రూపం కాదు.. ఆత్మవిశ్వాసమే అసలైన ఆకర్షణ.. Gen Zలో మారుతున్న ఆలోచన..!

by Javid Pasha |

అందం, ఆకర్షణ అనేది కేవలం మేకప్ బాక్సుల్లో ఉండే రంగుల మీద మాత్రమే ఆధారపడి ఉండదని ఆధునిక యువత భావిస్తోంది.

రూపం కాదు.. ఆత్మవిశ్వాసమే అసలైన ఆకర్షణ.. Gen Zలో మారుతున్న ఆలోచన..!
X

దిశ, ఫీచర్స్ : ఏడెనిమిదేండ్ల కిందట జెన్ జీలు గానీ, మిలీనియల్స్ గానీ.. ట్రెడీషనల్ మేకప్, హెయిర్ స్టైల్స్, లుక్స్ వంటి వాటిని ఎక్కువగా ఇష్టపడేవారు. కానీ ఇటీవల యువతలో ఈ ధోరణి మారుతోంది. ముఖ్యంగా జెన్ జీ మిక్స్‌డ్ ట్రెండ్, మోడర్న్ ట్రెండ్‌లతోపాటు తమకు కంఫర్ట్‌గా ఉండే ఆహార్యాన్నే అసలైన అందంగా భావిస్తూ అనుసరిస్తోంది. ఎందుకిలా అంటే.. అందం అనేది ఒక ఫార్ములా కాదు.. అది ఆయా వ్యక్తుల ఆసక్తిని, ఆలోచనను, దృష్టిని బట్టి మారే ఒక అద్భుతమైన భావన అంటోంది నేటి యువత. నిజమైన అందం కేవలం పైకి కనిపించే రూపం కాదు.. అది ఆత్మ విశ్వాసంలో ఉంటుందని చెబుతోంది.

అది మాత్రమే ఆకర్షణ కాదు..

ఇప్పటికీ కొందరు ముఖానికి కలర్‌ఫుల్ మేకప్ ఉంటేనే అందం అనుకుంటారు! కానీ ఆకర్షణ అనేది కేవలం మేకప్ బాక్సుల్లో ఉండే రంగుల మీద మాత్రమే ఆధారపడి ఉండదని ఆధునిక యువత భావిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా జరిగిన ఎన్నో మానసిక శాస్త్ర అధ్యయనాల ప్రకారం కూడా.. మెజారిటీ ప్రజలు దీర్ఘకాలిక బంధాల కోసం లేదా జీవితాంతం కలిసి ఉండటానికి సహజమైన, చాలా తేలికపాటి మేకప్‌తో ఉండే వ్యక్తులనే ఎక్కువగా ఇష్టపడతారని తేలింది. ఎందుకంటే.. అతిగా కాకుండా సహజత్వానికి దగ్గరగా ఉండే రూపం అవతలి వ్యక్తిలో ఒక నమ్మకాన్ని, ప్రశాంతతను కలిగిస్తుంది. అయితే ఈ సూత్రం అందరికీ, అన్ని వేళలా ఒకేలా వర్తించదు. ఎవరి ప్రాధాన్యతలు వారివి అని కూడా గుర్తుంచుకోవాలంటున్నారు నిపుణులు.

వ్యక్తిత్వం.. వ్యక్తిగత అభిరుచులు..

నిజానికి ఆకర్షణ అనే ఈ మాయాజాలం వెనుక సంస్కృతి, పెరిగిన వాతావరణం, వ్యక్తిత్వం, సందర్భం, వ్యక్తిగత అభిరుచులు (Personal interests) వంటి ఎన్నో అంశాలు ముడిపడి ఉంటాయని నిపుణులు చెబుతుంటారు. ఉదాహరణకు ఒక సంస్కృతిలో అందంగా భావించేది, మరో సంస్కృతిలో సాధారణంగా అనిపించవచ్చు. ఒక పార్టీకి వెళ్లేటప్పుడు బోల్డ్ గ్లామ్ లుక్‌తో తళతళలాడిపోవడం కొందరికి ఇష్టమైతే, మరికొందరికి ఎటువంటి మేకప్ లేని బేర్ ఫేస్ (సహజమైన ముఖం)‌తో ప్రశాంతంగా కనిపించడం నచ్చుతుంది. ఇందులో ఏదీ తప్పు కాదు, ఏది తక్కువ కాదు. కానీ.. విభిన్న పరిశోధనలు చెప్పే ఒకే విధమైన నిజం ఏంటంటే.. ముఖానికి వేసుకునే పర్ఫెక్ట్ మేకప్ కంటే కూడా.. ఒక వ్యక్తిలో ఉండే అథెంటిసిటీ(సహజత్వం), అచంచలమైన ఆత్మవిశ్వాసం, ఇతరుల పట్ల చూపించే దయాగుణం, మనస్ఫూర్తిగా ఏర్పరచుకునే నిజమైన సంబంధాలకే ఎక్కువ విలువ, ఆకర్షణ ఉంటాయి. అందుకే నిజమైన అందం అనేది ముఖానికి రాసుకునే రంగుల పొరల్లోనో, పౌడర్లలోనో లేదు.. అది మీ లోపల దాగి ఉన్న ఆత్మవిశ్వాసంలో, మిమ్మల్ని మీరు గౌరవించుకునే ఆ సౌకర్యవంతమైన అనుభూతిలో మాత్రమే ఉంటుంది అంటున్నారు నిపుణులు.

Next Story