శుభం వెంచర్ పై జిల్లా కలెక్టర్‌కు మున్సిపల్ కౌన్సిలర్ల ఫిర్యాదు

by Batti.Sumithra |

కామారెడ్డి పట్టణంలోని 25వ వార్డులో ఉన్న 'శుభం వెంచర్' నిర్వాహకులు పలు నిబంధనలు ఉల్లంఘించారంటూ మున్సిపల్ కౌన్సిలర్లు జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్‌కు రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు.

శుభం వెంచర్ పై జిల్లా కలెక్టర్‌కు మున్సిపల్ కౌన్సిలర్ల ఫిర్యాదు
X

దిశ, కామారెడ్డి : కామారెడ్డి పట్టణంలోని 25వ వార్డులో ఉన్న 'శుభం వెంచర్' నిర్వాహకులు పలు నిబంధనలు ఉల్లంఘించారంటూ మున్సిపల్ కౌన్సిలర్లు జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్‌కు రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు. వెంచర్ నిర్వాహకులు అంతర్గత రోడ్లను మూసివేసి దానిని గేటెడ్ కమ్యూనిటీగా మార్చారని కౌన్సిలర్లు ఆరోపించారు. డీటీసీపీ, మున్సిపల్ టౌన్ ప్లానింగ్ నిబంధనల ప్రకారం లేఅవుట్‌లోని అంతర్గత రోడ్లు ప్రజలందరికీ అందుబాటులో ఉండాల్సి ఉండగా, సదరు వెంచర్ చుట్టూ ప్రహరీ గోడ నిర్మించి, ప్రవేశ ద్వారాల వద్ద గేట్లు ఏర్పాటు చేసి తాళాలు వేయడం వల్ల చుట్టుపక్కల ప్రజల రాకపోకలకు తీవ్ర ఆటంకం కలుగుతోందని ఫిర్యాదులో పేర్కొన్నారు.

వెంచర్‌లో మౌలిక సదుపాయాల లేమి తీవ్రంగా ఉందని కౌన్సిలర్లు తెలిపారు. లే అవుట్‌లో అంతర్గత రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ, ఓపెన్ స్పేస్‌లను నిబంధనల ప్రకారం అభివృద్ధి చేయలేదని, వర్షపు నీటి పారుదల వ్యవస్థ సరిగా లేదని పేర్కొన్నారు. ఒక ఎకరానికి సరిపడా ఇంకుడు గుంతలు తవ్వలేదని, సెప్టిక్ ట్యాంక్ నిర్మాణం చేపట్టలేదని, ఓపెన్ స్పేస్‌లో పిల్లల ఆట వస్తువులు వంటి కనీస మౌలిక సదుపాయాలను కూడా ఏర్పాటు చేయలేదని ఆరోపించారు. అదేవిధంగా, వెంచర్‌కు ఆనుకొని ఉన్న తూము, డ్రైనేజీ కాలువకు డీటీసీపీ నిబంధనల ప్రకారం వదలాల్సిన 'బఫర్ జోన్' వదలకుండానే నిర్మాణాలు చేపట్టారని కౌన్సిలర్లు తెలిపారు. ఇది పర్యావరణ, పట్టణాభివృద్ధి నిబంధనలకు పూర్తిగా విరుద్ధమని పేర్కొన్నారు. డీటీసీపీ నిబంధనల ప్రకారం పైన పేర్కొన్న ఏ ఒక్క ప్రమాణాన్ని పాటించకపోయినప్పటికీ, మున్సిపల్ టౌన్ ప్లానింగ్ అధికారులు నిబంధనలను పక్కనబెట్టి సదరు వెంచర్‌కు 'ఫైనల్ లేఅవుట్' అనుమతులు మంజూరు చేశారని కౌన్సిలర్లు ఆరోపించారు. నిబంధనలకు విరుద్ధంగా అనుమతులు ఇచ్చిన అధికారుల పై, అలాగే వెంచర్ నిర్వాహకులపై తక్షణమే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కౌన్సిలర్లు కలెక్టర్‌ను కోరారు.

Next Story