న్యూయార్క్ మేయర్ అభ్యర్థి జోహ్రాన్ మమ్దానీపై ట్రంప్ దూషణలు

by Shamantha N |

న్యూయార్క్ మేయర్‌గా డెమొక్రాటిక్ అభ్యర్థిగా అధికారికంగా ప్రకటించబడిన అమెరికన్ జోహ్రాన్ మమ్దానీపై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

న్యూయార్క్ మేయర్ అభ్యర్థి జోహ్రాన్ మమ్దానీపై ట్రంప్ దూషణలు
X

దిశ, నేషనల్ బ్యూరో: న్యూయార్క్ మేయర్‌గా డెమొక్రాటిక్ అభ్యర్థిగా అధికారికంగా ప్రకటించబడిన అమెరికన్ జోహ్రాన్ మమ్దానీపై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం అవి అమెరికా రాజకీయాల్లో మరో చర్చకు దారి తీశాయి. ట్రంప్ జోహ్రాన్ ను ‘కమ్యూనిస్టు’, ‘నట్ జాబ్’ వంటి పదాలతో వ్యక్తిగతంగా దూషణలకు దిగాడు. అతడిని లక్ష్యంగా చేసుకోవడమే కాకుండా, ఆయన పౌరసత్వాన్ని ప్రశ్నిస్తూ అరెస్టు చేయాలని వ్యాఖ్యానించారు. మమ్దానీ మాత్రం అధ్యక్షుడి బెదిరింపులను తిప్పికొడుతూ, ‘నేను ఎలాంటి నిబంధనలు ఉల్లంఘించలేదు. కానీ ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్ మెంట్ (ICE) సంస్థను మా న్యూయార్క్ నగర ప్రజలపై బలవంతంగా ప్రయోగించేందుకు అనుమతించను’ అంటూ స్పష్టమైన నిరసన తెలిపారు.

పెరుగుతున్న రాజకీయ మద్దతు

మమ్దానీకి ప్రస్తుతం న్యూయార్క్ ప్రజల నుంచి గణనీయమైన మద్దతు లభిస్తోంది. సోషల్ మీడియా వేదికగా సాగుతున్న ఆయన ప్రచారం, వలసదారులు, కార్మిక వర్గాలు, యువత తదితర సామాజిక వర్గాల్లో విశేష ఆదరణ పొందుతున్నారు. మమ్దానీ కేవలం వ్యక్తిగత రాజకీయ ఎత్తుగడలు కాకుండా, న్యాయవిధానం, సామాజిక సమానత్వం, శ్రామిక హక్కుల పట్ల వివరాలు తెలియజేస్తూ ప్రజల ముందుకు వస్తున్నారు. ప్రస్తుత మేయర్ ఎరిక్ అడమ్స్‌పై తీవ్ర స్థాయిలో అవినీతి చేశారని, ప్రత్యేకించి ట్రంప్ పాలనతో ఆయన చేరిక, ఫెడరల్ అవినీతి కేసుల్లో రాజీ చేసుకున్నారన్న ఆరోపణలు చేయడంతో ఇవి రాజకీయ మలుపు తీసుకున్నాయి.

2018 లోనే అమెరికా పౌరసత్వం

నవంబర్‌లో జరిగే మేయర్ ఎన్నికలు కేవలం న్యూయార్క్ నగరానికి సంబంధించినవే కాదు ఇవి అమెరికా ప్రజాస్వామ్య వ్యవస్థ, వలసదారుల హక్కులు, రాజకీయ గౌరవానికి సంబంధించిన నిర్ణాయక ఘట్టంగా మారనున్నాయి. మమ్దానీపై వ్యక్తిగత దాడులు, పౌరసత్వంపై నిందలు వేయడాన్ని ప్రజలు ఎలా అర్థం చేసుకుంటారనేది కీలక అంశం. ఎవర్ని నమ్మతాం అనే ప్రశ్నలకు ఓటర్లు ఈసారి సమాధానం ఇవ్వనున్నారు. దక్షిణాసియా ప్రాంతానికి చెందిన తల్లిదండ్రులకు ఉగాండాలో జన్మించిన మమ్దానీ అంచలంచెలుగా ఎదిగారు. న్యూయార్క్ రాష్ట్ర అసెంబ్లీ సభ్యుడైన మమ్దానీ నవంబర్‌లో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో గెలిస్తే, డెమోక్రటిక్ పార్టీ నుంచి నగరానికి ఎన్నికైన మొదటి ముస్లిం మేయర్ అవుతారు. కాగా రిపబ్లికన్ పార్టీకి చెందిన అనేక మంది మమ్దానీ పౌరసత్వాన్ని రద్దు చేయాలని ఒత్తిడి తెస్తున్నారు. మమ్దానీ 2018లో అమెరికా పౌరసత్వం పొందారు. అనతి కాలంలోనే న్యూయార్క్ మేయర్ గా పోటీ చేస్తుండటం గమనార్హం.

Next Story