పర్షియన్‌ గల్ఫ్‌లో ఉద్రిక్తతలు.. చిక్కుకున్న 7 భారత నౌకలు, 148 మంది సిబ్బంది!

by Ramesh Naini |

అమెరికా-ఇరాన్‌ల మధ్య మళ్లీ యుద్ధ వాతావరణం నెలకొనడంతో వ్యూహాత్మక హర్మూజ్‌ జలసంధిలో నౌకల రవాణాకు తీవ్ర ఆటంకం ఏర్పడింది.

పర్షియన్‌ గల్ఫ్‌లో ఉద్రిక్తతలు.. చిక్కుకున్న 7 భారత నౌకలు, 148 మంది సిబ్బంది!
X

దిశ, డైనమిక్ బ్యూరో: అమెరికా-ఇరాన్‌ల మధ్య మళ్లీ యుద్ధ వాతావరణం నెలకొనడంతో వ్యూహాత్మక హర్మూజ్‌ జలసంధిలో నౌకల రవాణాకు తీవ్ర ఆటంకం ఏర్పడింది. ఈ ఉద్రిక్తతల నేపథ్యంలో భారత జెండాతో ఉన్న 7 నౌకలు, అందులోని 148 మంది భారతీయ సిబ్బంది పర్షియన్‌ గల్ఫ్‌లోనే చిక్కుకుపోయినట్లు తాజాగా కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. అలాగే, భారత్‌కు వస్తున్న ఎరువులు, ఇతర సరుకులతో కూడిన మరో 11 విదేశీ నౌకలను సురక్షితంగా తరలించేందుకు (ఎవాక్యుయేషన్) ఏర్పాట్లు జరుగుతున్నట్లు తెలిసింది. ప్రస్తుతం గల్ఫ్ రీజియన్‌లో చిక్కుకున్న భారతీయ నావికులను రక్షించేందుకు కేంద్ర ప్రభుత్వం భారత నౌకాదళంతో (ఇండియన్ నేవీ) నిరంతరం సమన్వయం చేసుకుంటున్నట్లు సమాచారం.

మిస్సైల్ దాడుల్లో భారతీయుడి మృతి..

ఇటీవల ఇరాన్-అమెరికాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం రద్దయ్యాక గల్ఫ్ ప్రాంతంలో దాడులు ముదిరాయి. హర్మూజ్‌ జలసంధి గుండా వెళ్తున్న యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) కు చెందిన ‘మొంబాసా’, ‘అల్ బహియా’ అనే రెండు ఆయిల్ ట్యాంకర్లపై మిస్సైల్ దాడులు జరిగాయి. ఈ ప్రమాదంలో ఒక భారతీయ నావికుడు మరణించగా, ఆరుగురు గాయపడ్డారు. తమ హెచ్చరికలను బేఖాతరు చేయడం వల్లే ఈ దాడులు చేసినట్లు ఇరాన్‌కు చెందిన ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) ప్రకటించింది. తాజా ఘటనతో కలిపి ఈ ఏడాది ఫిబ్రవరి 28 నుంచి మొదలైన ఈ పశ్చిమాసియా ఘర్షణల్లో ఇప్పటివరకు ప్రాణాలు కోల్పోయిన భారతీయ నావికుల సంఖ్య 14కు చేరినట్లు జాతీయ మీడియా స్పష్టం చేస్తోంది.

మార్గాల వివాదం.. పట్టుబడుతున్న అమెరికా, ఇరాన్

హర్మూజ్‌ జలసంధిని దాటడానికి రెండు మార్గాలు ఉన్నాయి. ఒమన్ సరిహద్దుల గుండా వెళ్లే దక్షిణ మార్గాన్ని అమెరికా, అంతర్జాతీయ నౌకాయాన సంస్థ (IMO) సమర్థిస్తుండగా, తమ జలాల గుండా వెళ్లే ఉత్తర మార్గాన్నే వాడాలని ఇరాన్ పట్టుబడుతోంది. ఇరాన్ దాడుల భయంతో దక్షిణ మార్గంలో నౌకల రాకపోకలు పూర్తిగా స్తంభించిపోయాయి. కొన్ని నౌకలు తమ లొకేషన్ ట్రాకర్లను (ట్రాన్స్‌పాండర్లు) నిలిపివేసి రహస్యంగా ప్రయాణిస్తున్నట్లు సమాచారం.

భద్రతా ఛార్జీలపై ట్రంప్ ప్రకటన

ఇరాన్ ఈ జలసంధిని మూసివేస్తామని హెచ్చరించడంతో, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్రంగా స్పందించారు. హర్మూజ్ జలసంధి ఎప్పటికీ తెరిచే ఉంటుందని, దానికి అమెరికా సైన్యమే సంరక్షకుడిగా ఉంటుందని స్పష్టం చేశారు. అయితే, ఈ మార్గం గుండా వెళ్లే అన్ని రకాల సరుకు రవాణాపై 20 శాతం భద్రతా రుసుము (ఛార్జీ) వసూలు చేస్తామని ట్రంప్ ప్రకటించడం అంతర్జాతీయంగా సంచలనం సృష్టిస్తోంది. ఈ ప్రతిపాదనను అంతర్జాతీయ నౌకాయాన సంస్థ (IMO) తో పాటు ఇరాన్ కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి.

Next Story