పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు.. ఢిల్లీ ఎయిర్‌పోర్టు నుంచి 80 విమానాలు రద్దు

by Ramesh Naini |

మిడిల్ ఈస్ట్‌లో నెలకొన్న యుద్ధ వాతావరణం అంతర్జాతీయ విమాన సర్వీసులను అతలాకుతలం చేస్తోంది.

పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు.. ఢిల్లీ ఎయిర్‌పోర్టు నుంచి 80 విమానాలు రద్దు
X

దిశ, డైనమిక్ బ్యూరో: మిడిల్ ఈస్ట్‌లో నెలకొన్న యుద్ధ వాతావరణం అంతర్జాతీయ విమాన సర్వీసులను అతలాకుతలం చేస్తోంది. పశ్చిమాసియా దేశాల్లో పెరుగుతున్న ఉద్రిక్తతల వల్ల తలెత్తిన నిర్వహణపరమైన ఆటంకాల కారణంగా, మంగళవారం ఒక్కరోజే ఢిల్లీ విమానాశ్రయంలో 80 అంతర్జాతీయ విమానాలు రద్దయ్యాయి.

మూడు రోజుల్లో 1,117 విమానాలు నిలిపివేత

గడచిన మూడు రోజుల్లో భారతీయ ఎయిర్‌లైన్స్ సంస్థలు పశ్చిమాసియా సంక్షోభం కారణంగా మొత్తం 1,117 విమానాలను రద్దు చేసినట్లు అధికారులు వెల్లడించారు. ఢిల్లీ విమానాశ్రయానికి సంబంధించి మంగళవారం రద్దయిన 80 సర్వీసుల్లో 36 బయలుదేరాల్సినవి (Departures) కాగా, 44 రావాల్సినవి (Arrivals) ఉన్నట్లు అధికారులు ధృవీకరించారు.

గగనతల ఆంక్షలతో వెనుదిరిగిన విమానం

మధ్యప్రాచ్యంలో గగనతల ఆంక్షల కారణంగా విమానాల దారి మళ్లింపు, జాప్యం జరుగుతోంది. ఢిల్లీ నుంచి దుబాయ్ బయలుదేరిన ఎమిరేట్స్ విమానం (EK513), ఆంక్షల కారణంగా మధ్యలోనే వెనుదిరిగి తిరిగి ఢిల్లీకి చేరుకుంది. ఉద్రిక్తతల నడుమ దుబాయ్ నుంచి 149 మంది ప్రయాణికులతో ఎయిర్ ఇండియా విమానం (AI916D) మంగళవారం క్షేమంగా ఢిల్లీకి చేరుకుంది. దుబాయ్‌లో చిక్కుకుపోయిన 143 మంది ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ సిబ్బందిని ప్రత్యేక విమానం (AI918D) ద్వారా స్వదేశానికి తరలించారు. ‘పశ్చిమాసియాలో నెలకొన్న రాజకీయ పరిస్థితుల దృష్ట్యా పశ్చిమ దేశాలకు వెళ్లే అంతర్జాతీయ విమానాల రాకపోకల్లో జాప్యం లేదా మార్పులు జరుగుతున్నాయి.’అని DIAL (ఢిల్లీ విమానాశ్రయం) తెలిపింది.

ప్రయాణికుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు

విమానాల రద్దుతో ఇబ్బంది పడుతున్న ప్రయాణికుల కోసం ఢిల్లీ విమానాశ్రయ సంస్థ (DIAL) పలు చర్యలు చేపట్టింది. విమానాశ్రయంలో అదనంగా 400 సీట్లు, రిక్లైనర్ల ఏర్పాటు చేసింది. అదనపు వైద్య బృందాల నియమించింది. ప్రయాణికుల సౌకర్యార్థం పారిశుధ్య బృందాలను పెంచింది.

Next Story