రాష్ట్రంలో జలప్రళయం.. ధరాలీ వరద విలయానికి అసలు కారణం ఇదే!

by Jakkula.Mamatha |

ఉత్తరాఖండ్​ ఉత్తరకాశీ జిల్లాలోని ధరాలీ గ్రామంలో ఆకస్మిక వరదలు అల్లకల్లోలం సృష్టించాయి.

రాష్ట్రంలో జలప్రళయం.. ధరాలీ వరద విలయానికి అసలు కారణం ఇదే!
X

దిశ,వెబ్‌డెస్క్: ఉత్తరాఖండ్​ ఉత్తరకాశీ జిల్లాలోని ధరాలీ గ్రామంలో ఆకస్మిక వరదలు అల్లకల్లోలం సృష్టించాయి. కొండపై నుంచి ఒక్కసారిగా దూసుకువచ్చిన వరద నీరు ధరాలీ గ్రామాన్ని నాశనం చేసింది. ఒక్కసారిగా విరుచుకుపడ్డ ఆకస్మిక వరదలతో ధరాలీ గ్రామం అల్లకల్లోలం అయింది. ఈ ఆకస్మిక వరదల్లో చిక్కుకున్న వారిని రక్షించడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సహాయక చర్యలు చేపట్టాయి. ఆర్మీ, ఐటీబీపీ, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు రంగాలోకి దిగాయి. ఇప్పటి వరకు 130 మందిని కాపాడగా, నలుగురు మృతి చెందారు. బురద, శిథిలాల కింద ఇంకా 70 మంది చిక్కుకున్నట్లు సమాచారం.

వరద విలయానికి కారణం..

ధరాలీలో దాదాపు 12,600 అడుగుల ఎత్తు నుంచి వేగవంతమైన నీటి ప్రవాహం దూసుకొచ్చింది. అనంతరం శిథిలాలతో కూడిన ప్రవాహం రావడంతో ఆ ప్రాంతం నామ రూపం లేకుండా పోయింది. అయితే.. అధిక వర్షాలతో పాటు ఈ ప్రాంతంలో మంచు కొండలు ఆకస్మాత్తుగా విచ్ఛిన్నం కావడం వల్లే ఈ విపత్తు జరిగినట్లు భూ విజ్ఞాన శాస్త్రవేత్త ఇమ్రాన్ ఖాన్ వెల్లడించారు. ధరాలీ సమీపంలో గ్లేసియర్ డిపాజిట్స్ గుర్తించినట్లు ఆయన వెల్లడించారు. ఇమ్రాన్ ఖాన్ పంచుకున్న శాటిలైట్ చిత్రాల ప్రకారం ధరాలీ గ్రామానికి సుమారు 7 కిలోమీటర్ల ఎగువన, సముద్ర మట్టానికి 6,700 మీటర్ల ఎత్తులో ఒక గ్లేసియర్ డిపాజిట్ ఉంది.

శాస్త్రవేత్త ఇమ్రాన్ ఖాన్ తెలిపిన వివరాల ప్రకారం.. నిన్న(మంగళవారం) కురిసిన భారీ వర్షాల కారణంగా గ్లేసియల్ నిక్షేపాలపై వరద నీరు అధికంగా చేరింది. దీంతో ఒక్కసారిగా వాటి స్థిరత్వం కోల్పోవడంతో.. అవి విరిగి, భారీ శిథిలాల ప్రవాహానికి దారితీసింది. దీనికితోడు అక్కడి లోయ నిటారుగా ఉండడంతో శిథిలాలు భారీ వేగంతో కిందికి దూసుకువచ్చి ప్రమాదానికి దారితీసింది. ఒక్క నిమిషంలోపే ధరాలీ గ్రామంలో అల్లకల్లోలం సృష్టించింది. దీనిపై ఇమ్రాన్ ఖాన్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఇక్కడ నిర్మాణ పనులు, యాత్రికుల భద్రతపై మరింత శ్రద్ధ పెట్టాల్సిన అవసరాన్ని ఉందన్నారు. ఈ ప్రమాదంతో హిమాలయ ప్రాంతాల్లోని ఇతర లోయల్లో కూడా ఇలాంటి పరిస్థితులు ఉండవచ్చని ఇమ్రాన్ ఖాన్ అన్నారు. ఈ సమస్యపై దృష్టి పెట్టాలని, భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా నివారించడానికి చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు.

Next Story