ఇరాన్ క్షమించరాని తప్పులు చేస్తోంది.. ఇక చర్చలు ఉండవ్ : ట్రంప్ సంచలనం

by Naga Rani Yarlagadda |   (  Updated:2026-07-08 09:27:19  IST  )

ఇరాన్ తో యుద్ధంపై డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన చేశారు. ఇటీవలే ఇరుదేశాలు స్విట్జర్లాండ్ లో శాంతి ఒప్పందం కుదుర్చుకున్న విషయం తెలిసిందే.

ఇరాన్ క్షమించరాని తప్పులు చేస్తోంది.. ఇక చర్చలు ఉండవ్ : ట్రంప్ సంచలనం
X

దిశ, వెబ్‌డెస్క్: ఇరాన్ తో యుద్ధంపై డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన చేశారు. ఇటీవలే ఇరుదేశాలు స్విట్జర్లాండ్ లో శాంతి ఒప్పందం కుదుర్చుకున్న విషయం తెలిసిందే. దీనిపై ట్రంప్ తీవ్రంగా స్పందించారు. టర్కీలోని అంకారాలో జరుగుతున్న నాటో 2026 సదస్సు వేదికగా .. ఇరాన్ పై విమర్శలు చేశారు. ఇరాన్ క్షమించరాని తప్పులు చేస్తోందన్న ట్రంప్.. శాంతి ఒప్పందం ముగిసిందని, ఇకపై ఇరాన్ తో ఎలాంటి చర్చలు జరపబోమని, ఆ చర్చలు జరపడం కూడా సమయం వృథా అని కుండబద్దలు కొట్టారు. ట్రంప్ చేసిన వ్యాఖ్యలు.. అంతర్జాతీయ రాజకీయాల్లో సంచలనం రేపాయి. నాటో చీఫ్ మార్క్ రుట్టెతో కలిసి నిర్వహించిన మీడియా సమావేశంలో ఇరాన్ తో కుదిరిన 14 అంశాల అవగాహన ఒప్పంది పూర్తిగా రద్దయినట్లేనా అని ఓ విలేఖరి అడిగిన ప్రశ్నకు ట్రంప్ స్పందిస్తూ.. నా ఉద్దేశంలో ఇది ముగిసిపోయిందని బదులిచ్చారు. పైగా ఇరానియన్లతో ఇకపై ఎలాంటి చర్చలు జరపాలనుకోవడం లేదని, వారు చాలా కఠినమైన, హింసాత్మకమైన మనస్తత్వంతో ఉన్నారని, వారిని నడిపించే నాయకులు కూడా అలాగే ఉన్నారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

కాగా.. ట్రంప్ ప్రకటనతో ప్రపంచవ్యాప్తంగా స్టాక్ మార్కెట్లు కుదేలయ్యాయి. సెన్సెక్స్ 1500 పాయింట్లు, నిఫ్టీ 467 పాయింట్లు నష్టాల్లోకి వెళ్లాయి. మరోవైపు ముడిచమురు ధరలకు మళ్లీ రెక్కలొచ్చాయి. బ్యారెల్ ముడిచమురు ధర 2 శాతం పెరిగింది. బుధవారం మధ్యాహ్నానికి బ్యారెల్ ముడిచమురు ధర 78.73 డాలర్లకు ఎగబాకింది. మళ్లీ హార్ముజ్ జలసంధి వద్ద నౌకల రాకపోకలకు అంతరాయం ఏర్పడుతుందేమోనని ప్రపంచ దేశాల మధ్య భయాలు మొదలయ్యాయి.

ఇరాన్ పై మంగళవారం రాత్రి అమెరికా జరిపిన భారీ వైమానిక దాడుల అనంతరం ఇరుదేశాల మధ్య యుద్ధ వాతావరణం మళ్లీ మొదటికి వచ్చింది. అమెరికా దాడులకు ప్రతీకారంగా ఇరాన్ సైతం బహ్రెయిన్, కువైట్ తో పాటు ఇతర గల్ఫ్ దేశాల్లోని అమెరికా సైనిక స్థావరాలపై సరికొత్త రాకెట్ దాడులకు దిగింది. ఈ దాడులపై స్పందించిన ట్రంప్.. గత రాత్రి ఇరాన్ లోని కొన్ని శక్తులపై దాడులు నిర్వహించామని, గల్ఫ్ ప్రాంతంలో నౌకలపై ఇరాన్ రాకెట్ దాడులకు దిగడం వల్లనే తాము తీవ్రంగా స్పందించాల్సి వచ్చిందని ఆయన స్పష్టం చేశారు.

Next Story