- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అమెరికాలో స్వామి వివేకానంద తొలి విగ్రహం.. సియాటెల్‌లో చారిత్రక ఆవిష్కరణ
అమెరికాలోని సియాటెల్ నగరంలో ప్రముఖ భారతీయ తత్వవేత్త, ఆధ్యాత్మిక గురువు స్వామి వివేకానంద తొలి నిలువెత్తు కాంస్య విగ్రహాన్ని ఘనంగా ఆవిష్కరించారు.

దిశ, డైనమిక్ బ్యూరో: అమెరికాలోని సియాటెల్ నగరంలో ప్రముఖ భారతీయ తత్వవేత్త, ఆధ్యాత్మిక గురువు స్వామి వివేకానంద తొలి నిలువెత్తు కాంస్య విగ్రహాన్ని ఘనంగా ఆవిష్కరించారు. సియాటెల్ డౌన్‌టౌన్‌లోని అత్యంత రద్దీగా ఉండే ‘వెస్ట్‌లేక్ స్క్వేర్’లో ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. అమెరికాలో ఒక నగర ప్రభుత్వం ఆధ్వర్యంలో వివేకానందుని విగ్రహాన్ని ఏర్పాటు చేయడం ఇదే తొలిసారి కావడం విశేషం. శనివారం జరిగిన ఈ కార్యక్రమంలో సియాటెల్ మేయర్ కేటీ విల్సన్, సియాటెల్‌లోని భారత కాన్సుల్ జనరల్ ప్రకాష్ గుప్తా ఈ విగ్రహాన్ని సంయుక్తంగా ఆవిష్కరించారు. ఐసీసీఆర్ (ICCR) దినోత్సవాన్ని పురస్కరించుకుని భారత సాంస్కృతిక సంబంధాల మండలి సియాటెల్ నగరానికి ఈ విగ్రహాన్ని బహుమతిగా అందించింది. ప్రఖ్యాత భారతీయ శిల్పి నరేష్ కుమార్ కుమావత్ ఈ విగ్రహాన్ని అత్యద్భుతంగా తీర్చిదిద్దారు.
చికాగో నుంచి సియాటెల్ వరకు..
ఈ స్మారక చిహ్నం సియాటెల్ సమ్మిళిత స్ఫూర్తికి అద్దం పడుతుందని, భారత్-అమెరికాల మధ్య సాంస్కృతిక సంబంధాలను మరింత బలోపేతం చేస్తుందని మేయర్ కేటీ విల్సన్ పేర్కొన్నారు. ‘1893 చికాగో నుంచి 2026 సియాటెల్ వరకు! సియాటెల్ నగరానికి కొత్త భారతీయ ఐకాన్ దొరికారు’ అని భారత కాన్సులేట్ జనరల్ ఎక్స్ (ట్విట్టర్) వేదికగా హర్షం వ్యక్తం చేసింది.
ప్రముఖ ప్రాంతంలో ఏర్పాటు
ప్రతిరోజూ సుమారు 4 లక్షల మంది సందర్శించే వెస్ట్‌లేక్ స్క్వేర్‌లో, అమెజాన్ ప్రధాన కార్యాలయం, సియాటెల్ కన్వెన్షన్ సెంటర్ వంటి ప్రధాన మైలురాళ్లకు సమీపంలో ఈ విగ్రహం కొలువైంది. 1893లో చికాగోలో జరిగిన ప్రపంచ మత సమ్మేళనంలో ప్రసంగించడం ద్వారా భారతీయ వేదాంత, యోగా శాస్త్రాలను పాశ్చాత్య ప్రపంచానికి పరిచయం చేసిన వివేకానందుని వారసత్వానికి, విశ్వమానవ కల్యాణానికి ఈ విగ్రహం ఒక గొప్ప నివాళిగా నిలుస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ ఆవిష్కరణ కార్యక్రమానికి స్థానిక ప్రజాప్రతినిధులు, మేయర్లు, పెద్ద ఎత్తున భారతీయ-అమెరికన్ ప్రవాసులు హాజరయ్యారు.






