ట్రంప్ లక్ష్యంగా దుండగుడి కాల్పులు.. ఇంతకీ ఆ ‘పార్ట్‌టైమ్ టీచర్’ ఎవరు? నిందితుడి షాకింగ్ వివరాలు!

by Ramesh Naini |

అమెరికా రాజధాని వాషింగ్టన్ డీసీలో జరిగిన ప్రతిష్టాత్మక ‘వైట్ హౌస్ కరస్పాండెంట్స్ డిన్నర్’ కార్యక్రమంలో భయాందోళనలు నెలకొన్నాయి.

ట్రంప్ లక్ష్యంగా దుండగుడి కాల్పులు.. ఇంతకీ ఆ ‘పార్ట్‌టైమ్ టీచర్’ ఎవరు? నిందితుడి షాకింగ్ వివరాలు!
X

దిశ, డైనమిక్ బ్యూరో: అమెరికా రాజధాని వాషింగ్టన్ డీసీలో జరిగిన ప్రతిష్టాత్మక ‘వైట్ హౌస్ కరస్పాండెంట్స్ డిన్నర్’ కార్యక్రమంలో భయాందోళనలు నెలకొన్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఇతర ప్రముఖులు హాజరైన ఈ వేడుకలో బహుళ ఆయుధాలతో వచ్చిన ఓ దుండగుడు భద్రతా వలయాన్ని ఛేదించుకుని కాల్పులకు తెగబడ్డాడు. అప్రమత్తమైన సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు తక్షణం స్పందించడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటనలో ట్రంప్ సురక్షితంగా బయటపడగా, దుండగుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

ఘటన ఎలా జరిగింది?

అంతర్జాతీయ మీడియా సమాచారం ప్రకారం.. వాషింగ్టన్‌లోని ప్రసిద్ధ హిల్టన్ హోటల్‌లో శనివారం రాత్రి ఈ డిన్నర్ కార్యక్రమం ఏర్పాటు చేశారు. అతిథులకు సలాడ్ వడ్డిస్తున్న సమయంలో, అనూహ్యంగా ఓ వ్యక్తి షాట్‌గన్, హ్యాండ్‌గన్, పలు కత్తులతో సీక్రెట్ సర్వీస్ భద్రతా చెక్‌పాయింట్‌పైకి దూసుకొచ్చాడు. అతడిని ఆపేందుకు భద్రతా సిబ్బంది యత్నించగా, సుమారు 5 నుంచి 8 రౌండ్ల కాల్పుల శబ్దం వినిపించింది. వెంటనే స్పందించిన భద్రతా సిబ్బంది దుండగుడిని నేలపైకి లాగి, బంధించారు. ఈ ప్రతిఘటనలో ఒక సీక్రెట్ సర్వీస్ ఏజెంట్‌కు బుల్లెట్ తగిలింది. అయితే, ఆయన బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ ధరించి ఉండటంతో ప్రాణాపాయం తప్పింది. ప్రస్తుతం ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కాల్పుల శబ్దం వినగానే ప్రాణభయంతో అతిథులు టేబుళ్ల కింద తలదాచుకున్నారు. వెంటనే భద్రతా వలయం ఏర్పాటు చేసిన సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు.. ట్రంప్, ప్రథమ మహిళ మెలనియా, ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ సహా ఇతర క్యాబినెట్ మంత్రులను సురక్షిత ప్రాంతానికి తరలించారు.

నిందితుడు ఎవరు?

