సీజనల్ వ్యాధుల నివారణే లక్ష్యం.. నరేందర్ రాథోడ్

by Batti.Sumithra |

మంచిర్యాల జిల్లా చెన్నూరు ఎంపీడీవో కార్యాలయంలో మంగళవారం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో సీజనల్ వ్యాధుల పై సమీక్ష సమావేశం నిర్వహించారు.

సీజనల్ వ్యాధుల నివారణే లక్ష్యం.. నరేందర్ రాథోడ్
X

దిశ, చెన్నూర్ : మంచిర్యాల జిల్లా చెన్నూరు ఎంపీడీవో కార్యాలయంలో మంగళవారం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో సీజనల్ వ్యాధుల పై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి జిల్లా వైద్య ఆరోగ్య అధికారి (డీఎంహెచ్‌ఓ) నరేందర్ రాథోడ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వర్షాకాలంలో డెంగ్యూ, మలేరియా, వైరల్ జ్వరాలు, విరేచనాలు వంటి సీజనల్ వ్యాధుల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తల పై అవగాహన కల్పించారు. ప్రతి గ్రామం, ప్రతి కాలనీలో ఆశా కార్యకర్తలు ఇంటింటికీ వెళ్లి ప్రజలకు పరిశుభ్రత, దోమల నివారణ చర్యలు, తాగునీటి పరిశుభ్రతపై అవగాహన కల్పించాలని సూచించారు. జ్వరం లేదా ఇతర అనారోగ్య లక్షణాలు కనిపించిన వెంటనే సమీప ప్రభుత్వ ఆసుపత్రిని సంప్రదించాలని ప్రజలకు తెలియజేయాలని.

సీజనల్ వ్యాధుల నియంత్రణలో ఆరోగ్య సిబ్బంది సమన్వయంతో పనిచేసి ప్రజల ఆరోగ్య పరిరక్షణకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. జాతీయ ఆరోగ్య కార్యక్రమాలను రోజువారీగా పోర్టల్ లో నమోదు చేయాలని ప్రభావిత గ్రామాల్లో వైద్య శిబిరాలను ఏర్పాటు చేయాలని, వైద్యులు వైద్య సిబ్బంది సమయపాలన పాటిస్తూ ప్రజలకు ఎటువంటి సమస్యలు లేకుండా చూడాలని ఆయన అన్నారు. వర్షాకాలంలో తాగునీటి ద్వారా సంక్రమించే టైఫాయిడ్ కలరా వాంతులు విరేచనాలు అతిసార లాంటివి ప్రబలకుండా వేడి చేసి చల్లార్చిన నీటిని తాగాలని ఆయన సూచించారు. ప్రతి మంగళ, శుక్రవారం శుభ్రత కోసం సమయం కేటాయించి ప్రతి ఇంటిలో నిల్వ ఉన్న నీటిని శుభ్రం చేసుకునే విధంగా సిబ్బంది ప్రజలకు తెలియజేయాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రోగ్రామ్ ఆఫీసర్ సుధాకర్ నాయక్, డాక్టర్ అరుణ శ్రీ, డాక్టర్ సత్యనారాయణ, డాక్టర్ కృష్ణ తేజ, వైద్య శాఖ సిబ్బంది ఆశా వర్కర్లు పాల్గొన్నారు.

Next Story