- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
విదేశీ ఉద్యోగాల ఆశ చూపించి నకిలీ సర్టిఫికెట్ల దందా..
విదేశాల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ నకిలీ విద్యా సర్టిఫికెట్లు తయారు చేసి విక్రయిస్తున్న ముఠా గుట్టును మీర్‌చౌక్ పోలీసులు రట్టు చేశారు.

దిశ, చంపాపేట్: విదేశాల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ నకిలీ విద్యా సర్టిఫికెట్లు తయారు చేసి విక్రయిస్తున్న ముఠా గుట్టును మీర్‌చౌక్ పోలీసులు రట్టు చేశారు. విశ్వసనీయ సమాచారం ఆధారంగా చేపట్టిన ప్రత్యేక ఆపరేషన్‌లో ఒక నిందితుడిని అరెస్ట్ చేసి, అతడి వద్ద నుంచి 15 నకిలీ విద్యా సర్టిఫికెట్లు, ఒక వివో మొబైల్ ఫోన్, ఒక సుజుకి బర్గ్‌మన్ స్కూటర్ స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో మరో ఇద్దరు నిందితులు పరారీలో ఉండగా, వారి కోసం ప్రత్యేక బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి. పోలీసుల కథనం ప్రకారం, జూలై 7న మీర్‌చౌక్ పోలీస్ స్టేషన్‌కు చెందిన ఎస్‌ఐ సి. అనితకు ఎతెబార్ చౌక్ ప్రాంతంలో ఓ వ్యక్తి నకిలీ విద్యా ధ్రువపత్రాలతో సంచరిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం అందింది. ఉన్నతాధికారుల ఆదేశాలతో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసిన పోలీసులు జూలై 8న అబ్దుల్ రషీద్ ఖాన్ (38)ను అదుపులోకి తీసుకుని తనిఖీ చేయగా నకిలీ సర్టిఫికెట్లు బయటపడ్డాయి. స్వాధీనం చేసుకున్న పత్రాల్లో తమిళనాడులోని ఎస్‌ఆర్‌ఎం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ పేరుతో రూపొందించిన బ్యాచిలర్ ఆఫ్ ఫిజియోథెరపీ (బీపీటీ ), బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ గ్రేడ్ కార్డులు, ప్రొవిజనల్ సర్టిఫికెట్లు, కన్సాలిడేటెడ్ మార్క్స్ మెమోలు, అలాగే మహారాష్ట్ర స్టేట్ బోర్డ్ పేరుతో తయారు చేసిన హెచ్‌ఎస్‌సీ, ఇంటర్మీడియట్ సర్టిఫికెట్లు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.
మరో ఇద్దరు నిందితులను త్వరలోనే...
దర్యాప్తులో విదేశాల్లో ఉద్యోగాలు పొందాలనుకునే నిరుద్యోగులను లక్ష్యంగా చేసుకుని నకిలీ విద్యా ధ్రువపత్రాలను విక్రయించడం ద్వారా అక్రమంగా డబ్బు సంపాదించడమే నిందితుల ఉద్దేశమని వెల్లడైంది. ఈ ఘటనపై మీర్‌చౌక్ పోలీస్ స్టేషన్‌లో క్రైం నంబర్ 175/2026 కింద భారతీయ న్యాయ సంహిత (BNS) సెక్షన్లు 338, 339 ప్రకారం కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. పరారీలో ఉన్న మరో ఇద్దరు నిందితులను త్వరలోనే అరెస్ట్ చేస్తామని పోలీసులు తెలిపారు. ఈ కేసును చార్మినార్ జోన్ డీసీపీ ఖరే కిరణ్ ప్రభాకర్, ఐపీఎస్ మార్గదర్శకత్వంలో, అదనపు డీసీపీ ఎం.ఏ. మజీద్, మీర్‌చౌక్ ఏసీపీ జి. శ్యాంసుందర్, ఇన్‌స్పెక్టర్ ఎం. కొండలరావు, డిటెక్టివ్ ఇన్‌స్పెక్టర్ ఎన్. సైదయ్య, ఎస్‌ఐ సి. అనిత ఆధ్వర్యంలోని ప్రత్యేక పోలీసు బృందం ఛేదించింది. కేసు ఛేదనలో విశేష కృషి చేసిన పోలీసు అధికారులను ఉన్నతాధికారులు అభినందించారు.






