బ్యాక్‌వాటర్‌లో ప్రత్యక్ష మాక్ డ్రిల్...!

by Batti.Sumithra |

విపత్తులు సంభవించే సమయంలో ప్రజల ప్రాణాలు, ఆస్తులను రక్షించేందుకు తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్తలు, అత్యవసర సహాయక చర్యలపై రెండు రోజుల పాటు పెద్దమునిగల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన విపత్తు నిర్వహణ అవగాహన సదస్సు మంగళవారం విజయవంతంగా ముగిసింది.

బ్యాక్‌వాటర్‌లో ప్రత్యక్ష మాక్ డ్రిల్...!
X

దిశ, నేరేడుగొమ్ము : విపత్తులు సంభవించే సమయంలో ప్రజల ప్రాణాలు, ఆస్తులను రక్షించేందుకు తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్తలు, అత్యవసర సహాయక చర్యలపై రెండు రోజుల పాటు పెద్దమునిగల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన విపత్తు నిర్వహణ అవగాహన సదస్సు మంగళవారం విజయవంతంగా ముగిసింది. నల్లగొండ అడిషనల్ డీఆర్‌డీఏ ప్రాజెక్ట్ డైరెక్టర్ హర్ష్ కుమార్ ఆధ్వర్యంలో, 12వ బెటాలియన్ కమాండెంట్ ఆదేశాల మేరకు ఎస్‌డీఆర్‌ఎఫ్ బృందం ప్రజలకు, విద్యార్థులకు విపత్తుల సమయంలో ఎలా స్పందించాలో ప్రత్యక్షంగా ప్రదర్శిస్తూ సమగ్ర అవగాహన కల్పించింది. సదస్సు ముగింపు సందర్భంగా నాగార్జునసాగర్ బ్యాక్‌వాటర్‌లోని వైజాగ్ కాలనీలో ప్రత్యేక మాక్ డ్రిల్ నిర్వహించారు. వరదల్లో చిక్కుకున్న వారిని సురక్షితంగా ఎలా రక్షించాలి, లైఫ్ జాకెట్ల వినియోగం, తాళ్ల సహాయంతో రెస్క్యూ ఆపరేషన్లు ఎలా చేపట్టాలి, నీటిలో మునిగిన వ్యక్తికి సీపీఆర్ (CPR) ద్వారా గుండె స్పందనను ఎలా పునరుద్ధరించాలి వంటి అంశాలను ఎస్‌డీఆర్‌ఎఫ్ సిబ్బంది ప్రత్యక్షంగా ప్రదర్శించారు. ఈ వినూత్న ప్రదర్శన ప్రజలు, విద్యార్థులను విశేషంగా ఆకట్టుకుంది. అసిస్టెంట్ కమాండర్ ఎన్. వెంకన్న, ఆర్‌ఐ వై. రవీందర్, ఆర్‌ఎస్‌ఐ ఏ. రమేష్, మేజర్లు వెంకటేశ్వర్లు, మురళీధర్ ఆధ్వర్యంలో 38 మంది ఎస్‌డీఆర్‌ఎఫ్ సిబ్బంది మాక్ డ్రిల్‌ను నిర్వహించి, విపత్తుల సమయంలో పాటించాల్సిన రక్షణ చర్యలను వివరించారు.

ఈ కార్యక్రమంలో పెద్దమునిగల్ గ్రామ సర్పంచ్ కేతావత్ అంబలి, అడిషనల్ డీఆర్‌డీఏ ప్రాజెక్ట్ డైరెక్టర్ హర్ష్ కుమార్, తహసీల్దార్ ఉమాదేవి, ఎంపీడీఓ విజయ్ పాల్, నీడిగూడెం ఎస్‌ఐ కే. నాగేంద్రబాబు, స్టేషన్ ఫైర్ ఆఫీసర్ యాదగిరి, ఎంఈఓ బ్రహ్మచారి, మెడికల్ ఆఫీసర్ డాక్టర్ ఆర్. రాజేష్, వెటర్నరీ డాక్టర్ నర్మద, హైస్కూల్ ప్రధానోపాధ్యాయులు నర్సింగ్ బాలాజీ, ఆర్‌డబ్ల్యూఎస్ ఏఈ హుస్సేన్, ట్రాన్స్‌కో ఏఈ సాయి ప్రకాష్, డీఆర్‌డీఏ సూపరింటెండెంట్ ఉసిషిపుద్దీన్, ఏపీఓ ఇర్మియా, ఏపీఎం పురుషోత్తం, గ్రామ కార్యదర్శి బాలరాజుతో పాటు వివిధ శాఖల అధికారులు, సిబ్బంది, విద్యార్థులు, గ్రామస్తులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ, విపత్తు వచ్చిన తర్వాత స్పందించడం కంటే ముందుగానే అప్రమత్తంగా ఉండటం ఎంతో ముఖ్యమని, వరదలు వంటి ప్రకృతి వైపరీత్యాల సమయంలో అధికారుల సూచనలు పాటించడం, అత్యవసర పరిస్థితుల్లో ధైర్యంగా వ్యవహరించడం ద్వారా ప్రాణ, ఆస్తి నష్టాలను గణనీయంగా తగ్గించవచ్చని తెలిపారు. రెండు రోజుల పాటు నిర్వహించిన ఈ అవగాహన సదస్సు ప్రజల్లో విపత్తు నిర్వహణపై చైతన్యాన్ని పెంపొందించడంలో ఎంతో ఉపయోగపడిందని అభిప్రాయపడ్డారు.

Next Story