బ్యారేజీలకు ఏమైనా జరిగితే 28 మందిమి రాజీనామా చేస్తాం: సీఎంకు పాడి కౌశిక్ రెడ్డి ఓపెన్ ఛాలెంజ్!

by Ramesh Naini |

‘అన్నారం, సుందిళ్ల, బ్యారేజ్‌కు ఏమైనా జరిగితే 28 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలం బాధ్యత వహిస్తాం. రాజీనామా చేస్తాం. రాజకీయాలకు దూరంగా ఉంటాం. సీఎం రేవంత్‌రెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి ఇదే నా సవాల్’ అని హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.

బ్యారేజీలకు ఏమైనా జరిగితే 28 మందిమి రాజీనామా చేస్తాం: సీఎంకు పాడి కౌశిక్ రెడ్డి ఓపెన్ ఛాలెంజ్!
X

దిశ, తెలంగాణ బ్యూరో: ‘అన్నారం, సుందిళ్ల, బ్యారేజ్‌కు ఏమైనా జరిగితే 28 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలం బాధ్యత వహిస్తాం. రాజీనామా చేస్తాం. రాజకీయాలకు దూరంగా ఉంటాం. సీఎం రేవంత్‌రెడ్డి, ఉత్తమ్‌ కుమార్‌రెడ్డికి ఇదే నా సవాల్’ అని హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌ రెడ్డి ఓపెన్ ఛాలెంజ్ చేశారు. మంగళవారం తెలంగాణ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. భూ దందాలు చేసుకునే రేవంత్‌ రెడ్డికి రైతుల గురించి తెలియదన్నారు. కన్నెపల్లి పంపులు ఆన్ చేయకుంటే తాగునీటికి కష్టం అవుతుందని పేర్కొన్నారు. కన్నెపల్లి పంప్ హౌస్ ద్వారా నీళ్లను ఎందుకు ఎత్తడం లేదో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. రైతులు చేసిన తప్పేంటని నిలదీశారు. కన్నెపల్లి పంప్ హౌస్ ద్వారా రైతులకు నీరు ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. నీళ్లు ఇవ్వకపోతే రైతులకు ఇచ్చే బోనస్, భరోసా ఇవ్వకుండా పోతుందని సీఎం ఆలోచన అని ఆరోపించారు. మొక్కజొన్న రైతుల కమీషన్ ఎవరు తింటున్నారో రేవంత్ సమాధానం చెప్పాలన్నారు. 65, 70 శాతం వరకే మొక్కజొన్న రైతులకు డబ్బులు వేశారని ఆరోపించారు.

ఎమ్మెల్యే గంగుల కమలాకర్ మాట్లాడుతూ.. ఉత్తర తెలంగాణలో పంటలు ఎండిపోతున్నాయని.. తాగునీరుకు ఇబ్బంది అవుతున్నదని అన్నారు. కరీంనగర్ ఏం తప్పు చేసిందని.. మంత్రుల బృందం ఎందుకు రావడం లేదని ప్రశ్నించారు. అసెంబ్లీ విప్ కేపీ వివేకానంద మాట్లాడుతూ.. ఎల్‌నినో ప్రభావంతో రాష్ట్రంలో సాగునీటితోపాటు తాగునీటికి ఇబ్బందులు తప్పేలా లేవని.. హైదరాబాద్ నగరానికి ఈ సమస్య మరింత ఎక్కువయ్యే అవకాశం కనిపిస్తున్నదని అన్నారు. రైతుల ప్రయోజనాలు పక్కనపెట్టి రాజకీయాలకే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని అన్నారు. రేవంత్‌రెడ్డి లాంటి వ్యక్తి సీఎంగా ఉండడం ప్రజల దురదృష్టమన్నారు. హిట్లర్ తుగ్లక్ కలిస్తే అది రేవంత్‌రెడ్డి అని విమర్శించారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యేలు ముఠా గోపాల్, బండారి లక్ష్మారెడ్డి పాల్గొన్నారు.

Next Story