పోలీసుల అదుపులో ఉన్న నిందితుడిని కాలిఫోర్నియాలోని టోరెన్స్‌కు చెందిన కోల్ టామస్ అలెన్ (31)గా గుర్తించారు. ఇతను ‘సీ2 ఎడ్యుకేషన్’లో పార్ట్‌టైమ్ టీచర్‌గా, వీడియో గేమ్ డెవలపర్‌గా పనిచేస్తున్నాడు. 2024 డిసెంబర్‌లో సంస్థ ‘టీచర్ ఆఫ్ ద మంత్’గా కూడా ఇతడిని ఎంపిక చేసింది. కాలిఫోర్నియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (2017) నుంచి మెకానికల్ ఇంజినీరింగ్, కాలిఫోర్నియా స్టేట్ యూనివర్సిటీ నుంచి కంప్యూటర్ సైన్స్‌లో మాస్టర్స్ పూర్తి చేశాడు. ఫెడరల్ ఎన్నికల కమిషన్ రికార్డుల ప్రకారం, అలెన్ అక్టోబర్ 2024లో కమలా హారిస్ అధ్యక్ష ఎన్నికల ప్రచారానికి $25 విరాళం ఇచ్చినట్లు వెల్లడైంది. ప్రస్తుతం నిందితుడిని ఆసుపత్రిలో ఉంచి వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఫెడరల్ అధికారిపై ప్రమాదకరమైన ఆయుధంతో దాడి, హింసాత్మక నేరంలో తుపాకీ వినియోగం తదితర తీవ్రమైన అభియోగాలను డీసీ యూఎస్ అటార్నీ జీనీన్ పిర్రో అతడిపై నమోదు చేశారు. సోమవారం అతడిని కోర్టులో హాజరుపరచనున్నారు.

ట్రంప్ స్పందన: ‘ఇది ఒంటరి వ్యక్తి చర్య’

ఈ దాడి అనంతరం శ్వేతసౌధంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ట్రంప్ మాట్లాడారు. ఇదొక ‘లోన్ వుల్ఫ్’ (ఒంటరి వ్యక్తి) చర్య అని, దీని వెనుక పెద్ద కుట్ర ఉందనుకోవడం లేదని స్పష్టం చేశారు. కాల్పుల శబ్దం విన్నప్పుడు ట్రేలు కింద పడ్డాయనుకున్నానని, కానీ భద్రతా సిబ్బంది అద్భుతంగా పనిచేశారని కొనియాడారు. తాను కార్యక్రమాన్ని కొనసాగించాలనే ("Let the show go on") భావించినా, అధికారుల సూచన మేరకు అక్కడి నుంచి వెనుదిరిగినట్లు తెలిపారు. వాయిదా పడిన ఈ కార్యక్రమాన్ని 30 రోజుల్లో మరింత సురక్షితమైన ప్రదేశంలో నిర్వహిస్తామన్నారు. తనపై ఇలాంటి దాడి జరగడం ఇదే తొలిసారి కాదని, జులై 2024లో పెన్సిల్వేనియాలోని బట్లర్‌లో జరిగిన ఎన్నికల ర్యాలీలోనూ తనపై కాల్పులు జరిగిన విషయాన్ని గుర్తుచేశారు. అధ్యక్ష పదవి అనేది ‘ప్రమాదకరమైన వృత్తి’ అని ఆయన వ్యాఖ్యానించారు.

భద్రతా లోపాలపై ఆందోళన

కట్టుదిట్టమైన భద్రత ఉండే ఈవెంట్‌లో ఒక వ్యక్తి ఇన్ని ఆయుధాలతో చెక్‌పాయింట్ వరకు రావడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. భద్రతా వలయాన్ని దాటుకుని దుండగుడు అంత దూరం రావడం ఆందోళన కలిగించే విషయమని మాజీ ఎఫ్‌బీఐ డిప్యూటీ డైరెక్టర్ ఆండ్రూ మెక్‌కేబ్ అభిప్రాయపడ్డారు. భవిష్యత్తులో సీక్రెట్ సర్వీస్ తమ భద్రతా ప్రణాళికలను పునఃసమీక్షించుకోవాల్సిన అవసరం ఉందన్నారు.

ప్రధాని మోడీ ఖండన

ట్రంప్‌పై జరిగిన ఈ దాడి పట్ల భారత ప్రధాని నరేంద్ర మోడీ విచారం వ్యక్తం చేశారు. ‘తాజా భద్రతా ఘటన తర్వాత అధ్యక్షుడు ట్రంప్ క్షేమంగా ఉన్నారని తెలిసి ఊరట చెందాను. ప్రజాస్వామ్యంలో హింసకు స్థానం లేదు. దీనిని నిస్సందేహంగా ఖండించాలి’ అని మోడీ పేర్కొన్నారు. న్యూయార్క్ మేయర్ జోహ్రాన్ మామ్దానీ తదితర ప్రముఖులు కూడా ఈ రాజకీయ హింసను తీవ్రంగా ఖండించారు.

Next Story