తుది దశకు భారత్, అమెరికా మధ్యంతర వాణిజ్య ఒప్పందం

by Shamantha N |

ఇండియా, అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందం జులై 8న ప్రకటించే అవకాశం ఉందని అధికార వర్గాలు తెలిపాయి.

తుది దశకు భారత్, అమెరికా మధ్యంతర వాణిజ్య ఒప్పందం
X

దిశ, నేషనల్ బ్యూరో: ఇండియా, అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందం జులై 8న ప్రకటించే అవకాశం ఉందని అధికార వర్గాలు తెలిపాయి. వాణిజ్య విభాగంలో ప్రత్యేక కార్యదర్శి రాజేష్ అగర్వాల్ నేతృత్వంలోని భారత బృందం, ఈ చర్చల తుది దశను ముగించేందుకు వాషింగ్టన్ చేరుకుంది. ఈ ఒప్పందం కుదుర్చుకోవడం భారత్ కు కీలకం కానుంది. ప్రపంచ దేశాలపై టారిఫ్‌లు (reciprocal tariffs) విధించేందుకు ట్రంప్ ఇచ్చిన గడువు జులై 9న ముగుస్తోంది. గతవారం ఫాక్స్ న్యూస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో టారిఫ్ గడువులు పొడిగించే అవకాశం లేదని ట్రంప్ స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో అమెరికా భారత దిగుమతులపై విధించిన అదనపు 26 శాతం లెవీలను జులై 9 వరకు తాత్కాలికంగా నిలిపివేసింది. ఈ విషయాన్ని ట్రంప్ ఏప్రిల్ 2న ప్రకటించారు. 10 శాతం ప్రాథమిక టారిఫ్ మాత్రం ఇంకా అమలులో ఉన్నాయి. ఈ అదనపు 26 శాతం నుంచి భారత్ పూర్తిగా మినహాయింపు కోరుతోంది. ఇరు దేశాలు అక్టోబర్ నాటికి బహుళ రంగాల్లో పూర్తి స్థాయి ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం (BTA)కు మొదటి విడతను సిద్ధం చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాయి. ఇటీవలి కాలంలో ట్రంప్ భారత్‌తో భారీ వాణిజ్య ఒప్పందం జరుగబోతుందనే సంకేతాలను ఇచ్చారు. ఈ వాణిజ్య ఒప్పందం ప్రధానంగా వ్యవసాయం, ఆటోమొబైల్‌లు, పారిశ్రామిక ఉత్పత్తులు, కార్మిక ఆధారిత రంగాలపై ఉండనున్నట్లు తెలుస్తోంది.

అమెరికా కోరుతున్నవి:

అమెరికా ఈ వాణిజ్య ఒప్పందంలో భాగంగా కొన్ని పారిశ్రామిక ఉత్పత్తులు, ఆటోమొబైల్‌లు, ఎలక్ట్రిక్ వాహనాలు, వైన్‌లు, పెట్రోకెమికల్, డెయిరీ, వ్యవసాయ ఉత్పత్తులు వంటి ఆపిల్స్, ట్రీ నట్స్ (చెట్టు గింజలు), తదితర పంటలపై డ్యూటీ మినహాయింపు కోరుతోంది.

భారత్ కోరుతున్నవి:

భారత్ కార్మికాధారిత రంగాల్లో డ్యూటీ మినహాయింపులను కోరుతోంది. వస్త్రాలు, రత్నాలు, ఆభరణాలు, చర్మ ఉత్పత్తులు, గార్మెంట్లు, ప్లాస్టిక్, రసాయనాలు, రొయ్యలు, నూనెగింజలు, ద్రాక్ష, అరటిపళ్లను అమెరికా మార్కెట్లో దిగుమతులకు భారత్ రాయితీలను కోరుతుంది.

Next Story