జపాన్ ఓపెన్‌లో పీవీ సింధు శుభారంభం.. సాత్విక్-చిరాగ్ జోడీకి గాయం బెడద

by Ramesh Naini |

జపాన్ ఓపెన్ (బీడబ్ల్యూఎఫ్ సూపర్ 750) బ్యాడ్మింటన్ టోర్నీలో భారత స్టార్ షట్లర్ పీవీ సింధు శుభారంభం చేయగా, పురుషుల డబుల్స్ స్టార్ జోడీ సాత్విక్ సాయిరాజ్ - చిరాగ్ శెట్టి నిరాశపరిచారు.

జపాన్ ఓపెన్‌లో పీవీ సింధు శుభారంభం.. సాత్విక్-చిరాగ్ జోడీకి గాయం బెడద
X

దిశ, డైనమిక్ బ్యూరో: జపాన్ ఓపెన్ (బీడబ్ల్యూఎఫ్ సూపర్ 750) బ్యాడ్మింటన్ టోర్నీలో భారత స్టార్ షట్లర్ పీవీ సింధు శుభారంభం చేయగా, పురుషుల డబుల్స్ స్టార్ జోడీ సాత్విక్ సాయిరాజ్ - చిరాగ్ శెట్టి నిరాశపరిచారు. వివరాల్లోకి వెళితే.. మహిళల సింగిల్స్ తొలి రౌండ్‌లో పీవీ సింధు 21-14, 21-11 తేడాతో మలేషియాకు చెందిన వాంగ్ లింగ్ చింగ్‌పై వరుస గేమ్‌లలో అలవోకగా విజయం సాధించింది. మ్యాచ్ ఆరంభం నుంచే తనదైన స్మాష్‌లు, అద్భుతమైన డ్రాప్ షాట్లతో చెలరేగిన సింధు.. ప్రత్యర్థికి ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా పూర్తి ఆధిపత్యం ప్రదర్శించి రెండో రౌండ్‌కు దూసుకెళ్లింది.

టోర్నీ నుంచి తప్పుకున్న సాత్విక్-చిరాగ్

పురుషుల డబుల్స్‌లో ప్రపంచ నాలుగో ర్యాంకర్లు సాత్విక్-చిరాగ్ జోడీ అర్థంతరంగా టోర్నీ నుంచి తప్పుకుంది. సాత్విక్ భుజం గాయం కారణంతో డెన్మార్క్‌కు చెందిన డానియల్ - మాడ్స్ వెస్టెర్గార్డ్ జోడీతో జరుగుతున్న మ్యాచ్‌లో తొలి గేమ్‌ను 19-21 తో కోల్పోయిన అనంతరం ఈ భారత జంట రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగింది. ఆగస్టులో స్వదేశంలో జరిగే ప్రపంచ ఛాంపియన్‌షిప్‌కు పూర్తిగా కోలుకుని సన్నద్ధం కావాలనే ఉద్దేశంతో, వచ్చే వారం జరిగే చైనా ఓపెన్‌కు కూడా వీరు దూరం కానున్నట్లు భారత చీఫ్ కోచ్ టాన్ కిమ్ హెర్ తెలిపారు.

ఇతర మ్యాచ్‌ల ఫలితాలు

మిక్స్‌డ్ డబుల్స్‌లో ధ్రువ్ కపిల - తనీషా క్రాస్టో జోడీ 21-16, 21-14 తేడాతో స్కాట్లాండ్ జంట (అలెగ్జాండర్ డన్ - జూలీ)ను ఓడించి రెండో రౌండ్‌కు చేరింది.

తొలి రౌండ్‌లోనే ఓటమి

రోహన్ కపూర్ - రుత్వికా శివాని గద్దె జోడీ 11-21, 10-21 తేడాతో చైనా టాప్ సీడ్ (ఫెంగ్ యాన్ జె - హువాంగ్ డోంగ్ పింగ్) చేతిలో పరాజయం పాలైంది. మరో పురుషుల డబుల్స్ తొలి రౌండ్‌ మ్యాచ్‌లో హరిహరన్ - ఎంఆర్ అర్జున్ జోడీ చైనీస్ తైపీ జంట (లీ జె హ్యూ - యాంగ్ పో సువాన్)తో తలపడనుంది.

Next Story