ప్రపంచానికి చక్రవర్తి అవసరం లేదు: ట్రంప్‌కు బ్రెజిల్ అధ్యక్షుడు లూలా కౌంటర్

by Yella Dhawani Reddy |   (  Updated:2025-07-08 05:46:27  IST  )

అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Trump) చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు అంతర్జాతీయంగా చర్చనీయాంశంగా మారుతున్నాయి.

ప్రపంచానికి చక్రవర్తి అవసరం లేదు: ట్రంప్‌కు బ్రెజిల్ అధ్యక్షుడు లూలా కౌంటర్
X

దిశ, వెబ్ డెస్క్: అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Trump) చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు అంతర్జాతీయంగా చర్చనీయాంశంగా మారుతున్నాయి. బ్రిక్స్‌ (BRICS) దేశాలపై అదనపు 10 శాతం దిగుమతి సుంకాలు విధించనున్నట్లు ఆయన హెచ్చరించిన సంగతి తెలిసిందే. దీనిపై బ్రెజిల్ అధ్యక్షుడు లూయిస్ ఇన్నాసియో లూలా డా సిల్వా (Lula da Silva) ఘాటుగా స్పందించారు.

బ్రెజిల్‌ (Brazil)లో జరిగిన బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశం (Brics summit) ముగింపు కార్యక్రమంలో లూలా మాట్లాడారు. 'ప్రపంచం మునుపటి స్థితిలో లేదు. కాబట్టి ఒకే దేశం పాలకుడిలా వ్యవహరించాల్సిన అవసరం లేదు. ప్రపంచానికి చక్రవర్తి అవసరం లేదు. అని లూలా డిసిల్వా పేర్కొన్నారు. అంతేకాకుండా, తమ దేశంతో పాటు BRICS కూటమిలోని ఇతర సభ్యదేశాలన్నీ సార్వభౌమత్వం కలిగిన స్వతంత్ర దేశాలేనని ఆయన గుర్తు చేశారు. అమెరికా నిర్ణయాలు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇతర దేశాలపై ప్రభావం చూపడం సరైనది కాదని ఆయన అభిప్రాయపడ్డారు. ఒకరిని ఎదుర్కోవడం కోసం బ్రిక్స్‌ ఎవరికీ హాని చేయదని, కానీ రాజకీయాలు చేసేందుకు మరో ఉదాహరణ ఉండాలని మాత్రమే ఈ కూటమి కోరుకుంటోందని లూలా వ్యాఖ్యానించారు.

కాగా, బ్రిక్స్‌ సదస్సు జరుగుతున్న వేళ ట్రంప్‌ తన ట్రూత్‌ సోషల్‌లో ఒక పోస్టు పెట్టారు. అందులో బ్రిక్స్‌ అమెరికా వ్యతిరేక విధానాలకు మద్దతిచ్చే ఏ దేశానికైనా అదనంగా 10 శాతం టారిఫ్‌లు విధిస్తామని పేర్కొన్నారు. ఇందులో ఎలాంటి మినహాయింపులు ఉండవని హెచ్చరించారు.

Next Story