద్, సిద్దిపేట, నల్లగొండ, యాదాద్రి-భువనగిరి జిల్లాల్లో మాత్రమే 70శాతానికిపైగా ఓటర్లు తిరిగి ఫారాలను అందజేశారు. నిర్మల్, కామారెడ్డి, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, మెదక్, జోగులాంబ గద్వాల, జనగాం, ఖమ్మం, నారాయణపేట్ జిల్లాల్లో 60శాతానికిపైగా మంది ఇచ్చారు. రంగారెడ్డి జిల్లాలో 33శాతం, హైదరాబాద్ జిల్లా 22 శాతం, అత్యల్పంగా మేడ్చల్-మల్కాజ్‌గిరి జిల్లాలో 18శాతం మంది మాత్రమే ఎన్యూమరేషన్ ఫారాలను బీఎల్ఓలకు అందజేశారు. అయితే ఇప్పటివరకు వచ్చిన ఫారాల్లో మరణించిన ఓట్లు, వేరేప్రాంతాలకు చెందిన ఓటర్లు మాత్రమే అందజేసినట్టు తెలుస్తోంది. ముఖ్యంగా రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్-మల్కాజ్‌గిరి జిల్లాలకు చెందిన ఓటర్లు ఓటెయ్యడంలోనూ, ఓటును కాపాడుకోవడంలోనూ వెనుకబడే ఉన్నారని విమర్శలూ లేకపోలేదు. అయితే ఆంధ్రప్రదేశ్‌లో 14రోజుల పాటు ఎస్ఐఆర్ కార్యక్రమాన్ని పొడిగించిన నేపథ్యంలో రాష్ట్రంలో పొడిగించే అవకాశాలు ఉన్నాయా? లేదా? అనేది వేచి చూడాల్సిందే.
ఫారం ఇస్తేనే ఓటు హక్కు : సీఈవో సి.సుదర్శన్‌రెడ్డి
పూరించిన ఎన్యూమరేషన్ ఫారాలను బీఎల్ఓలకు ఇస్తేనే డ్రాఫ్ట్ ఓటర్ జాబితాలో ఓటరు పేరు నమోదు అవుతుందని, లేదంటే ఓటును తొలగించాల్సి వస్తుందని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సి.సుదర్శన్‌రెడ్డి స్పష్టం చేశారు. ఫారాలను వెంటనే పూర్తి చేసి బీఎల్ఓలకు అందజేయాలని ఈ మేరకు ఆయన మంగళవారం ఒక ప్రకటనలో సూచించారు. ఫారాల్లో ఎలాంటి తప్పులు లేకుండా పూరించి, పాస్‌పోర్ట్ సైజు ఫొటోను అతికించి అందించాలని కోరారు. 2002 ఓటరు జాబితాలో ఓటర్ వివరాలు ఉన్నట్లయితే తప్పనిసరిగా నింపాలని, ఒకవేళ అటువంటి వివరాలను లేకపోయినా ప్రస్తుత వివరాలతో ఎన్యూమరేషన్ ఫారాలను నింపాలని స్పష్టం చేశారు. ‘సర్’ ప్రక్రియ జూన్ 25న ప్రారంభమైందని, మరో పది రోజుల్లో ముగుస్తుందని పేర్కొన్నారు.





