- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సుస్థిర అభివృద్ధి-కాలుష్య నియంత్రణపై జాతీయ సదస్సు.. బ్రోచర్ ఆవిష్కరణ
కాకతీయ విశ్వవిద్యాలయం స్వర్ణోత్సవ వేడుకల సందర్భంగా ఆగస్టు 12, 13 తేదీల్లో సుస్థిర అభివృద్ధి-కాలుష్య నియంత్రణపై జాతీయ సదస్సు జరగనుంది.

దిశ, తెలంగాణ బ్యూరో: వాతావరణ మార్పులు, సుస్థిర అభివృద్ధి అనేవి 21వ శతాబ్దంలో ప్రపంచం ఎదుర్కొంటున్న అత్యంత కీలకమైన సవాళ్లని తెలంగాణ ఉన్నత విద్యామండలి (TGCHE) చైర్మన్ ప్రొఫెసర్ వి.బాలకిష్టారెడ్డి పేర్కొన్నారు. వరంగల్‌లోని కాకతీయ విశ్వవిద్యాలయం స్వర్ణోత్సవ వేడుకల సందర్భంగా ఈ ఏడాది ఆగస్టు 12, 13 తేదీలలో నిర్వహించనున్న జాతీయ సదస్సు బ్రోచర్‌ను ఆయన మంగళవారం ఆవిష్కరించారు. ‘సుస్థిర అభివృద్ధి కోసం సంస్థల సమన్వయం: కాలుష్య నియంత్రణకు వ్యూహాత్మక, బహుళ భాగస్వామ్య విధానం’ అనే ఇతివృత్తంతో ఈ సదస్సు జరగనుంది.
సమష్టిగా ముందుకు సాగాలి..
ఈ సందర్భంగా ప్రొఫెసర్ వి. బాలకిష్టారెడ్డి మాట్లాడుతూ పర్యావరణ సమస్యలకు భౌగోళిక సరిహద్దులు ఉండవని, వీటి పరిష్కారానికి విద్యాసంస్థలు, ప్రభుత్వ విభాగాలు, పరిశ్రమలు, పౌర సమాజం సమన్వయంతో సమిష్టిగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఈ దిశగా తెలంగాణ ఉన్నత విద్యామండలి ఇప్పటికే క్లైమేట్ చేంజ్, సస్టైనబిలిటీ, ఎన్విరాన్‌మెంటల్ గవర్నెన్స్ వంటి వినూత్న అండర్ గ్రాడ్యుయేట్ (యూజీ), పోస్ట్ గ్రాడ్యుయేట్ (పీజీ) కోర్సులను ప్రవేశపెట్టిందని గుర్తుచేశారు. నవకల్పనలను ప్రోత్సహిస్తూ, ఆచరణాత్మక పర్యావరణ పరిష్కారాలను కనుగొనడంలో విశ్వవిద్యాలయాలు కీలక పాత్ర పోషించాలన్నారు.
ప్రముఖులంతా ఒకే వేదికపైకి..
కాకతీయ విశ్వవిద్యాలయం వైస్-ఛాన్స్‌లర్ ప్రొఫెసర్ కె.ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ కాలుష్య నియంత్రణ, సుస్థిర అభివృద్ధికి సంబంధించిన వ్యూహాత్మక అంశాలపై సమగ్రంగా చర్చించేందుకు దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖ శాస్త్రవేత్తలు, పరిశోధకులు, విధాన రూపకర్తలు, పరిశ్రమల ప్రతినిధులు, పర్యావరణ నిపుణులను ఒకే వేదికపైకి తీసుకురావడమే ఈ సదస్సు ముఖ్య ఉద్దేశ్యమని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఉన్నత విద్యామండలి వైస్-ఛైర్మన్ ప్రొఫెసర్ ఈ.పురుషోత్తం, తదితర విద్యావేత్తలు పాల్గొన్నారు.






