- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కారుణ్య మరణాల మర్గదర్శకాలకు ఆమోదం.. కొత్త విధివిధానాలు ఖరారు
తీవ్రమైన వ్యాధులకు గురై, చికిత్సకు లొంగని స్థితిలో, వెంటిలేటర్ సహాయంతో ఊపిరి పీల్చుకుంటూ, మరణానికి చేరువై నరక యాతనను అనుభవించే రోగులకు ఊరట కల్పించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం ప్రధాన నిర్ణయాన్ని తీసుకుంది....

దిశ, ఏపీ బ్యూరో: తీవ్రమైన వ్యాధులకు గురై, చికిత్సకు లొంగని స్థితిలో, వెంటిలేటర్ సహాయంతో ఊపిరి పీల్చుకుంటూ, మరణానికి చేరువై నరక యాతనను అనుభవించే రోగులకు ఊరట కల్పించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం ప్రధాన నిర్ణయాన్ని తీసుకుంది. సుప్రీంకోర్టు ఆదేశాలకనుగుణంగా అటువంటి వారికి కారుణ్య మరణం లభించేలా విధివిధానాలను రాష్ట్ర ప్రభుత్వం రూపొందించింది. వ్యాధి నుంచి కోలుకునే అవకాశం ఏమాత్రమూ లేక చికిత్సల పేరిట నానా ఇబ్బందులు పడే వారికి ఈ నిర్ణయం ఎంతో ఊరట కల్పించనుంది. అవసాన దశలో ఉన్న రోగులకు సహజ రీతిలో కారుణ్య మరణాల అవకాశాలను కల్పిస్తూ సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పునకు అనుగుణంగా రూపొందించిన మార్గదర్శకాలను వైద్యారోగ్య శాఖా మంత్రి సత్యకుమార్ యాదవ్ సంబంధిత ఉన్నతాధికారులతో చర్చించి బుధవారంనాడు ఆమోదం తెలిపారు. వీటి ద్వారా రోగుల స్వయం నిర్ణయాధికారాన్ని గౌరవిస్తూ చికిత్సనందించే వైద్యులు, కారుణ్య మరణాలకు సంబంధించి నిర్ణయాలు తీసుకునే రోగుల కుటుంబీకులకు చట్ట పరమైన రక్షణ లభిస్తుంది. ఎటువంటి అవకతవకలకు వీలులేకుండా ఈ మార్గదర్శకాలను పక్కాగా అమలు చేయడానికి డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్, డైరెక్టర్ ఆఫ్ సెకండరీ హెల్త్ మరియు జిల్లా స్థాయి డిఎంహెచ్వోలను ప్రభుత్వం బాధ్యులను చేసింది.
కొత్త మార్గదర్శకాలు ఇలా..
కొత్త మార్గదర్శకాల ప్రకారం, పూర్తి స్పృహలో ఉన్న వ్యక్తి ముందుగానే 'అడ్వాన్స్ డైరెక్టివ్' ద్వారా తన చికిత్సపై నిర్ణయాలు తీసుకునే గార్డియన్‌ను నియమించుకోవచ్చు. ఈ పత్రాన్ని నోటరీ లేదా గెజిటెడ్ అధికారి ధ్రువీకరించాలి. రోగి కోలుకునే అవకాశం లేదని వైద్యులు నిర్ధారిస్తే, ఆ డైరెక్టివ్‌లో పేర్కొన్న గార్డియన్‌కు సమాచారం అందించి తదుపరి చర్యలు చేపట్టాలి. రోగి పరిస్థితిని పరిశీలించేందుకు చికిత్స అందిస్తున్న వైద్యుడితో పాటు కనీసం ఐదేళ్ల అనుభవం ఉన్న మరో ఇద్దరు వైద్యులతో ప్రాథమిక వైద్య బోర్డును ఏర్పాటు చేసి 48 గంటల్లో నిర్ణయం తీసుకోవాలి. అనంతరం జిల్లా వైద్యాధికారి (డీఎంహెచ్‌వో), సంబంధిత వైద్యులు, ఇతర నిపుణులతో ద్వితీయ వైద్య బోర్డు ఏర్పాటు చేసి తుది అభిప్రాయం ఇవ్వాలి. రెండు బోర్డుల సిఫార్సులు, గార్డియన్ సమ్మతిని ఫస్ట్ క్లాస్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్‌కు తెలియజేసిన తర్వాత మాత్రమే లైఫ్ సపోర్ట్‌ను నిలిపివేయాలి. ఒకవేళ రోగి ముందస్తుగా అడ్వాన్స్ డైరెక్టివ్ ఇవ్వని పరిస్థితిలో కూడా వైద్య బోర్డుల పరిశీలన, కుటుంబ సభ్యుల సమ్మతి, చట్టబద్ధ ప్రక్రియ అనంతరమే నిర్ణయం తీసుకునేలా మార్గదర్శకాలు రూపొందించారు. రెండు వైద్య బోర్డుల మధ్య భిన్నాభిప్రాయాలు తలెత్తితే సంబంధిత కుటుంబ సభ్యులు హైకోర్టును ఆశ్రయించే అవకాశం కల్పించారు. ఈ విధానాన్ని పారదర్శకంగా అమలు చేసేందుకు డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్, డైరెక్టర్ ఆఫ్ సెకండరీ హెల్త్, జిల్లా వైద్య ఆరోగ్యాధికారులను ప్రభుత్వం బాధ్యులుగా నియమించింది. ఈ ప్రక్రియలో ఎలాంటి పొరపాట్లు జరగకుండా కట్టుదిట్టంగా పర్యవేక్షించాలని మంత్రి సత్యకుమార్ యాదవ్ అధికారులను ఆదేశించారు. కొత్త మార్గదర్శకాలను అనుసరించి అన్ని రికార్డులను రోగి మరణానంతరం కనీసం మూడు సంవత్సరాలు భద్రపరచాలని సూచించారు.






