అమ్మ లేని లోటు ఆ బొమ్మలోనే... కన్నీళ్లు పెట్టిస్తున్న చిట్టి కోతి 'పంచ్' కథ!

by Ramesh Naini |

జపాన్‌లోని ఓ జూలో ఉన్న 'పంచ్' అనే ఆరు నెలల కోతి పిల్ల కథ నెట్టింట వైరల్ అవుతూ, జూకు పర్యాటకుల తాకిడి పెరిగేలా చేసింది.

అమ్మ లేని లోటు ఆ బొమ్మలోనే... కన్నీళ్లు పెట్టిస్తున్న చిట్టి కోతి పంచ్ కథ!
X

దిశ, డైనమిక్ బ్యూరో: అమ్మ ప్రేమకు నోచుకోని ఓ చిట్టి కోతి పిల్ల, ఓ మెత్తటి కోతి బొమ్మలో తన తల్లిని వెతుక్కుంటున్న వైనం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా నెటిజన్ల హృదయాలను కదిలిస్తోంది. జపాన్‌లోని ఇచికవా జూలో ఉన్న 'పంచ్' అనే ఆరు నెలల మకాక్ జాతి కోతి పిల్ల కథ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతూ, జూకు పర్యాటకుల తాకిడి పెరిగేలా చేసింది. జూ అధికారుల సమాచారం ప్రకారం, పంచ్ 2025 జూలైలో జన్మించింది. అయితే, దురదృష్టవశాత్తు పుట్టిన వెంటనే తల్లి దాన్ని తిరస్కరించింది. సాధారణంగా ఈ జాతి కోతుల తల్లులు చిన్న వయసులో ఉండడం వల్ల గానీ, లేదా ఇతర బలమైన కోతుల నుంచి ముప్పు ఉన్నప్పుడు గానీ పిల్లలను వదిలేసే అవకాశాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. తల్లి వదిలేయడంతో అనాథగా మారిన పంచ్‌ను జూ సిబ్బంది పెంచడం ప్రారంభించారు.

తోడుగా మారిన ఒరాంగుటాన్ బొమ్మ..

కోతి పిల్లలు పుట్టినప్పటి నుంచి తల్లిని హత్తుకుని ఉండటం సహజం. ఆ స్పర్శ లేక ఆందోళన చెందుతున్న పంచ్‌కు ఊరట కలిగించేందుకు సిబ్బంది కొన్ని మెత్తటి బొమ్మలను, దుప్పట్లను ఇచ్చారు. ఆశ్చర్యకరంగా, పంచ్ వాటిలో ఒక 'ఒరాంగుటాన్' (పెద్ద కోతి జాతి) బొమ్మను ఎంచుకుంది. అప్పటి నుంచి ఆ బొమ్మే దానికి అమ్మైంది. నిద్రపోయేటప్పుడు దాన్ని గట్టిగా హత్తుకోవడం, ఎక్కడికి వెళ్లినా తనతో తీసుకెళ్లటం వంటి దృశ్యాలు చూపరులను కట్టిపడేస్తున్నాయి.

రక్షణ కవచంలా..

ఇటీవల పంచ్‌ను ఇతర కోతుల సమూహంలోకి (Troop) ప్రవేశపెట్టారు. అక్కడ ఇతర కోతి పిల్లలు తనను భయపెట్టినా, ఆటపట్టించినా.. పంచ్ ఆ బొమ్మను ఒక రక్షణ కవచంలా అడ్డుపెట్టుకుంటోందని జూ సిబ్బంది తెలిపారు. ఇతర కోతులతో కలుపుగోలుగా ఉంటున్నప్పటికీ, తన 'బొమ్మ'ని మాత్రం పంచ్ క్షణం కూడా విడిచి పెట్టడం లేదు. ఈ వీడియోలు చూసిన నెటిజన్లు ఎమోషనల్ అయ్యారు. పంచ్ అమాయకత్వం, ఆ బొమ్మపై చూపిస్తున్న ప్రేమే ఇప్పుడు ఇంటర్నెట్‌లో చర్చనీయాంశంగా మారింది.

Next Story