- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
"భారత్ - పాక్ యుద్ధాన్ని నేనే ఆపా.." మళ్లీ అదే పాట పాడుతున్న ట్రంప్
భారత్ - పాకిస్తాన్ దేశాల మధ్య యుద్ధాన్ని తానే జోక్యం చేసుకుని ఆపానంటూ.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి అదే పాటపాడారు.

దిశ, వెబ్‌డెస్క్: భారత్ - పాకిస్తాన్ దేశాల మధ్య యుద్ధాన్ని తానే జోక్యం చేసుకుని ఆపానంటూ.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి అదే పాటపాడారు. ఆపరేషన్ సిందూర్ గా పిలిచే నాలుగు రోజుల యుద్ధంలో ఇరుపక్షాలకు సంబంధించి మొత్తం 11 యుద్ధవిమానాలు కూలిపోయాయని ట్రంప్ పేర్కొన్నారు. బుధవారం ఎయిర్ ఫోర్స్ వన్ మీడియాతో మాట్లాడిన సందర్భంగా ట్రంప్ ఈ సంచలన వ్యాఖ్యలు చేశారు. భారత్ - పాక్ వివాదంతో సహా ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకూ 8 యుద్ధాలను పరిష్కరించానని, అందుకే నోబెల్ శాంతి బహుమతి కూడా తనకే దక్కాల్సిందని చెప్పుకొచ్చారు. కాగా.. పాక్ తో యుద్ధానికి బ్రేక్ ఇవ్వడంపై థర్డ్ పార్టీ, మధ్యవర్తిత్వం లేదని భారత్ చెప్తూనే ఉన్నా ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.
గతేడాది భారత్ - పాకిస్తాన్ ల మధ్య జరిగిన ఘర్షణలు అణుయుద్ధంగా మారే ప్రమాదం ఉందన్న ట్రంప్.. ఉద్రిక్తతల్లో కూలిన 11 యుద్ధ విమానాలు ఏ దేశానికి చెందినవన్న వివరాలను మాత్రం వెల్లడించలేదు. ఆపరేషన్ సిందూర్ సమయంలో భారత సైన్యం జరిపిన దాడుల్లో పాకిస్తాన్ కు చెందిన F-16 విమానాలతో సహా కనీసం ఒక డజన్ సైనిక విమానాలు ధ్వంసమయ్యాయని భారత్ గతంలోనే ప్రకటించింది. ఇరు దేశాల మధ్య యుద్ధాన్ని ఆపడం ద్వారా తాను దాదాపు 3 నుంచి 5 కోట్ల మంది ప్రజల ప్రాణాలను కాపాడినట్లు ట్రంప్ సొంత డబ్బా కొట్టుకున్నారు. ఇందుకు పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ స్వయంగా తనకు కృతజ్ఞతలు కూడా చెప్పారన్నారు.
గతేడాది మే 7వ తేదీన పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతిస్పందనగా.. పాకిస్తాన్ ఆధీనంలోని ప్రాంతాల్లో ఉన్న ఉగ్రవాద మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకుని భారత్ 'ఆపరేషన్ సింధూర్' పేరుతో మెరుపు దాడులు ప్రారంభించింది. ఈ దాడుల అనంతరం ఇరు దేశాల మధ్య నాలుగు రోజుల పాటు తీవ్రమైన సైనిక ఘర్షణలు జరిగాయి. ఆ తర్వాత మే 10న సైనిక చర్యలను నిలిపివేయాలని ఇరు దేశాల మధ్య శాంతి ఒప్పందం కుదరడంతో ఈ ఘర్షణలు ముగిశాయి. అప్పటి నుండి తన జోక్యం వల్లే ఈ యుద్ధం ముగిసిందని ట్రంప్ పదే పదే చెప్తున్నారు. అయితే.. అమెరికా మధ్యవర్తిత్వం వల్ల కాకుండా, ఇరు దేశాల సైన్యాల మధ్య నేరుగా జరిగిన చర్చల ఫలితంగానే సైనిక చర్యలను నిలిపివేసినట్లు కేంద్రం స్పష్టం చేస్తోంది.






