- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కాపు జాతి ఆత్మగౌరవానికి ప్రతీక ముద్రగడ పద్మనాభం: కేంద్ర మంత్రి బండి సంజయ్
కాపు జాతి ఆత్మగౌరవానికి ప్రతీక ముద్రగడ పద్మనాభం.. ఆయన మృతి పట్ల తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేసిన కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్!

దిశ, తెలంగాణ బ్యూరో: పదవుల కంటే ప్రజల పక్షాన నిలబడటమే గొప్పదని చాటిన నేత ముద్రగడ పద్మనాభం అని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ కొనియాడారు. కాపు జాతి ఆత్మగౌరవానికి ప్రతీక ముద్రగడ అని అభివర్ణించారు. కాపుల హక్కుల కోసం తన జీవితాన్నే పోరాటంగా మార్చుకున్న యోధుడు. కాపు జాతి ఆత్మగౌరవం కోసం ఆకలిని ఆయుధంగా మార్చుకుని నిరాహార దీక్షలు చేసిన నాయకుడు ముద్రగడ పద్మనాభం మరణం తనను తీవ్రంగా కలిచి వేసిందని పేర్కొన్నారు. ముద్రగడ పద్మనాభం మరణవార్త తెలుసుకున్న బండి సంజయ్ కుమార్ తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. ఈ మేరకు మంగళవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ‘ఆంధ్రప్రదేశ్ రాజకీయ, సామాజిక చరిత్రలో కాపు ఉద్యమం గురించి ప్రస్తావన వచ్చినప్పుడల్లా ముందుగా గుర్తుకు వచ్చే పేరు ముద్రగడ పద్మనాభం. కాపు సామాజిక వర్గం హక్కులు, ఆత్మగౌరవం, రాజకీయ ప్రాధాన్యం కోసం దశాబ్దాలుగా నిరంతరంగా పోరాడిన నాయకుడిగా ఆయన ప్రత్యేక గుర్తింపు పొందారు.
తూర్పుగోదావరి జిల్లాలోని కిర్లంపూడి కేంద్రంగా రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన ముద్రగడ పద్మనాభం, ఎమ్మెల్యేగా, మంత్రిగా ప్రజలకు సేవలందించారు. అధికారంలో ఉన్నప్పుడు మాత్రమే కాకుండా, అధికారానికి దూరంగా ఉన్న సమయంలో కూడా ప్రజా సమస్యలపై తన గళాన్ని వినిపించడం ఆయన ప్రత్యేకత. ముఖ్యంగా కాపు సామాజిక వర్గానికి రిజర్వేషన్లు, సముచిత గుర్తింపు కల్పించాలనే డిమాండ్‌తో చేపట్టిన ఉద్యమాలు రాష్ట్ర రాజకీయాల్లో విశేష ప్రభావం చూపాయి. కాపు సమాజం ఎదుర్కొంటున్న సామాజిక, ఆర్థిక సమస్యలను ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లడంలో ముద్రగడ కీలక పాత్ర పోషించారు. తన డిమాండ్ల సాధన కోసం నిరాహార దీక్షలు, నిరసన కార్యక్రమాలు చేపట్టి ఉద్యమానికి కొత్త ఊపును తీసుకువచ్చారు.
అనేక సందర్భాల్లో వ్యక్తిగత ఇబ్బందులను, రాజకీయ ఒత్తిడులను ఎదుర్కొన్నప్పటికీ తన లక్ష్యం నుంచి వెనక్కి తగ్గకపోవడం ఆయన సంకల్పబలానికి నిదర్శనం. ముద్రగడ పద్మనాభం వ్యక్తిత్వంలో నిక్కచ్చితనం, ధైర్యం, నిబద్ధత ప్రధానంగా కనిపిస్తాయి. రాజకీయ లాభనష్టాలను పక్కనపెట్టి తాను నమ్మిన అంశంపై చివరి వరకు నిలబడే నాయకుడిగా ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. కాపు సమాజంలోని అనేక మంది ఆయనను ఉద్యమ స్ఫూర్తిగా, ఆత్మగౌరవ ప్రతీక గా భావిస్తారు. నేటి రాజకీయ పరిస్థితుల్లో కూడా ముద్రగడ పేరు కాపు సమాజంలో విశేష ప్రభావాన్ని కలిగి ఉంది. ఆయన చేసిన పోరాటాలు, ఉద్యమాలు భవిష్యత్ తరాలకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తాయి. కాపు జాతి హక్కుల కోసం అంకితభావంతో పనిచేసిన ఉద్యమనేతగా ముద్రగడ పద్మనాభం పేరు తెలుగు రాష్ట్రాల చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుంది’ అని పేర్కొన్నారు.






